మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం
మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం
Published Tue, Oct 4 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. ఉదయం నవదుర్గా క్రమంలో భద్రకాళి మాతకు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ముఖ్య అర్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేదపండితులు పార్నంది నర్సింహమూర్తి, అర్చకులు టక్కరసు సత్యం పలు అనుష్టానాలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంటా దుర్గా క్రమంలో పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషాసుర మర్దిని క్రమంలో పూజలు చేసి హంస వాహనంపై ఊరేగించారు. ఈసందర్భంగా భద్రకాళి సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నూతన కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.సునిత, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, ఆలయ సిబ్బంది, అర్చకులతో సమావేశం నిర్వహించి నవరాత్రుల ఏర్పాట్లను సమీక్షించారు. ‘శక్తితత్వం’పై సౌమిత్రి లక్ష్మణాచార్య ఉపన్యసించారు. జమ్మికుంటకు చెందిన మల్లంపల్లి సుబ్రహ్మణ్య శర్మ ‘సతీ అనసూయ’ హరికథను ప్రదర్శించారు. సంకీర్తన మ్యూజిక్ అకాడమీ నిర్వాహకులు ఉమ్మడి లక్ష్మణాచారి కర్ణాటక సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదాంతం జగన్నాథ శర్మ హార్మోనియం సహకారాన్ని అందించారు. శివానంద నృత్యమాల ఆచార్యులు బి. సుధీర్‌రావు శిష్యబృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.
Advertisement