అవి అనుమానాస్పద మరణాలా?
* పుష్కర మృతులపై వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి
* ఈ వ్యవహారం నుంచి బాబును తప్పించాలనే కేసును పక్కదోవ పట్టించాలని డీజీపీ చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల తొక్కిసలాటలో మృతిచెందిన వారివి అనుమానాస్పద మరణాల ని పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని, అవి చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యల ని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు.
ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల తొక్కిసలాటలో 27 మంది మరణించిన విషయం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే వాటిని అనుమానాస్పద మరణాలని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ మరణాలపై 374 సెక్షన్ కింద(ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలు) కేసు నమోదు చేయాల్సి ఉంటే 174 సెక్షన్(అనుమానాస్పద మరణాలు)కింద ఎలా పెడతారని ఆశ్చర్యం వెలిబుచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో ఎక్కడా అనుమానాస్పద మరణాలుగా పేర్కొనలేదన్నారు. ‘వీఐపీ ఘాట్‌లోగాక సాధారణ ఘాట్ వద్ద సీఎం చంద్రబాబు, మరికొందరు వీఐపీలు వచ్చి గంటన్నరకుపైగా స్నానాన్ని ఆచరించడంతో జనసందోహం పెరిగింది.. వారు వెళ్లిపోయాక ముహూర్తానికే స్నానం చేయాలనే భావనతో జనమంతా రావడంతో తొక్కిసలాట జరిగింది..
దానిఫలితంగానే మరణాలు సంభవించాయి.. పోలీసులు కూడా జనాన్ని నియంత్రించలేకపోయారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొంటే అందుకు భిన్నంగా పోలీసులు కేసెలా పెడతారు?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును తప్పించి కేసును పక్కదోవ పట్టించాలని డీజీపీ చూస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు.
మరణాలకు బాబే బాధ్యుడు..
ఇలాంటి కార్యక్రమాలు జరిగేటపుడు రెవెన్యూ, పోలీసు, దేవాదాయశాఖల మంత్రులతో పర్యవేక్షణకు ఉపసంఘాన్ని నియమిస్తారని, కానీ చంద్రబాబు సీనియర్లను కాదని తన మాటకు తందానా పలికే మంత్రి పి.నారాయణ, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వంటి వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారని పార్థసారథి విమర్శించారు. ఈ విషాదానికి స్వయంగా తానే బాధ్యుడైనపుడు ఇంకా సీఎం న్యాయవిచారణకు ఆదేశించడమంటే.. ఇందులో అధికారుల్ని బలిపశువుల్ని చేయాలనే ఉద్దేశంతోనేనన్నారు.