ఎఫ్‌టీటీహెచ్ సేవలకు శ్రీకారం
-
కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్‌ఎన్‌ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు
-
ప్రారంభించిన ఎంపీ సీతారాంనాయక్
వరంగల్ : అధునాతన ఫైబర్ టు ది హోమ్(ఎఫ్‌టీటీహెచ్) విధానాన్ని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మంగళవారం వరంగల్ నగరంలో ప్రారంభించారు. వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎఫ్‌టీటీహెచ్ తొలి కనెక్షన్‌ను ఆయన వినియోగదారుడికి అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు టెలిఫోన్ ఆపరేటర్లతో పోటీపడేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక రాయితీలను అందిస్తోందన్నారు. ఎఫ్‌టీటీహెచ్ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక‌్షన్ ఇస్తారన్నారు. దీనితో ఇంటర్నెట్ సేవలతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్‌తో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునే సదుపాయాల్ని పొందొచ్చన్నారు. ఇప్పటివరకు ప్రతి ఆదివారం అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత టెలిఫోన్ కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉందని, వచ్చే జనవరి నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్న వారు పూర్తి ఉచితంగా కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా బీఎస్‌ఎన్‌ఎల్ చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ పీసీజీఎం కె.నరేందర్ మాట్లాడుతూ ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు ధీటుగా సేవలు అందించేందుకు ఎంఎస్‌ఓలు, కేబుల్ ఆపరేటర్లతో తాము అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నామన్నారు. ఎఫ్‌టీటీహెచ్ కనెక‌్షన్ల బుకింగ్, టారిఫ్, బిల్లింగ్ బీఎస్‌ఎన్‌ఎల్ శాఖ చూస్తుందన్నారు. కనెక‌్షన్లు ఇవ్వడం, సేవలు కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో అందుతాయన్నారు. ఎఫ్‌టీటీహెచ్‌లో రూ.645 ప్లాన్ తీసుకున్న వారికి 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 50 జీబీ డేటా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ ప్లాన్‌లో కనెక‌్షన్ తీసుకోదల్చినవారు రూ.1000 రీఫండబుల్ అడ్వాన్సుగా చెల్లించాలన్నారు. కనెక్షన్ తీసుకున్నవారికి మోడెంను కేబుల్ ఆపరేటర్లు ఉచితంగా అందిస్తారని నరేందర్ వివరించారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి కనెక‌్షన్లు స్వీకరిస్తాయన్నారు. గ్రేటర్ వరంగల్‌తో పాటు భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, కేసముద్రం ఎంఎస్‌ఓలతో దీని అమలుపై ఎంఓయూ కుదుర్చుకున్నట్లు నరేందర్ వివరించారు. కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న మహతి కమ్యూనికేషన్ అధినేత సురభి చంద్రశేఖర్‌రావు, మరో ఎంఎస్‌ఓ మహేందర్, వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కేశవమూర్తి, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పాల్గొన్నారు.