వేదవ్యాస రంగభట్టర్(ఫైల్)
తిరుపతి కల్చరల్: సంస్కృత అధ్యాపకుడు, సినీగేయ రచయితగా సంగీత సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తనదైన శైలిలో అద్భుత పాటలతో ఆధ్యాత్మిక చిత్రాలకు నిండుదనం తెచ్చిన సాహితీవేత్త, సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రంగభట్టర్ ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కన్నుమూశారు. గురువారం బైరాగిపట్టెడలోని ఆయన స్వగృహం నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రంగభట్టర్ పూర్వీకులది తమిళనాడులోని శ్రీరంగం. శ్రీవైష్ణవి ఆచార్య పీఠానికి చెందిన పూర్వీకులు సమాజాన్ని ఆధ్యాత్మికతlవైపు నడిపించాలన్న సంకల్పంతో కొన్ని శతాబ్దాల క్రితం వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో స్థిరపడ్డారు. 1946లో ఆయన జన్మించినా అదే గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1968లో టీటీడీలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య అధ్యాపకులుగా బోధన రంగంలోకి ప్రవేశిం చారు. సాహిత్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి వేదవ్యాస రంగభట్టర్‌కు స్వయాన తమ్ముడు కావడం గమన్నార్హం. వృత్తి రీత్యా తిరుపతిలో స్థిరపడ్డా ప్రస్తుతం బైరాగిపట్టెడలో ఆయన నివాసముంటున్నారు. వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకుడు కావడంతో సాహిత్యంలో మంచి పట్టు సాధించారు. 1986లో రంగవల్లి చిత్రానికి ఆయన తొలిసారిగా పాటలు రచించారు. మూడు దశాబ్దాలుగా సాహితీ సేవ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన శ్రీమంజునాథ, పాండురంగడు, రామదాసు, షిరిడీసాయి, అనగనగా ఒక ధీరుడు, ఝుమ్మంది నాదం, జగద్గురు ఆదిశంకర, వెంగమాంబ, ఓం నమో వేంకటేశాయ వంటి 13 చిత్రాలకు అద్భుతమైన ఆధ్యాత్మికతను రేకెత్తించే పాటలను రచించి గొప్ప సినీ రచయితగా పేరు గడించారు. ‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే సంగీత పుస్తకాన్ని రచించి సులభతరంగా సంగీతం నేర్చుకునేలా దోహదపడ్డారు. తద్వారా పలు రికార్డులు సాధించారు.
భూమన ప్రగాఢ సంతాపం
ప్రముఖ సాహితీవేత్త రంగ భట్టర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రంగభట్టర్ మృతి రాష్ట్ర ప్రజలకు తీరనిలోటన్నారు. తిరుపతి నాటక రంగానికి ఆయన వెన్నెముకగా నిలిచారని తెలిపారు. కళాకారులను అన్ని విధాలా ప్రోత్సహించారన్నారు. అనేక దేవుళ్లకు సుప్రభాత కీర్తనలను రాసిన విధూషీమణిగా కీర్తించారు. సాహితీవేత్తగా, అద్భుతమైన సినీ గేయ రచయితగా ఎనలేని గుర్తింపు పొందారన్నారు. రంగభట్టర్ అనన్య సామాన్యమైన ప్రతిభా మూర్తిగా భూమన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment