old buildings
-
Hyderabad: పెను గాలులు, జడివానలకు దడ పుట్టిస్తున్న శిథిల భవనాలు
సాక్షి, హైదరాబాద్: పెను గాలులకు హోర్డింగ్‌లు.. జడివానలకు శిథిల భవనాలు కుప్పకూలడం తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా సీజన్లు రావడానికి ముందే తగిన చర్యలు చేపట్టాలి. కానీ, జీహెచ్ఎంసీలో మాత్రం సీజన్లు వచ్చేంతవరకూ అశ్రద్ధ వహించడం.. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తంతుగా మారింది. జీహెచ్ఎంసీలో శిథిల భవనాలను వర్షాకాలం వచ్చేలోగా కూల్చివేయడమో, మరమ్మతులు చేయడమో, వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించడమో చేయాలి. కానీ ఇందుకు గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమవుతున్నారు. యంత్రాంగం విఫలం.. వరుస వర్షాలతో నగరంలోని శిథిల భవనాలు భయంగొల్పుతున్నాయి. నగరంలో ప్రతియేటా వర్షాల సమయంలో పురాతన భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. శిథిల భవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రక టిస్తున్నప్పటికీ తూతూమంత్రంగా కొద్దిమేర చర్యలతో సరిపెడుతున్నారు. బలహీనుల దగ్గర ప్రభావం చూపిస్తున్నప్పటికీ, బలవంతుల భవనాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది సైతం ఇప్పటి వరకు 128 శిథిల భవనాలను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల లెక్కల మేరకే చర్యలు తీసుకోవాల్సినవి ఇంకా 257 శిథిల భవనాలు ఉన్నాయి. వారి లెక్కలోకి రానివి ఇంకా ఎక్కువే ఉంటాయి. నగరంలో ప్రతిసంవత్సరం కూడా జూలై నుంచి అక్టోబర్ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరుకు గల్లీల్లో 20 గజాల స్థలంలోనే అయిదంతస్తులు నిర్మించిన భవనాలు సైతం నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు శిథిల భవనాలకు సంబంధించి వేగిరం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సెల్లార్ల తవ్వకాలపైనా చర్యలు.. సెల్లార్ల నిర్మాణాల విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇలా.. ► నగరంలో శిథిల భవనాలు మొత్తం: 584 ► కూల్చినవి: 128 ► మరమ్మతులు చేసినవి, లేదా ఖాళీ చేయించినవి:199 ► చర్యలు తీసుకోవాల్సినవి: 257 -
భాగ్యనగర చరిత్రకు చెదలు.. పట్టించుకోని అధికారులు
సాక్షి, చార్మినార్( హైదరాబాద్): పాతబస్తీలోని హెరిటేజ్ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణను సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పాతబస్తీ ప్రజలంటున్నారు. ► గతేడాది జోరుగా కురిసిన భారీ వర్షాలకు నిజాం పాలకుల నివాస గృహమైన చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ గోడ కిటికి కూలిపోయింది. ►అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. ► అలాగే ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా సతీమణి సర్దార్ బేగం చార్మినార్‌లోని సర్దార్ మహాల్ భవనంలో నివాసముండేది. ► నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ► శాలిబండలోని క్లాక్ టవర్, సిటీ కాలేజీ భవనాలు ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ►శాలిబండ క్లాక్ టవర్‌ను అనుకొని ప్రైవేట్ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ► దీని మరమ్మతు పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ..నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ► సిటీ కాలేజీ భవనం కప్పు పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షా కాలంలో వరద నీరు గదుల్లోకి చేరుకుంటోందని సంబంధిత అధికారులు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచిపోయినా మరమ్మతులకు నోచుకోని చౌమహల్లా ప్యాలెస్.... యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌథం చౌమహల్లా ప్యాలెస్‌లోగతేడాది జూన్ 27న కిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న ప్రహరీ పైభాగంలోని కిటికి దిమ్మె కూలి కింద పడింది. మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన సపోర్టుగా ఇనుప రాడ్లు తప్ప.. ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఆనాటి హెరిటేజ్ కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ఆ దిశలో పనులు జరగడం లేదు. నిజాం ప్రభువుల నివాస గృహం.. నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. ► దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. ► ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. ► వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ►ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. ►1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారం ఏర్పాటు చేశారు. ► విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్‌లో ఆతిథ్య మిచ్చేవారు. శిథిలావస్థకు చేరిన సర్దార్ మహల్... జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ (సర్దార్ మహల్) భవన సముదాయం శిథి శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయడం లేదు. భవనంలోని నిజాం కాలం నాటి చెక్క మెట్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విరిగిపోయిన మెట్లపై నుంచే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. -
మనకూ ‘ముంబై’ ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో పురాతన భవనం కూలి పలువురు మృతి చెందిన నేపథ్యంలో నగరంలోని శిథిల, పురాతన భవనాలపై చర్చ జరుగుతోంది. నగరంలోనూ ఏటా వర్షాకాలంలో భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలానికి ముందస్తుగా శిథిలభవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్న అధికారులు వాటికి సంబంధించి శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 167 శిథిల భవనాలను కూల్చడంతో పాటు 132 భవనాలకు మరమ్మతులు చేయించడం, వాటిల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించడమో చేశామంటున్న అధికారులు మరికొన్నింటిని సీజ్ చేసినట్లు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల లెక్కల మేరకు నగరంలో ఇంకా 466 శిథిల భవనాలు ఉన్నాయి. లెక్కలోకి రాని భవనాలు ఇంకా ఎక్కువే ఉంటాయని అంచనా. నగరంలో భారీ వర్షాలు ప్రారంభం కాలేదు. నగరంలో ఏటా జూలైనుంచి సెప్టెంబర్ మధ్యే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనాల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముంబైలోనూ వాహనాలు వెళ్లేందుకు అవకాశం ని ప్రాంతంలో భవనం కూలింది. నగరంలోనూ పలు ప్రాంతాల్లో అదే పరిస్థితి. ఇరుకు గల్లీల్లో 20 గజాల స్థలంలోనే ఐదంతుస్తులు నిర్మించిన భవనాలు నగరంలో చాలా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగం అనుమతుల జారీలో జాప్యం కూడా ముంబై ఘటనకు కారణంగా ఆరోపణలు వెలువెడుతున్నాయి. ఆ ప్రాంతంలోని పాత భవనాలకు మరమ్మతులు చేయించుకునేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు జాప్యం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలోనూ టౌన్‌ప్లానింగ్ పనితీరుపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో చొర వ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిథిల భవనాల కూల్చివేతల్లోనూ కొందరు యజమానులతో కుమ్మక్కై వాటి జోలికి పోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు శిథిల భవనాలకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో ముంబై తరహా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ♦ 2016లో కూల్చివేసిన శిథిల భవనాలు : 485 ♦ 2017లో కూల్చివేసిన శిథిల భవనాలు : 294 -
క్షణ క్షణం.. భయం భయం!
కొరిటెపాడు(గుంటూరు): ‘క్షణ క్షణం.. భయం భయం’.. సర్కారీ భవనాల్లో ఉద్యోగుల పరిస్థితి ఇది. ప్రభుత్వ కొలువంటే చింతలేదనుకునే వారు. కానీ నేడు ప్రాణాలకు తెగించడం అనుకుంటున్నారు. దీనంతటికీ కారణం దశాబ్దా్దల కిందట నిర్మించిన భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను కొనసాగించడం.. అందులోనే దినమొక గండంగా ఉద్యోగులు పనిచేయాల్సి రావడం. జిల్లా కేంద్రంలో 1857లో నిర్మించిన కలెక్టర్ భవనం నేటికి చెక్కుచెదరకుండా ఒక అపురూప కట్టడంగా నిలిస్తే..ఇదే ప్రాంగణంలో 1980లో నిర్మించిన సంక్షేమభవన్, సర్వేల్యాండ్ డిపార్టుమెంట్, ఇరిగేషన్, వ్యవసాయ, జిల్లా వయోజన విద్యా కేంద్రాలు మాత్రం శిథిలావస్థకు చేరాయి. తాజాగా జిల్లా సంక్షేమశాఖకు చెందిన విభాగంలో భవనం సీలింగ్ ఊడి పడటం ప్రత్యక్ష ఉదాహరణ. కొత్తవి నిర్మించరు.. జిల్లా సంక్షేమశాఖ కార్యాలయం ఏర్పాటై సరిగ్గా మూడున్నర దశాబ్దాలు గడుస్తోంది. ఈ భవనంలో కీలకశాఖలైన ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ విభాగం, గురుకుల విద్యాసంస్థల జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయాలున్నాయి. రవాణాలు, స్కాలర్షిప్లు, సొసైటీల రిజిస్ట్రేషన్లు తదితర పనుల కోసం నిత్యం వందల మంది వస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గతేడాది నవంబర్‌లో సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగంలోనూ భవనం పెచ్చులూడి పడటంతో ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. మార్కెట్ కూడలిలోని జిల్లా వయోజన విద్యాశాఖ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. భవనంలోపల వయోజన విద్యాశాఖ సహాయ సంచాలకుల చాంబర్ సైతం పెచ్చులూడిపోయే దశకు చేరుకుంది. గదులు పూర్తి డొల్లగా మారాయి. -
