'హైటెక్ బాబు లోటెక్ పనులవల్లే విషాదం'
చిత్తూరు: హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోటెక్ పనులవల్లే గోదావరి పుష్కరాల్లో అనర్ధం జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాజమండ్రి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ భక్తుల సౌకర్యాలపై పెట్టలేదని విమర్శించారు. చనిపోయిన మహిళలు, పిల్లల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
అధికారులను తనచుట్టూ తిప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. పబ్లిసిటీ ఇచ్చి జనాన్ని రప్పించి చంపించిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు.