ghost stories
-
సోషల్ మీడియా సెన్సేషన్ కుశా కపిలా గురించి ఈ విషయాలు తెలుసా?
కుశా కపిలా... సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న నటి. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ వచ్చిన ఫాలోయింగ్‌తో సినీ అవకాశాలను సొంతం చేసుకుంది. అలా సినిమాలతో పాటు వరుస వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోన్న ఆమె గురించి కొన్ని విషయాలు.. కుశా కపిలా.. న్యూఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. చదువు పూర్తికాగానే.. ఫ్యాషన్ రంగంలోనే పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం కాపీ రైటర్‌గానూ పని చేసింది. ఆ తర్వాత ‘ఐదివా’ అనే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వెబ్సైట్లో కంటెంట్ రైటర్‌గా చేరింది. సోషల్ మీడియాలో ఢిల్లీ పంజాబీ గాసిప్ ఆంటీ ‘బిల్లీ మాసి’ అనే పాత్రను క్రియేట్ చేసి.. నటించింది. దాంతో కుశా పాపులర్ అవడమే కాక సోషల్ మీడియా సెన్సేషన్గానూ మారింది. ‘సన్ ఆఫ్ అబిష్’ అనే టీవీ షోతో బుల్లితెర ప్రవేశం చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ‘ఘోస్ట్ స్టోరీస్’తో వెబ్ తెరపైనా మెరిసింది. అమెజాన్ ఒరిజినల్ కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’లో కీలక పాత్ర పోషించి సినిమా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాల్లోనూ నటించింది. ∙ ప్రస్తుతం ‘మైనస్ వన్: న్యూ చాప్టర్’, ’సోషల్ కరెన్సీ’ వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది. జీవితంలో ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కొంటేనే మనకేం కావాలో తెలుస్తుంది. – కుశా కపిలా -
అబద్ధమని కొట్టిపారేయకండి.. దెయ్యాలతో మాట్లాడిన చిన్నారి!
దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు. ‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ. వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు. జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్‌లో సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్‌గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్. వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త) ‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్‌లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్‌తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్‌ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు. అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హెడీ మాటల్లో.. ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ∙సంహిత నిమ్మన -
ఈ పాడ్ కాస్ట్స్ చాలా పాపులర్ గురూ!
టెక్నాలజీతో పరిచయం ఉన్నవాళ్లకు పాడ్‌కాస్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. ఒక సీరిస్లాగా కంప్యూటర్ లేదా మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే వీలుండే డిజిటల్ ఆడియో ఫైల్స్‌ను పాడ్‌కాస్ట్ అంటారు. ఆయా దేశాల్లో వివిధ అంశాలపై పాడ్‌కాస్ట్స్‌ను రిలీజ్ చేస్తుంటారు. ప్రముఖులు రిలీజ్ చేసే పాడ్‌కాస్ట్స్‌కు ఆదరణ ఎక్కువగా లభిస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో పాశ్చాత్య సమాజంలో కొత్త తరహా పాడ్ కాస్ట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దయ్యపు కథలు, హారర్ ప్రదేశాలు, దయ్యాల వేటగాళ్ల గురించిన కథలుండే పాడ్‌కాస్ట్స్‌కు అమెరికా తదితర దేశాల్లో భారీగా ఆదరణ లభిస్తోంది. 10మందిలో నలుగురు అమెరికన్లు దయ్యాలున్నాయని నమ్ముతారని యూగవ్ సర్వే చెబుతోంది. సమాజంలో ఈ నమ్మకమే హారర్ పాడ్‌కాస్ట్స్ డిమాండ్ పెంచుతోంది. ఇలా పాపులరైన కొన్ని పాడ్ కాస్ట్స్ వివరాలు.. రియల్ ఘోస్ట్ స్టోరీస్ ఆన్లైన్: రోజూ పలు పారానార్మల్ కథలను ప్రసారం చేస్తుంది. ఈ అంశాలు అనుభూతి చెందిన ప్రజల అనుభవాలను వారి నోటితోనే వినిపిస్తుంది. వినేవాళ్లు కావాలంటే తమ సొంత దయ్యపు కథలను అప్ లోడ్ చేయవచ్చు. ఆసక్తి ఉన్నవారు bit.ly/36n20vb లో ట్రై చేయవచ్చు. హంటెడ్ ప్లేసెస్: భూగ్రహంపై అత్యంత భయానక ప్రదేశాల గురించి వివరాలు ఇస్తుంటుంది. పలు హాంటెడ్ స్థలాల గురించి హోస్ట్ గ్రెగ్ పాల్సిన్ భయంకరంగా వర్ణిస్తారు. ప్రతి గురువారం ఒక కొత్త ప్రదేశం గురించిన కథ ఉంటుంది. మీరు కూడా వినాలనుకుంటే parcast.com/haunted లో ప్రయత్నించవచ్చు. రియల్ లైఫ్ ఘోస్ట్ స్టోరీస్: దయ్యం పట్టి వదిలిన వాళ్లు, వారి సంబంధీకుల కథలను ప్రసారం చేస్తుంది. కావాలంటే stitcher.com/show/real&life&ghost&storie లో వినవచ్చు. అన్ఎక్స్ప్లైన్డ్: రెండువారాలకు ఒకమారు ప్రసారమయ్యే ఈ సీరిస్‌లో అంతుచిక్కని మార్మిక కథల లోగుట్టు వివరించే యత్నం చేస్తారు. అలాగే అర్థం కాని, ఆన్సర్ లేని పారానార్మల్ అంశాలను వినిపిస్తారు. ఆసక్తి ఉంటే unexplainedpodcast.com/ లో ట్రై చేయండి. -
నన్నెవరో ఆవహించారు!
షూటింగ్ పూర్తి చేసినప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు. కానీ, ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసి ‘హమ్మయ్య’ అని రిలీఫ్ ఫీలవుతున్నారు జాన్వీ కపూర్. బాలీవుడ్లో రూపొందిన హారర్ అంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్’. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జాన్వీకపూర్ విభాగానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారని తెలిసింది. ‘ఘోస్ట్ స్టోరీస్’లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసిన జాన్వీ మాట్లాడుతూ –‘‘స్క్రిప్ట్ నన్ను బాగా ఆకట్టుకోవడంతో పాత్రలో బాగా లీనమయ్యాను. కానీ, షూటింగ్ సమయంలో చాలా భయపడ్డాను. మనిషి భావోద్వేగాల్లో భయం కూడా ఒక ముఖ్యమైనదనిపిస్తోంది. నిజం చెప్పాలంటే షూటింగ్ పూర్తయ్యేలోపు మా బృందంలోని పదిమందిలో ఎనిమిది మంది అనారోగ్యం బారినపడ్డారు. షూట్ సమయంలో నన్ను ఎవరో ఆవహించినట్లు, షూట్ తర్వాత వదిలేసిన అనుభూతికి లోనయ్యాను. ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ నన్ను చాలా భయపెట్టింది’’ అని జాన్వీ పేర్కొన్నారు. ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీలో ఓ భాగంలో జాన్వీ, మిగతా భాగాల్లో శోభితా ధూళిపాళ్ల, మృణాల్ ఠాకూర్ నటించారు. న్యూ ఇయర్‌కి ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ వీక్షకుల ముందుకు రానుంది. -
కోటలో దెయ్యం ఉందా?!
విచిత్రం హారర్ సినిమాలు చూసి, దెయ్యం కథనాలు చదివి, పురాతన భవంతులు, కోటల గురించి తెలుసుకొని చాలామంది భయపడు తుంటారు. అలాంటి గమ్మత్తయిన అనుభవమే నాకూ ఎదురైంది. రెండేళ్ల క్రితం... శీతకాలంలో ఢిల్లీలో ఉన్న మా మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లాను. వారి ఇద్దరు అబ్బాయిలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘రాజస్థాన్ చూడటానికి వెళుతున్నాం. నువ్వూ రావాలి’ అంటే వెళ్లాను. వాళ్లతో ప్రయాణం అంటే మహా సరదా నాకు. పింక్‌సిటీగా పేరొందిన జైపూర్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపాం. తర్వాత రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఉన్న భాన్‌గఢ్ కోటకు వెళ్లాం. 1613లో ఈ కోటను నిర్మించారు. అప్పటికే ఆ కోట గురించి కొంత సమాచారం తెలిసి ఉండటంతో మా అందరికీ ఆసక్తిగా అనిపించింది. విషయమేంటంటే ‘దెయ్యాలు వేటాడే ప్రాచీన పట్నంగా’ ఆ ప్రాంతానికి పేరుంది. మాకెంత మాత్రం ఇది నిజం అనిపించలేదు. కోటను చేరుకున్నాం. శిథిలమైన గోడలతో... సినిమాల్లో చూపే దెయ్యాల కోటలు గుర్తుకు వచ్చాయి. కోటకు వెళ్లే దారిలో పురావస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు మీద ‘సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ కోట లోపలికి, చుట్టుపక్కలకు వెళ్లడం నిషిద్ధం’ అని రాసుంది. దెయ్యాలున్నాయనే కారణంగా ఆ బోర్డు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ కోటలో భాన్‌గఢ్ రాజ్యపు యువరాణి రత్నావతి, ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించిన సింఘియా అనే మంత్రగాడు ఇద్దరూ యౌవనంలో మరణించారనీ, పగతో రగిలిపోయే వారు ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నారనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ దెయ్యాలున్నాయని గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యమనిపించింది. కోట అంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాక కూడా మేము అక్కడి ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కోట జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది. - వేదవ్యాస్, ఇ-మెయిల్