చెట్లకిందే చదువులు
శిథిలమైన భవనాలు.. పెచ్చులూడి పడుతున్న పైకప్పులు.. వర్షం పడితే భయం.. భయం.. ఈ పరిస్థితులు విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను కూల్చి వేసి వాటిస్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి నిర్ణయించిం ది. నాలుగు నెలల క్రితమే కూల్చివేతలకు అనుమతులిచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగక విద్యార్థులు దినదిన గండంగా గడపాల్సి వస్తోంది. కాళోజీ సెంటర్: జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 721 ఉన్నాయి. వీటిలో ప్రా«థమిక పాఠశాలలు 472, ప్రాథమికోన్నత పాఠశాలలు 83, ఉన్నత పాఠశాలలు 166 ఉన్నాయి. సుమారు ఏడువేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కువ శాతం పాఠశాలల భవనాలు చాలా ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో స్లాబుల పెచ్చులు ఊడిపోయి విద్యార్థులపై పడి గాయపడిన సంఘటనలున్నాయి. వర్షం కురిస్తే తరగతి గదుల్లో కూర్చోలేని పరిస్థితి. కూలిపోయే దశలో ఉన్న తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పలు పాఠశాలల్లో చెట్లకిందే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను కూల్చి వేసి వాటిస్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి నిర్ణయించింది. ఆ మేరకు నివేదకలు పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో వేసవిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 270 పాఠశాలల భవనాలను శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. వాటిని కూల్చివేయడానికి నాలుగు నెలల క్రితమే అనుమతులిచ్చింది. పనులను టెండరు ద్వారా చేపట్టాలని పేర్కొంది. నీరుగారుతున్న సర్కారు లక్ష్యం.. సర్కారు సూళ్లపై నమ్మకం కోల్పోయిన ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రైవేట్‌కు దీటుగా స్కూళ్లను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికతో ముందు సాగుతోంది. అందులో భాగంగా ఇంగ్లిష్ మీడియం అమలుకు పూనుకుంది. అరకొర వసతులు, ఇరుకు గదుల మధ్య విద్యాబోధన కష్టతరంగా మారాయి. సదపాయాలు కల్పించడంతోపాటు శిథిలమైన పాఠశాల ల భవనాలను కూల్చివేసి నూతన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. చెట్ల కిందే చదువులు.. ఉత్తర్వులు అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు కూల్చివేత పనులు ప్రారంభించినవి తొమ్మిది పాఠశాల భవనాలు మాత్రమే. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో చదువు సాగడంలేదు. తరగతి గదులు సరిపోకపోవడంతో చాలా గ్రామాలలో ఆరుబైట చెట్ల కిందే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. వర్షం కురిస్తే ఆరోజుకు స్కూల్‌కు సెలవే. స్లాబులు కురుస్తున్న గదుల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇప్పటికైనా అధికారులు కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేసి నూతన భవనాల నిర్మాణానికి కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నగరంలో శిథిల భవనాలు 1,338
లెక్క తేల్చిన బల్దియా అధికారులు స్ట్రక్చర్ ఇంజినీర్ల పరిశీలనే తరువాయి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేతలే వరంగల్ అర్బన్ : ముసురు పట్టిందంటే చాలు దశాబ్దాల కిందటి పాత భవనాల్లో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తుంటారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి ముంచుకొస్తుందో తెలియకపోవడంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎంతోమంది శిథిలావస్థలోని భవనాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వరంగల్ మహా నగరంలో ఈ తరహా కూలేందుకు సిద్ధమైన భవనాలు భయపెడుతున్నాయి. వానలకు గోడలు, పైకప్పులు బలహీనమై.. ఎప్పటికీ ఉరుస్తూ దర్శనమిస్తున్న ఇటువంటి భవంతులు భావి ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి. పలుచోట్ల ఇటువంటి బిల్డింగ్లు, ఇళ్లు నేలమట్టమైన ఘటనలూ అడపాదడపా చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇటువంటి పాత భవనాలను గుర్తించి, కూల్చివేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో బల్దియా పట్టణ ప్రణాళికా విభాగం(టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది మేల్కొన్నారు. నగరపాలిక పరిధిలోని సర్కిళ్ల వారీగా రంగంలోకి దిగారు. అవసాన దశకు చేరిన భవనాలను గుర్తించారు. గ్రేటర్ పరిధిలో శిథిలావస్థలోని భవనాలు 1,338 ఉన్నట్లు లెక్క తేల్చారు. వాటిలో వరంగల్ ప్రాంతంలోని కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో 322, కాజీపేట సర్కిల్ పరిధిలోని 1,016 భవనాలు అవసాన దశలో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో వరంగల్ స్టేషన్ రోడ్‌లోని ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, రంగంపేట సెంటర్లోని ఒక ప్రైవేట్ హోటల్ ఉన్నాయి. వరంగల్ రైల్వే గేట్, రామన్నపేట, బీట్ బజార్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, మండిబజార్, ఎల్బీ నగర్, హన్మకొండలోని మచిలీబజార్ ఏరియాల్లోనూ పాత భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం రోడ్, ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేట, పెరుకవాడ, కామునిపెంట, మట్టెవాడ, కాజీపేట, సోమిడి రోడ్, బాపూజీ నగర్, పద్మాక్షి గుట్ట, లక్ష్మీపురం, గిర్మాజీపేట, చౌర్బౌలీ తదితర ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు వెల్లడించారు. భవన యజమానులు సహకరించకుంటే.. భవనాల జీవితకాలం, వాటి స్ట్రక్చర్ల పరిశీలన కోసం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎస్ఈ అబ్దుల్ రహ్మాన్‌కు నివేదించారు. 1,338 భవనాల జాబితాను ఆయనకు అందజేశారు. భవన నిర్మాణాల చట్టంలో సెక్షన్ 353(బీ) ప్రకారం భవనాల స్ట్రక్చర్లను ఇంజినీర్లు పరిశీలించనున్నారు. తదుపరి ఆయా భవనాలు ఇక ఎంతో కాలం నిలువలేవు అనే ధ్రువీకరణకు వస్తే.. ఆయా భవనాలకు నోటీసులు జారీ చేస్తారు. అనంతర కాలంలో వాటిని యజమానులే స్వచ్ఛందంగా కూల్చివేస్తే బల్దియా సహకరం అందిస్తుంది. లేదంటే బల్దియా అధికార యంత్రాంగమే స్వయంగా వాటిని కూల్చివేసే ప్రక్రియను చేపడుతుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. -
ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కూల్చివేతలు
హైదరాబాద్: ప్రమాదకరంగా మారిన పురాతన భవనాలు కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పురాతన భవనాన్ని పరిశీలించిన అధికారులు భవనం శిథిలావస్థకు చేరుకుందని నిర్ధరించుకున్నారు. భవనం పూర్తిగా దెబ్బతినడంతో.. వర్షాలు కురుస్తున్న సమయంలో ఎప్పుడైన అది కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. -
శిథిలావస్థ భవనాల కూల్చివేత
హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. పాత భవనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు శిథిలావస్థకు వచ్చిన పాత భవనాలపై దృష్టి సారించారు. సికింద్రాబాద్ పరిధిలో ఈ రోజు పర్యటించిన జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్‌రెడ్డి శిథిలావస్థకు చేరిన పలు భవనాలను గుర్తించి కూల్చివేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పురాతన బిల్డింగులు కూల్చి వేస్తున్నారు. -
పాత ఇంటికీ లెక్కుంది
♦ పాత ఇళ్లనూ హరిత భవనాలుగా మార్చుకునే వీలు ♦ చిన్నచిన్న మార్పులతో సాధ్యమేనంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను పర్యావరణహితమైన గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించవచ్చు. ఆయా భవనాలకు ప్లాటినం, స్వర్ణం, రజతం పేర్లతో రేటింగ్ ఇచ్చే విధానం గురించి విన్నాం.. మరి పాత భవనాల సంగతేంటి? వాటిని కూడా హరిత భవనాలుగా మార్చుకోవటమెలా? పాత ఇళ్లను గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో మార్చుకునే వీలుంది. హరిత ప్రమాణాలివే.. ♦ భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ♦ ఇంట్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ♦ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణంలో చిన్నచిన్న మార్పులు చే యాలి. ♦ భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్(సీఎఫ్ఎల్) బల్బులను వాడాలి. ♦ భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. ♦ సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. ♦ భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ♦ భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ♦ ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి. ప్రయోజనాలివే.. ♦ భవనాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్‌సీ) ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. పర్యావరణ హానికారక సమస్యలను హరిత భవనాల ద్వారా పరిష్కరించవచ్చు. ♦ రసాయన రహిత టైల్స్, సహజ రంగులు, వెదురు సంబంధిత సామగ్రిని గ్రీన్ బిల్డింగ్స్‌లో వాడటం మూలంగా ఇంట్లోని వేడిని గ్రహిస్తాయి. ♦ సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించటంతో విద్యుత్, నీటి బిల్లుల మోత తప్పుతుంది. ♦ గ్రీన్ బిల్డింగ్స్ భవనాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. దీంతో ఏసీ, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. నిర్వహణ ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది. -
పాత భవనాలు గ్రీన్ బిల్డింగ్స్ గా..
