బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో దెబ్బతిన్న శ్లాబ్
కొరిటెపాడు(గుంటూరు): ‘క్షణ క్షణం.. భయం భయం’.. సర్కారీ భవనాల్లో ఉద్యోగుల పరిస్థితి ఇది. ప్రభుత్వ కొలువంటే చింతలేదనుకునే వారు. కానీ నేడు ప్రాణాలకు తెగించడం అనుకుంటున్నారు. దీనంతటికీ కారణం దశాబ్దా్దల కిందట నిర్మించిన భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను కొనసాగించడం.. అందులోనే దినమొక గండంగా ఉద్యోగులు పనిచేయాల్సి రావడం. జిల్లా కేంద్రంలో 1857లో నిర్మించిన కలెక్టర్ భవనం నేటికి చెక్కుచెదరకుండా ఒక అపురూప కట్టడంగా నిలిస్తే..ఇదే ప్రాంగణంలో 1980లో నిర్మించిన సంక్షేమభవన్, సర్వేల్యాండ్ డిపార్టుమెంట్, ఇరిగేషన్, వ్యవసాయ, జిల్లా వయోజన విద్యా కేంద్రాలు మాత్రం శిథిలావస్థకు చేరాయి. తాజాగా జిల్లా సంక్షేమశాఖకు చెందిన విభాగంలో భవనం సీలింగ్ ఊడి పడటం ప్రత్యక్ష ఉదాహరణ.
కొత్తవి నిర్మించరు..
జిల్లా సంక్షేమశాఖ కార్యాలయం ఏర్పాటై సరిగ్గా మూడున్నర దశాబ్దాలు గడుస్తోంది. ఈ భవనంలో కీలకశాఖలైన ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ విభాగం, గురుకుల విద్యాసంస్థల జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయాలున్నాయి. రవాణాలు, స్కాలర్‌షిప్‌లు, సొసైటీల రిజిస్ట్రేషన్‌లు తదితర పనుల కోసం నిత్యం వందల మంది వస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గతేడాది నవంబర్‌లో సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగంలోనూ భవనం పెచ్చులూడి పడటంతో ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. మార్కెట్ కూడలిలోని జిల్లా వయోజన విద్యాశాఖ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. భవనంలోపల వయోజన విద్యాశాఖ సహాయ సంచాలకుల చాంబర్ సైతం పెచ్చులూడిపోయే దశకు చేరుకుంది. గదులు పూర్తి డొల్లగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment