వివరాలివ్వని వారికి మార్చి వేతనాల్లేవ్ ! | No salary for employees failing to furnish personal details | Sakshi
Sakshi News home page

వివరాలివ్వని వారికి మార్చి వేతనాల్లేవ్ !

Published Thu, Mar 6 2014 5:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

వివరాలివ్వని వారికి మార్చి వేతనాల్లేవ్ ! - Sakshi

వివరాలివ్వని వారికి మార్చి వేతనాల్లేవ్ !

*ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులపై వేగం పెంచిన అధికారులు
*ఫైళ్ల విభజన, ఫొటోకాపీ లేదా డిజిటైజేషన్ తప్పనిసరి
* ప్రాంతానికి సంబంధించిన ఫైలు ఆ రాష్ట్రానికి.. విధానపరమైన నిర్ణయాలున్న ఫైళ్లు రెండు రాష్ట్రాలకు పంపాలి
*56 వేల మంది రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులు, సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీ కేంద్రానిదే
*జూన్ 1 లోగా రెండు రాష్ట్రాల్లో అన్ని శాఖలు పనిచేసేలా ఏర్పాట్లు..
'మార్చి 31 నాటికి ఫైళ్ల విభజన ప్రక్రియ పూర్తిచేయాలి: సీఎస్

 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ఏర్పాటుకు అపాయింటెడ్ డేను ప్రకటించడంతో అధికారులు ఫైళ్లు, ఉద్యోగులు, అప్పులు, ఆస్తుల విభజనపై దూకుడు పెంచారు. అపాయింటెడ్ డే గెజిట్ వెలువడడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి బుధవారం 15 కమిటీల కార్యదర్శులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంకా వివరాలు ఇవ్వని ఉద్యోగులకు మార్చి నెలలో వేతనం నిలిపివేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులు 11.28 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 7.56 లక్షల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో 83 శాతం మంది తమ వివరాలను ఇదివ రకే ఇచ్చారు.
 
 ఈ నేపథ్యంలో ఇంకా వివరాలు ఇవ్వని ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఫైళ్ల విభజన, వాటి ఫొటోకాపీలు తీయడం లేదా డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని ఫైళ్లు చేయాలా? లేక కీలకమైన ఫైళ్లు చేస్తే సరిపోతుందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. దీనిపై ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డిస్పోజ్ చేసిన ఫైళ్లను ఆర్కివ్స్ విభాగానికి పంపిం చాలని, ఏ ప్రాంతానికి చెందిన ఫైళ్లు ఆ ప్రాంతానికి పంపించాలని, అలాగే విధానపరమైన నిర్ణయాలున్న ఫైళ్లను మాత్రం ఇరు ప్రాంతాలకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

ఫైలు మేనేజ్‌మెంట్, ఫైళ్ల భద్రత, కరెంట్ ఫైళ్లకు సంబంధించి డేటాబేస్ రూపొందించాలని సూచించారు. స్థిరాస్తులు, చరాస్తుల జాబితాను పూర్తి చేసి.. వాటిని సెంట్రల్ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులకు సంబంధించి.. పదేళ్లకాలానికి ఏ భవనం ఏ రాష్ట్రానికి కేటాయిస్తే బాగుంటుందో తెలియజేస్తూ 1, 2, 3 చొప్పున ఆప్షన్లతో నివేదిక ఇవ్వాలని సీఎస్ సూచించారు.


 
 పంపిణీ బాధ్యత కేంద్రానిదే: రాష్ట్ర స్థాయి కేడర్ సిబ్బంది, సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీ బాధ్యత మొత్తం కేంద్రానిదేనని, రాష్ట్ర యంత్రాంగం కేవలం డేటా సిద్ధం చేయడమేనని సీఎస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా మే ఒకటో తేదీ నాటికి ఉద్యోగులు, అధికారుల పంపిణీ పూర్తవుతుందని అధికారవర్గాలు వివరించాయి. రాష్ట్రంలో మొత్తం 84 వేల రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుండగా.. ప్రస్తుతం 56 వేల మంది మాత్రమే ఉన్నారు.

వీరిని పంపిణీ చేసే బాధ్యతను కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ నిర్ణయిస్తుంది. సివిల్ సర్వీసెస్ అధికారులు 600 మందిని బదిలీ చేయడానికి మరో కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. మరోవైపు కొత్త రాష్ట్రాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్)ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. మొత్తమ్మీద జూన్ 2న రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి ముందే రెండు ప్రభుత్వాలు కొనసాగడానికి వీలుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
 మాకూ ఆప్షన్ ఇవ్వండి... సొంతూరు పోతాం
 సీఎస్‌కు ఓపెన్ కేటగిరీ టీచర్ల విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓపెన్ కేటగిరీలో ఎంపికై ఇతరచోట్ల పనిచేస్తున్న ఉపాధ్యాయులు సొంత  ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ‘ఆప్షన్’ అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయుల స్వచ్ఛంద బదిలీల సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సమితి తరఫున ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మోహన్‌రావు, జి.శ్రీనివాసరావు తదితరులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలసి వినతిపత్రం సమర్పించారు.

 

ఉపాధ్యాయ నియామకాల్లో ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన 1975 నుంచి 2000 వరకు 30 శాతం మంది, 2001 నుంచి 2013 వరకు 20 శాతం మంది లోకల్ అభ్యర్థులతోపాటు నాన్‌లోకల్ అభ్యర్థులు కూడా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారని, విభజన తరువాత జిల్లా స్థాయి ఉద్యోగులు ఎక్కడివారక్కడే అనడంతో తమకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని వారు వివరించారు.

 

భవిష్యత్తులో తమ పిల్లలు స్థానికేతరులుగా మారుతారని, ఒక రాష్ట్రంలో ఇచ్చే హెల్త్‌కార్డ్సు మరో రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమ కుటుంబాలకు దూరమయ్యే పరిస్థితి నుంచి కాపాడేందుకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందినవారికి ఆప్షన్ ఇవ్వాలని విన్నవించారు. తమ విన్నపాన్ని కేంద్రానికి పంపిస్తామని సీఎస్ మహంతి హామీ ఇచ్చినట్టు వారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement