కోటలో దెయ్యం ఉందా?!
విచిత్రం
హారర్ సినిమాలు చూసి, దెయ్యం కథనాలు చదివి, పురాతన భవంతులు, కోటల గురించి తెలుసుకొని చాలామంది భయపడు తుంటారు. అలాంటి గమ్మత్తయిన అనుభవమే నాకూ ఎదురైంది.
రెండేళ్ల క్రితం... శీతకాలంలో ఢిల్లీలో ఉన్న మా మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లాను. వారి ఇద్దరు అబ్బాయిలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘రాజస్థాన్ చూడటానికి వెళుతున్నాం. నువ్వూ రావాలి’ అంటే వెళ్లాను. వాళ్లతో ప్రయాణం అంటే మహా సరదా నాకు. పింక్‌సిటీగా పేరొందిన జైపూర్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపాం. తర్వాత రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఉన్న భాన్‌గఢ్ కోటకు వెళ్లాం.
1613లో ఈ కోటను నిర్మించారు. అప్పటికే ఆ కోట గురించి కొంత సమాచారం తెలిసి ఉండటంతో మా అందరికీ ఆసక్తిగా అనిపించింది. విషయమేంటంటే ‘దెయ్యాలు వేటాడే ప్రాచీన పట్నంగా’ ఆ ప్రాంతానికి పేరుంది. మాకెంత మాత్రం ఇది నిజం అనిపించలేదు. కోటను చేరుకున్నాం. శిథిలమైన గోడలతో... సినిమాల్లో చూపే దెయ్యాల కోటలు గుర్తుకు వచ్చాయి. కోటకు వెళ్లే దారిలో పురావస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు మీద ‘సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ కోట లోపలికి, చుట్టుపక్కలకు వెళ్లడం నిషిద్ధం’ అని రాసుంది.
దెయ్యాలున్నాయనే కారణంగా ఆ బోర్డు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ కోటలో భాన్‌గఢ్ రాజ్యపు యువరాణి రత్నావతి, ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించిన సింఘియా అనే మంత్రగాడు ఇద్దరూ యౌవనంలో మరణించారనీ, పగతో రగిలిపోయే వారు ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నారనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ దెయ్యాలున్నాయని గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యమనిపించింది. కోట అంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాక కూడా మేము అక్కడి ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కోట జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది.
- వేదవ్యాస్, ఇ-మెయిల్