Vedavyas
-
ముడా చైర్మన్ పదవి నుంచి వేదవ్యాస్ తొలగింపు
సాక్షి, అమరావతి : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేదవ్యాస్‌ను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేదవ్యాస్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ కాపీని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు అందజేశారు. బందరు అభివృద్ధి, పోర్టు భూ సేకరణ తదితర వ్యవహారాలు చక్కదిద్దేందుకు 2016లో ప్రభుత్వం ముడా శాఖను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాలన, అభివృద్ధిపరమైన వ్యవహారాలు చూసుకునేందుకు డెప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారిని వైస్ చైర్మన్‌గా నియమించారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకుడైన వేదవ్యాస్‌ను ముడా చైర్మన్‌గా నియమించింది. -
సినీ గేయ రచయిత రంగభట్టర్ కన్నుమూత
తిరుపతి కల్చరల్: సంస్కృత అధ్యాపకుడు, సినీగేయ రచయితగా సంగీత సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తనదైన శైలిలో అద్భుత పాటలతో ఆధ్యాత్మిక చిత్రాలకు నిండుదనం తెచ్చిన సాహితీవేత్త, సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రంగభట్టర్ ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కన్నుమూశారు. గురువారం బైరాగిపట్టెడలోని ఆయన స్వగృహం నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రంగభట్టర్ పూర్వీకులది తమిళనాడులోని శ్రీరంగం. శ్రీవైష్ణవి ఆచార్య పీఠానికి చెందిన పూర్వీకులు సమాజాన్ని ఆధ్యాత్మికతlవైపు నడిపించాలన్న సంకల్పంతో కొన్ని శతాబ్దాల క్రితం వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో స్థిరపడ్డారు. 1946లో ఆయన జన్మించినా అదే గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1968లో టీటీడీలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య అధ్యాపకులుగా బోధన రంగంలోకి ప్రవేశిం చారు. సాహిత్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి వేదవ్యాస రంగభట్టర్‌కు స్వయాన తమ్ముడు కావడం గమన్నార్హం. వృత్తి రీత్యా తిరుపతిలో స్థిరపడ్డా ప్రస్తుతం బైరాగిపట్టెడలో ఆయన నివాసముంటున్నారు. వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకుడు కావడంతో సాహిత్యంలో మంచి పట్టు సాధించారు. 1986లో రంగవల్లి చిత్రానికి ఆయన తొలిసారిగా పాటలు రచించారు. మూడు దశాబ్దాలుగా సాహితీ సేవ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన శ్రీమంజునాథ, పాండురంగడు, రామదాసు, షిరిడీసాయి, అనగనగా ఒక ధీరుడు, ఝుమ్మంది నాదం, జగద్గురు ఆదిశంకర, వెంగమాంబ, ఓం నమో వేంకటేశాయ వంటి 13 చిత్రాలకు అద్భుతమైన ఆధ్యాత్మికతను రేకెత్తించే పాటలను రచించి గొప్ప సినీ రచయితగా పేరు గడించారు. ‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే సంగీత పుస్తకాన్ని రచించి సులభతరంగా సంగీతం నేర్చుకునేలా దోహదపడ్డారు. తద్వారా పలు రికార్డులు సాధించారు. భూమన ప్రగాఢ సంతాపం ప్రముఖ సాహితీవేత్త రంగ భట్టర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రంగభట్టర్ మృతి రాష్ట్ర ప్రజలకు తీరనిలోటన్నారు. తిరుపతి నాటక రంగానికి ఆయన వెన్నెముకగా నిలిచారని తెలిపారు. కళాకారులను అన్ని విధాలా ప్రోత్సహించారన్నారు. అనేక దేవుళ్లకు సుప్రభాత కీర్తనలను రాసిన విధూషీమణిగా కీర్తించారు. సాహితీవేత్తగా, అద్భుతమైన సినీ గేయ రచయితగా ఎనలేని గుర్తింపు పొందారన్నారు. రంగభట్టర్ అనన్య సామాన్యమైన ప్రతిభా మూర్తిగా భూమన పేర్కొన్నారు. -
శ్రీమఠంలో వేదవ్యాస పూజ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం వేదవ్యాసుడి ఆరాధన పూజలు ఘనంగా జరిగాయి. స్థానిక పూజామందిరంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు వేదవ్యాసుడి ప్రతిమకు, జయ, దిగ్విజయ, మూలరాముల విశేష పూజలు గావించారు. శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు పుష్ప, పంచామృతాభిషేకం, మహా మంగళహారతులు చేపట్టారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా సెలవులు భక్తులు వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. భక్తుల రాకతో శ్రీమఠం కళకళలాడింది. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కోటలో దెయ్యం ఉందా?!
విచిత్రం హారర్ సినిమాలు చూసి, దెయ్యం కథనాలు చదివి, పురాతన భవంతులు, కోటల గురించి తెలుసుకొని చాలామంది భయపడు తుంటారు. అలాంటి గమ్మత్తయిన అనుభవమే నాకూ ఎదురైంది. రెండేళ్ల క్రితం... శీతకాలంలో ఢిల్లీలో ఉన్న మా మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లాను. వారి ఇద్దరు అబ్బాయిలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘రాజస్థాన్ చూడటానికి వెళుతున్నాం. నువ్వూ రావాలి’ అంటే వెళ్లాను. వాళ్లతో ప్రయాణం అంటే మహా సరదా నాకు. పింక్‌సిటీగా పేరొందిన జైపూర్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపాం. తర్వాత రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఉన్న భాన్‌గఢ్ కోటకు వెళ్లాం. 1613లో ఈ కోటను నిర్మించారు. అప్పటికే ఆ కోట గురించి కొంత సమాచారం తెలిసి ఉండటంతో మా అందరికీ ఆసక్తిగా అనిపించింది. విషయమేంటంటే ‘దెయ్యాలు వేటాడే ప్రాచీన పట్నంగా’ ఆ ప్రాంతానికి పేరుంది. మాకెంత మాత్రం ఇది నిజం అనిపించలేదు. కోటను చేరుకున్నాం. శిథిలమైన గోడలతో... సినిమాల్లో చూపే దెయ్యాల కోటలు గుర్తుకు వచ్చాయి. కోటకు వెళ్లే దారిలో పురావస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు మీద ‘సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ కోట లోపలికి, చుట్టుపక్కలకు వెళ్లడం నిషిద్ధం’ అని రాసుంది. దెయ్యాలున్నాయనే కారణంగా ఆ బోర్డు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ కోటలో భాన్‌గఢ్ రాజ్యపు యువరాణి రత్నావతి, ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించిన సింఘియా అనే మంత్రగాడు ఇద్దరూ యౌవనంలో మరణించారనీ, పగతో రగిలిపోయే వారు ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నారనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ దెయ్యాలున్నాయని గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యమనిపించింది. కోట అంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాక కూడా మేము అక్కడి ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కోట జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది. - వేదవ్యాస్, ఇ-మెయిల్ -
సారథి, వ్యాస్ చేరికతోకొత్త జోష్
జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఇద్దరు కీలక నేతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇద్దరూ ఇద్దరే.. తండ్రుల నుంచి తమ వరకు రాజకీయాల్లో రాణించినవారే.. కీలక పదవులు సైతం సమర్థవంతంగా నిర్వహించి జిల్లాపై తమదైన ముద్ర వేసినవారే.. అటువంటి ఉద్దండులు ఇద్దరి చేరికతో వైఎస్సార్సీపీలో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌లు శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిద్దరికి మెడలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో తిరుగులేని నేతలుగా వ్యవహరించిన వీరిద్దరూ పార్టీలో చేరడం శుభపరిణామమని జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రెండు పర్యాయాలు గెలిచి.. కీలక పదవులు అధిరోహించి... ముక్కుసూటి తత్వం కలిగిన బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్సీలోకి రావడం మంచి పరిణామం అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి బూరగడ్డ నిరంజన్‌రావు జిల్లా రాజకీయాల్లో రాజీలేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. అధికార కాంగ్రెస్ పార్టీలో సైతం ఆర్థికంగా, సామాజికంగా పెత్తనం చెలాయించే వ్యక్తులకు ఆయన ఎదురొడ్డి నిలిచే వ్యక్తిగా పేరొందారు. మల్లేశ్వరం నియోజకవర్గంలో ఒకమారు స్వతంత్ర అభ్యర్థిగా, మరోమారు జనతా పార్టీ అభ్యర్థిగా బూరగడ్డ నిరంజన్‌రావు గెలుపొందారు. మూడు పర్యాయాలు ఓటమిని చవిచూశారు. దాదాపు 30 ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిరంజన్‌రావు రాణించారు. ఆయన హయాం తర్వాత బూరగడ్డ వేదవ్యాస్ మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే సమయంలో అంచనాల కమిటీ చైర్మన్, మాజీ డెప్యూటీ స్పీకర్ వంటి పదవులతో పాటు ఏఐసీసీ సభ్యుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి వంటి పార్టీ పదవులు నిర్వహించారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ పార్టీలోను, ఆయన అనునయుల్లోనూ ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్సీపీలో చేరుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అనునయులు హైదరాబాద్ వెళ్లారు. ఆయనతోపాటు పెడన నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, కీలకనేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వ్యాస్ అనుచరులు మాజీ జెడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్, జోగి శ్రీను, చోడవరం శ్రీను, గరికిపాటి నాయుడు, మాతా సుబ్బారావు, యండపల్లి నర్శింహారావు, తుమ్మిడి చినబాబు, చిన్నా, సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వ్యాస్ పార్టీలో చేరిన సమయంలో పెడన మాజీ జెడ్పీటీసీ గుడిసేవ రమేష్, పెడన నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు మావులేటి వెంకట్రాజు, వరుదు రామకృష్ణ, ఆయూబ్‌ఖాన్ తదితరులు అక్కడే ఉన్నారు. అప్పుడు వైఎస్ అనుచరుడు.. ఇప్పుడు జగన్ వెంట.. జిల్లాలో ఏకైక మంత్రిగా రాజకీయాల్లో రాణించిన కొలుసు పార్థసారథి వైఎస్సార్సీపీలో చేరికతో అదనపు బలం చేకూరుతోంది. సారథి తండ్రి కొలుసు పెద రెడ్డియ్య బందరు ఎంపీ, ఉయ్యూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. దాదాపు 25 ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో కేపీ రెడ్డియ్య చక్రం తిప్పారు. ఆయన అనంతరం రాజకీయ వారసుడిగా సారథి 2004లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా, 2009లో పెనమలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో పర్యాయం ఎన్నికైన సారథికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవిని ఇచ్చారు. జిల్లాలో ఏకైక మంత్రిగా సారథి తనదైన ముద్ర వేశారు. అటువంటి సారథి వైఎస్సార్సీపీలోకి రావడం పార్టీకి అదనపు బలం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన అనంతరం సారథి సాక్షితో మాట్లాడుతూ వైఎస్ సువర్ణయుగం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని భావించి వైఎస్సార్సీపీలో చేరినట్టు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ పనిచేశారని, ఆయన మరణం తీరనిలోటని అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీలేని పోరాటం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేసి వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. సారథి వెంట జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ తదితరులు పార్టీలో చేరారు. -
ఉనికికోసం వెంపర్లాట
డీలాపడిన అధికార పక్షం పదవి కావాలంటే పక్క పార్టీనే దిక్కు గోడ దూకుతున్న జిల్లా నేతలు చంద్రబాబుతో వ్యాస్ కొడుకు మంత్రాంగం సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ నాయకులు ఉనికికోసం నానా పాట్లు పడుతున్నారు. విలువలు, విశ్వసనీయతను పక్కనపెట్టి.. పదవే పరమావధిగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ కావడంతో ఆ పార్టీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకోసం ఇతర పార్టీలవైపు దృష్టిసారించారు. పదవుల కోసం వైఎస్సార్ సీపీలో చేరేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరి ప్రయత్నంగా ‘సైకిల్’ ఎక్కేందుకు తహతహలాడుతున్నారు. ఇన్నాళ్లు వారిని నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ కోవలోకే జిల్లాకు చెందిన పీసీసీ కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్ తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం ఇటీవలి కాలంలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో వేదవ్యాస్ కుమారుడు కిషన్‌తేజ్ శనివారం లోకేష్ ద్వారా చంద్రబాబునాయుడును కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికాలో చదువుకున్న కిషన్‌తేజ్ తన మిత్రుల సాయంతో లోకేష్‌కు దగ్గరైనట్లు సమాచారం. చంద్రబాబును కిషన్‌తేజ్ కలిసిన సమయంలో బందరు పార్లమెంటు టికెట్ తన తండ్రి వ్యాస్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాపు సామాజికవర్గానికి ఉన్న ఓట్లు, ఆ వర్గంలో తమకు ఉన్న పట్టు, జిల్లాలో వేదవ్యాస్‌కు ఉన్న పరిచయాలు, పరపతిని తమకు అనుకూలంగా ప్రస్తావిస్తూ బాబుకు ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బందరు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణకు టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. బాడిగ రామకృష్ణకన్నా తమకే పరపతి ఎక్కువ ఉందని, టికెట్ ఇస్తే ఖర్చులు కూడా తామే భరించి సీటు గెలుస్తామని ధీమా వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే కొనకళ్లకు నచ్చజెప్పి పెడనఎమ్మెల్యేగా పోటీ చేయించి ఎంపీ టికెట్ తన తండ్రికి అవకాశం ఇచ్చేలా చూడాలని కిషన్‌తేజ్ ప్రతిపాదించినట్లు వినికిడి. చంద్రబాబు స్పందిస్తూ ఎంపీ సీటు కాకుండా జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తారా.. అని ప్రశ్నించగా తన తండ్రికి ఎంపీ టికెట్టే కేటాయించాలని కిషన్‌తేజ్ కోరారు. అంతా విన్న బాబు ప్రస్తుతానికి వ్యాస్ చేరిక అంశాన్ని వాయిదా వేసేలా మాట్లాడారని తెలిసింది. ప్రస్తుతం బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితి బాగుండనప్పటికీ ఎంపీ సీటుపై అధినేత వ్యవహరిస్తున్న తీరుపై నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లలో ఎన్ని మార్పులో.. కాంగ్రెస్‌లో పలు కీలక పదవులు అనుభవించిన వ్యాస్ ప్రజారాజ్యంలో చేరడం, బందరు నుంచి పోటీ చేయడం రెండూ చారిత్రక తప్పిదాలేనంటూ ఇటీవల తన అనుయాయుల వద్ద మధనపడినట్లు సమాచారం. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న ఆయన కాంగ్రెస్ ఖాళీ కావడంతో పదవుల కోసం పార్టీలు మారేందుకు సైతం సిద్ధం కావడాన్ని ఆయన అనుయాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభ డెప్యూటీ స్పీకరుగా, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వేదవ్యాస్ 2009లో పీఆర్పీ తీర్ధం పుచ్చుకుని బందరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనంతరం పెడన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగానూ, పీసీసీ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా వేదవ్యాస్ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వాదనలు గుప్పుమంటున్నాయి. మాజీ మంత్రి నడకుదుటితో బాబు మంతనాలు.. వేదవ్యాస్ కుమారుడితో మాట్లాడిన అనంతరం చంద్రబాబు.. బందరు నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మత్స్యశాఖ మంత్రిగా పనిచేసిన నడకుదుటి నరసింహారావును పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. నరసింహారావు అల్లుడైన కొల్లు రవీంద్ర 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా రవీంద్ర పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరిక తదితర అంశాలపై నరసింహారావుతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు రోజులుగా నరసింహారావు హైదరాబాదులోనే ఉన్నారు. రవీంద్రకూడా సోమవారం హైదరాబాదులో జరిగిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.