వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు: కేటీఆర్
హైదరాబాద్: వరంగల్ నగరంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ... సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
రాబోయేరోజుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలకు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. అంతకుముందు గీతారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడు వస్తుంది... ఆ విధానంలోని ప్రధాన అంశం ఏమిటీ... అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా...ఎస్సీలు, ఎస్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని గీతారెడ్డి వెల్లడించారు. దాంతో కేటీఆర్ పై విధంగా స్పందించారు.