సాక్షి, హైదరాబాద్: కొత్త భవనాలనే కాదు పాత వాటినీ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి. అవేంటంటే.. ♦ భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇంట్లో త్రీ స్టార్, ఫై స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ♦ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణం లో చిన్నచిన్న మార్పులు చే యాలి. ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ♦ భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ♦ ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి. -
చుక్కకు లేదు లెక్క!
వర్షపాతంపై శాస్త్రీయ అంచనాలు మృగ్యం ముందుచూపు లేని యంత్రాంగం పేరుకే ‘విపత్తు స్పందన విభాగం’ మేలుకోని ప్రభుత్వం విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మన అధికార యంత్రాంగం... ఉన్నట్టుండి ఏదైనా విపత్తు సంభవిస్తే మాత్రం బెంబేలెత్తుతోంది. సమస్యకు మూలమేంటో...పరిష్కారమేంటో తెలుసుకోలేక తలలు పట్టుకుంటోంది. అప్పటికప్పుడు తోచినదేదో చేసేసి...సరిపెట్టుకుంటోంది. గ్రేటర్లో విపత్తు స్పందన విభాగం (డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్) పనితీరు అధ్వానంగా ఉంది. సుమారు 85 లక్షల జనాభాకు చేరువైన మహా నగరంలో భారీ వర్షాలు, వరదలు, పురాతన భవనాలు కుప్పకూలడం వంటి విపత్తులు సంభవిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాన్ని ముందస్తుగా అంచనా వేసే నాథుడే కరువయ్యారు. అంతేకాదు... శాస్త్రీయ పద్ధతుల్లో వర్షపాతం నమోదు, విశ్లేషణ చేసే వారూ లేరు. ఒక్కసారిగా ఐదు సెంటీమీటర్ల వర్షం పడితే నీట మునిగే కాలనీలు, ప్రధాన రహదారులు, నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఉగ్రరూపం దాల్చే నాలాలు, పొంగిపొర్లే మ్యాన్‌హోళ్లపై సమగ్ర సమచారం సైతం పేరు గొప్ప మహా నగర పాలక సంస్థ వద్ద లేదు. విపత్తు స్పందనపై జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్, రెవెన్యూ, వాతావరణ శాఖల మధ్య సమన్వయం కొరవడడం శాపంగా పరిణమిస్తోంది. ప్రమాదాలు సంభవించినపుడు హడావుడి చేసే సర్కారు విభాగాలు విపత్తు నిర్వహణ ప్రణాళిక (డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్) విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. నిర్వహణ అధ్వానం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెయిన్గేజ్లకు నిర్వహణ లోపం శాపంగా మారింది. పేరుకు 32 రెయిన్‌గేజ్‌లు గ్రేటర్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, కాప్రా, సర్దార్ మహల్ (పాత నగరం), కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వి. మిగతావి డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలోవి. వీటి పరిధిలో రోజువారీగా, సీజన్ల వారీగా ఎంత వర్షపాతం నమోదైందో, సగటు ఎంతో లెక్కించే నాథుడే లేరు. జీహెచ్ఎంసీలో రెయిన్‌గేజ్‌ల నుంచి అందే సమాచారాన్ని సేకరించే ఇంజినీర్ ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఇప్పటి వరకు ఆ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా గురువారమే మరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఇలా ఎదుర్కొంటే మేలు... జీహెచ్ఎంసీ, జల మండలి, రెవెన్యూ, పోలీసు, వాతావరణ శాఖ, అగ్నిమాపక శాఖ, హెచ్ఎండీఏల సమన్వయంతో విపత్తు స్పందనా దళం ఏర్పాటు చేయాలి. దీనిలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణనివ్వాలి. అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చాలి. దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. విపత్తు స్పందనా దళానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. గ్యాస్‌కట్టర్లు, రెస్క్యూల్యాడర్లు, పొక్లెయినర్లు, ఫైరింజన్లు, క్రేన్లు, అగ్ని నిరోధక దుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు, అంబులెన్స్ వంటివి సొంతంగా ఉండేలా చూడాలి.పురాతన భవనాల్లో ఉన్న సూక్ష్మ పగుళ్లు, భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు బార్క్ (బాబా ఆటమిక్ రీసెర్చ్‌సెంటర్) సిద్ధం చేసిన రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. అన్ని నాలాలు, లోతట్టు ప్రాంతాలను జీఐఎస్ పరిజ్ఞానంతో గుర్తించి మ్యాపులు సిద్ధం చేయాలి.లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ప్రణాళిక అవసరం: మర్రి శశిధర్‌రెడ్డి, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మాజీ ఉపాధ్యక్షులు గ్రేటర్ నగరానికి ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ ప్రణాళిక అవసరం. ముంబయిలో ప్రతి వార్డుకు విపత్తు స్పందనా దళం అందుబాటులో ఉంది. నగరంలో ఆ పరిస్థితి లేదు. జాతీయ విపత్తు స్పందనా దళం సభ్యులు నగరంలో నిరంతరం అందుబాటులో ఉండేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాలు పెంచుకోవడం పైనే కాక విపత్తు నిర్వహణపై దృష్టి సారించాలి. ప్రకృతి, మానవ సంబంధ విపత్తులు, బర్డ్‌ఫ్లూ, ఎబోలా వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వేర్వేరుగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. ఇదీ పరిస్థితి... జీహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్నుఆర్భాటంగా ఏర్పాటు చేసినా... అత్యవసరమైనరెస్క్యూ ల్యాడర్స్ (నిచ్చెనలు), గ్యాస్‌కట్టర్లు, క్రేన్లు తదితర పనిముట్లు అందుబాటులో లేని దైన్యస్థితి.నగరంలో 80 విపత్తు స్పందన బృందాలు ఉన్నాయి.వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.{Vేటర్ పరిధిలో వర్షపాతాన్ని లెక్కించే రెయిన్‌గేజ్ స్టేషన్లు 32 ఉన్నాయి.వీటిలో రోజువారీగా, సీజన్ల వారీగావర్షపాతాన్ని లెక్కించి.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన విషయంలో జీహెచ్ఎంసీది ప్రేక్షక పాత్రే.విపత్తు సంభవిస్తే స్పందించే అత్యవసర యంత్రాంగం, సమర్థంగా ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, అవసరమైన నిధుల కేటాయింపులు లేవు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్లో ఒకే అధికారి పని చేస్తున్నారు. అతనికి అవసరమైన సిబ్బంది లేకపోవడం గమనార్హం. -
పాత భవనాలనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా..
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించటం మనందరికీ తెలిసిందే. మరి ఇంతకుముందే నిర్మించిన భవనాలనూ హరిత ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవడమెలా? పాత భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా తీర్చిదిద్దే సౌలభ్యం ఉందండోయ్. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంక్ భవనమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ⇒ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫై స్టార్ ఉండే లా చూసుకోవాలి. ⇒భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి. ⇒భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్ (సీఎఫ్ఎల్) బల్బులను వాడాలి. ⇒భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. ⇒సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. ⇒బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. ⇒భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది. ⇒వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ⇒ఇంటికి వాడే పెయింటింగ్స్ నుంచి విషపూరిత రసాయనాలు విడుదలవకుండా జీరో శాతం వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ (వీఓసీ) ఉన్న రసాయన పెయింటింగ్స్‌ను వాడాలి. ప్రయోజనాలనేకం: ఫ్లైయాష్ ఇటుకల మధ్య థర్మాకోల్ ఉండటం వల్ల భవనం లోపలికి వేడి రాదు. గ్రేసింగ్ అద్దాల మధ్య ఉన్న గాలి కారణంగా భవనం ఎల్లప్పుడూ చల ్లగా ఉంటుంది. సౌరశక్తి వినియోగించడం వల్ల విద్యుత్, నీటి బిల్లుల మోత తగ్గుతుంది. నీరు వృథాగా పోకుండా నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో వృథా నీటిని మొక్కలు, బాత్రూమ్లకు తిరిగి వినియోగించుకోవచ్చు. -
భయపెడుతున్న భవనాలు
సాక్షి, ముంబై: గత వారం రోజులుగా వర్షాలు జోరందుకోవడంతో నగరంలో పాత భవనాలు కూలిపోవడం ప్రారంభమయ్యాయి. ఈ రెండుమూడు రోజుల్లో పాత భవనాలు కూలడం, ప్రహరి గోడ కూలి పలువురు మరణించడం, గాయపడడం వంటి ఘటనలు పెరిగిపోయాయి. దీంతో మరింత ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిరోధించేందుకు నగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది. ముందు జాగ్రత్తల్లో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న పాత, ప్రమాదకర భవనాలను ఖాళీ చేయించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఖాళీ చేయాలని అందులో నివాసముంటున్న కుటుంబాలకు ఇది వరకే బీఎంసీ నోటీసులు జారీ చేసింది. అయినా ఖాళీ చేయకుండా అందులోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారిని ఎలాగైనా ఖాళీ చేయించేందుకు స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలని బీఎంసీ అధికారులు యోచిస్తున్నారు. తాడ్దేవ్లో శిథిలావస్థకు చెందిన ఓ భవనం గోడ ఆదివారం కూలడంతో ఇద్దరు మరణించగా మరొకరికి గాయలయాయ్యాయి. పశ్చిమ ముంబై సెంట్రల్ (తాడ్‌దేవ్) ప్రాంతంలో వైట్‌హౌస్ బార్ వెనుకాల శనివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొలాబా, శివ్డీ తదితర ప్రాంతాల్లో శనివారం రెండు భవనాలు కూలి ముగ్గురు మరణించడం తెలిసిందే. భయందర్ నవఘర్ పోలీసు స్టేషన్ పరిదిలోని కాశినాథ్ సృ్మతి భవనం కూడా పాక్షికంగా కూలింది. శిథిలావస్థకు చేరిన భవనం కావడంతో అందులోని వారందరినీ ముందుగానే ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో రెండు అటోలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భవనం శిథిలాలు పెద్ద శబ్దంతో కిందికి కూలాయి. ఆ సమయంలో రోడ్డుపై నుంచి వెళ్లే అనేక మంది భయాందోళనలకు గురయ్యారు. గతంలోనూ ముంబైలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలడంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించడం తెలిసిందే. ముంబైలో శిథిలావస్థకు చేరిన 391 భవనాలు నగరంలో దాదాపు 391 భవనాలు అత్యంత ప్రమాదకర స్ధితిలో ఉన్నట్టు నిర్ధారించారు. వీటిలో బీఎంసీ సిబ్బంది క్వార్టర్లు కూడా ఉన్నాయి. వీటిని వర్షాకాలానికి ముందే ఖాళీ చేయించేందుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ప్రయత్నించారు. కొన్ని భవనాలు మాత్రమే ఖాళీ అయినా, ఇప్పటికీ సుమారు 300 భవనాల్లో సిబ్బంది, ఇతరులు ఉంటున్నారు. ఇటీవల వర్షాలు మరింత జోరందుకోవడంతో ఎలాగైనా ఆ ప్రమాదకర భవనాలను ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని ప్రమాదకర భవనాలపై హైకోర్టులోనూ విచారణ జరిగింది. భవనాలను ఖాళీ చేయించే బీఎంసీ అధికారులకు ముంబై పోలీసులు సాయం చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసు రక్షణ లభించగానే పాత భవనాలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామని సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఏటా వర్షా కాలంలో పాత భవనాలు కూలడం, ప్రాణ, ఆస్తినష్టం జరగడం పరిపాటిగా మారింది. వర్షాకాలానికి ముందు పాత భవనాల పటిష్టతను బీఎంసీ అధికారులు అధ్యయనం చేస్తారు. ఆ తరువాత వాటి జాబితా రూపొందిస్తారు. అత్యంత ప్రమాదకర భవనాల్లో ఉంటున్న వారు ఖాళీ చేయాలని ముందుగా నోటీసులు జారీచేస్తారు. బీఎంసీ పునరావసం కల్పించిన చోట తగిన సదుపాయాలు లేవనే వంకతో ఈ భవనాల వాసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పాత ఇళ్లలోనే ఉంటున్నారు. బీఎంసీ వద్ద తగినంత మందిమార్బలం, పోలీసు భద్రత లేకపోవడంతో ఇలాంటి వారిని ఖాళీ చేయించడం సాధ్యపడడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇక నుంచి బీఎంసీ అధికారులకు పోలీసులు సాయం లభించనుంది. -
భవనాలనూ పచ్చగా మార్చొచ్చు
హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించుకోవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. మరి పాత భవనాలనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చండోయ్. పాత భవనాలకు కూడా ప్లాటినం, స్వర్ణం, రజతం వంటి రేటింగ్ కూడా ఇస్తారండోయ్. సీఐఐ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఈ విధానాలకు శ్రీకారం చుట్టింది. చిన్న మార్పులతో సరి.. 1. భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. 2. ఇంట్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. 3. భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చే యాలి. 4. భవనం లోపల పూర్తిగా సీఎఫ్ఎల్ బల్బులను వాడాలి. 5. భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. 6. సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. దీంతో విద్యుత్, నీటి బిల్లుల మోత తప్పుతుంది. 7 {Xన్ బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. 8. భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది. 9. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. 10. భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి. -
కోటలో దెయ్యం ఉందా?!
విచిత్రం హారర్ సినిమాలు చూసి, దెయ్యం కథనాలు చదివి, పురాతన భవంతులు, కోటల గురించి తెలుసుకొని చాలామంది భయపడు తుంటారు. అలాంటి గమ్మత్తయిన అనుభవమే నాకూ ఎదురైంది. రెండేళ్ల క్రితం... శీతకాలంలో ఢిల్లీలో ఉన్న మా మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లాను. వారి ఇద్దరు అబ్బాయిలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘రాజస్థాన్ చూడటానికి వెళుతున్నాం. నువ్వూ రావాలి’ అంటే వెళ్లాను. వాళ్లతో ప్రయాణం అంటే మహా సరదా నాకు. పింక్‌సిటీగా పేరొందిన జైపూర్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపాం. తర్వాత రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఉన్న భాన్‌గఢ్ కోటకు వెళ్లాం. 1613లో ఈ కోటను నిర్మించారు. అప్పటికే ఆ కోట గురించి కొంత సమాచారం తెలిసి ఉండటంతో మా అందరికీ ఆసక్తిగా అనిపించింది. విషయమేంటంటే ‘దెయ్యాలు వేటాడే ప్రాచీన పట్నంగా’ ఆ ప్రాంతానికి పేరుంది. మాకెంత మాత్రం ఇది నిజం అనిపించలేదు. కోటను చేరుకున్నాం. శిథిలమైన గోడలతో... సినిమాల్లో చూపే దెయ్యాల కోటలు గుర్తుకు వచ్చాయి. కోటకు వెళ్లే దారిలో పురావస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు మీద ‘సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ కోట లోపలికి, చుట్టుపక్కలకు వెళ్లడం నిషిద్ధం’ అని రాసుంది. దెయ్యాలున్నాయనే కారణంగా ఆ బోర్డు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ కోటలో భాన్‌గఢ్ రాజ్యపు యువరాణి రత్నావతి, ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించిన సింఘియా అనే మంత్రగాడు ఇద్దరూ యౌవనంలో మరణించారనీ, పగతో రగిలిపోయే వారు ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నారనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ దెయ్యాలున్నాయని గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యమనిపించింది. కోట అంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాక కూడా మేము అక్కడి ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కోట జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది. - వేదవ్యాస్, ఇ-మెయిల్ -
ముందుజాగ్రత్తగా ఖాళీ
ఠాణే: ఇటీవలి కాలంలో శిథిల భవనాలు కూలుతున్న ఘటన నేపథ్యంలో నగర పాలక సంస్థ ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. కల్వా ప్రాంతంలో కూలిపోయే దశకు చేరుకున్న రోహిణీ మంజిల్‌లో నివసిస్తున్న వారిని శుక్రవారం మధ్యాహ్నం ఖాళీ చేయించింది. ఈ విషయమై ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) విపత్తు నియంత్రణ విభాగం అధికారి సంతోష్ కదమ్ మీడియాతో మాట్లాడుతూ తాము నివసిస్తున్న ప్రమాదకర స్థితిలో ఉందంటూ ఈ ఉదయం తమ కార్యాలయానికి ఓ అత్యవసర ఫోన్ కాల్ వచ్చిందన్నారు. దీంతో తమ సిబ్బంది అక్కడికి చేరుకుని అందులోని వారిని ఖాళీ చేయించారన్నారు. కాగా ప్రమాదకరస్థాయికి చేరుకున్న ఈ భవనం కల్వా మార్కెట్‌కు సమీపంలో ఉంది. ఇందులో ఆరు కుటుంబాలు జీవిస్తున్నాయి. అంతేకాకుండా దుకాణాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల దివ ప్రాంతంలోనూ ఓ భవనం ఒరిగిపోయింది. దీంతో సంబంధిత సిబ్బ ంది అందులో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించిన సంగతి విదితమే. వారం రోజుల క్రితం కల్వాలోని మరో భవనంలో నివసిస్తున్న పెళ్లి హడావుడిలో ఉండగా వారికి ఏదో శబ్దం వినిపించింది. దీంతో కీడు శంకించి సదరు భవనంలో నివసిస్తున్న వారిని పెళ్లి హడావుడిలో నిమగ్నమైన వారు ఖాళీ చేయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ భవనం కూలిపోయిన సంగతి విదితమే.