సారథి, వ్యాస్ చేరికతోకొత్త జోష్
- జిల్లాలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం
- జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఇద్దరు కీలక నేతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇద్దరూ ఇద్దరే.. తండ్రుల నుంచి తమ వరకు రాజకీయాల్లో రాణించినవారే.. కీలక పదవులు సైతం సమర్థవంతంగా నిర్వహించి జిల్లాపై తమదైన ముద్ర వేసినవారే.. అటువంటి ఉద్దండులు ఇద్దరి చేరికతో వైఎస్సార్‌సీపీలో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది.
జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌లు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిద్దరికి మెడలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో తిరుగులేని నేతలుగా వ్యవహరించిన వీరిద్దరూ పార్టీలో చేరడం శుభపరిణామమని జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
రెండు పర్యాయాలు గెలిచి.. కీలక పదవులు అధిరోహించి...
ముక్కుసూటి తత్వం కలిగిన బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్‌సీలోకి రావడం మంచి పరిణామం అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి బూరగడ్డ నిరంజన్‌రావు జిల్లా రాజకీయాల్లో రాజీలేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. అధికార కాంగ్రెస్ పార్టీలో సైతం ఆర్థికంగా, సామాజికంగా పెత్తనం చెలాయించే వ్యక్తులకు ఆయన ఎదురొడ్డి నిలిచే వ్యక్తిగా పేరొందారు.
మల్లేశ్వరం నియోజకవర్గంలో ఒకమారు స్వతంత్ర అభ్యర్థిగా, మరోమారు జనతా పార్టీ అభ్యర్థిగా బూరగడ్డ నిరంజన్‌రావు గెలుపొందారు. మూడు పర్యాయాలు ఓటమిని చవిచూశారు. దాదాపు 30 ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిరంజన్‌రావు రాణించారు.
ఆయన హయాం తర్వాత బూరగడ్డ వేదవ్యాస్ మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే సమయంలో అంచనాల కమిటీ చైర్మన్, మాజీ డెప్యూటీ స్పీకర్ వంటి పదవులతో పాటు ఏఐసీసీ సభ్యుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి వంటి పార్టీ పదవులు నిర్వహించారు. ఆయన వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీలోను, ఆయన అనునయుల్లోనూ ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్‌సీపీలో చేరుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అనునయులు హైదరాబాద్ వెళ్లారు. ఆయనతోపాటు పెడన నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, కీలకనేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వ్యాస్ అనుచరులు మాజీ జెడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్, జోగి శ్రీను, చోడవరం శ్రీను, గరికిపాటి నాయుడు, మాతా సుబ్బారావు, యండపల్లి నర్శింహారావు, తుమ్మిడి చినబాబు, చిన్నా, సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వ్యాస్ పార్టీలో చేరిన సమయంలో పెడన మాజీ జెడ్పీటీసీ గుడిసేవ రమేష్, పెడన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు మావులేటి వెంకట్రాజు, వరుదు రామకృష్ణ, ఆయూబ్‌ఖాన్ తదితరులు అక్కడే ఉన్నారు.
అప్పుడు వైఎస్ అనుచరుడు.. ఇప్పుడు జగన్ వెంట..
జిల్లాలో ఏకైక మంత్రిగా రాజకీయాల్లో రాణించిన కొలుసు పార్థసారథి వైఎస్సార్‌సీపీలో చేరికతో అదనపు బలం చేకూరుతోంది. సారథి తండ్రి కొలుసు పెద రెడ్డియ్య బందరు ఎంపీ, ఉయ్యూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. దాదాపు 25 ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో కేపీ రెడ్డియ్య చక్రం తిప్పారు. ఆయన అనంతరం రాజకీయ వారసుడిగా సారథి 2004లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా, 2009లో పెనమలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రెండో పర్యాయం ఎన్నికైన సారథికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవిని ఇచ్చారు. జిల్లాలో ఏకైక మంత్రిగా సారథి తనదైన ముద్ర వేశారు. అటువంటి సారథి వైఎస్సార్‌సీపీలోకి రావడం పార్టీకి అదనపు బలం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన అనంతరం సారథి సాక్షితో మాట్లాడుతూ వైఎస్ సువర్ణయుగం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని భావించి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ పనిచేశారని, ఆయన మరణం తీరనిలోటని అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీలేని పోరాటం చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసి వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. సారథి వెంట జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ తదితరులు పార్టీలో చేరారు.