వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాజకీయ పక్షాలకు నూతన సంవత్సరం ఎన్నికల పరీక్షగా మారనుంది. ఇప్పటికే ప్రధాన పక్షాల్లో ఎన్నికల వాతావరణం కన్పిస్తోంది. ఈ ఏడాది ప్రారం భం నుంచి నేతలు బిజీగా మారనున్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ దిశగానే జిల్లా లో రాజకీయ పక్షాలు అంతర్గతంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, వామపక్షాలకు తెలంగాణ అంశం తేలడంమొక్కటే అడ్డంకిగా మారింది. విలీనం, పొత్తులు ఎలా ఉన్నా పార్టీ లు ఎన్నికల పావులు కదుపుతూనే ఉన్నాయి.
పాగాకు వైఎస్సార్ సీపీ యత్నం
తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేం దుకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమవుతు న్నా రు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు, కేడర్‌ను పెంచుకునేందుకు కదులుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లు, కమిటీలు ఏర్పా టు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ సంక్షేమ ఫలాలను ప్రజల ముందు కు తెచ్చేయోచనతో ఉన్నారు.
కాంగ్రెస్‌కు కత్తిమీద సాము
రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద గుదిబండగా మారనుంది. తెలంగాణకు కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఆ పార్టీ నేతలు ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమం, తెలంగాణ అంశాలే ప్రధానాయుధాలుగా జనంలోకి వెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు లోక్‌సభ స్థానాలుండగా మహబూబాబాద్ నుంచి కేంద్రమంత్రి బలరామ్‌నాయక్, వరంగల్ నుంచి రాజయ్య తొలిసారి ఎన్నికైన వారే. మరోసారి తమ స్థానాలు ఎలా పదిలపరుచుకోవాలని యోచిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తోపాటు కాంగ్రెస్సేతేర ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పోటీకి ఆశావహులు బెర్‌త ఖరారు చేసుకునే పనిలోపడ్డారు.
టీడీపీలో ఊగిసలాట
రెండు దఫాలు ప్రతిపక్షానికే పరిమితమైన టీడీపీకి నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అంశంపై పార్టీ నేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి తీవ్రప్రతి బంధకంగా మారుతుందనే ఆందోళన నెలకొం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ సెంటిమెంట్ తమ కొంప ముంచుతుందేమోననే బెంగపట్టుకుంది. ఇక కేడర్‌లో నెలకొన్న నిరుత్సాహం, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ ని వీడడం వారిని కలవరపరుస్తోంది.
పట్టుకోసం టీఆర్‌ఎస్ యత్నం
2009 సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న టీఆర్‌ఎస్ ఈసారి ఎన్నికల్లో పట్టును నిలుపుకోవాలని భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ప్రధానాయుధంగా, పునర్నిర్మాణాన్ని ఎజెండా గా చేయాలని యోచిస్తున్నారు. ఉద్యమ ఫలి తాలు సానుకూలంగా ఉన్నా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వలోపం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు వినయభాస్కర్, డాక్టర్ రాజయ్య, మొలుగూరి భిక్షపతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా చేసిన అభివృద్ధి కంటే తెలంగాణ అంశంపైనే వీరు ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కడియం పేరును ప్రకటించినప్పటికీ మహబూబాబాద్ అభ్యర్థి కోసం వేటసాగిస్తోంది.
బీజేపీ విశ్వప్రయత్నం
తెలంగాణ అంశం, మోడీ మంత్రం జపిస్తూ బీజేపీ జిల్లాపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నది. పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటూ జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది. బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేకపోవడం ఈ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇతర పక్షాల్లోని నేతలకు గాలం వేస్తున్నారు. జిల్లాలో పాగా వేయాలని తలపిస్తున్నారు. వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ నాయకులు తమకు బలమున్న రెండు, మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే యోచనతో ఉన్నారు. పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటున్నారు. ఈ దిశగా ఆ నియోజకవర్గాల్లో బలంతోపాటు ఈ దఫా ఓటింగ్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
కొత్త ఏడాది ఎన్నికల పరీక్ష
Published Wed, Jan 1 2014 4:07 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement