ఏర్పాటై వంద రోజులైనా గాడిన పడని కొత్త జిల్లాలు
- చాలా జిల్లాల్లో ఉద్యోగులు, భవనాలకు తీవ్ర కొరత
- శిథిలావస్థకు చేరిన భవనాల్లో సైతం ఆఫీసులు
- ప్రజలకు దగ్గరైన అధికారులు.. సమస్యలపై పెరిగిన ఫోకస్
-
కలెక్టర్ల ప్రత్యేక శ్రద్ధతో హాస్టళ్లు, ఆరోగ్య కేంద్రాల్లో మారుతున్న పరిస్థితులు
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై వంద రోజులు దాటింది. ప్రజల చెంతకు సుపరి పాలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలనే అందించింది. పది పాత జిల్లా కేంద్రాలు మినహా కొత్తగా ఆవిర్భవించిన 21 జిల్లా కేంద్రాల్లో పాలన ఇంకా గాడిలో పడలేదు. మౌలిక వసతుల లేమి నుంచి అధికారులు, ఉద్యోగుల కొరత దాకా ఎన్నో ప్రతిబంధకాలు నెలకొన్నాయి. అయితే జిల్లా స్థాయి అధికారులు చేరువకావడంతో కొత్త జిల్లాల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ప్రజలు అధికారులకు తమ సమస్యలను చెప్పుకునేందుకు, గోడు వెళ్లబోసుకునేందుకు పోటీ పడుతున్నారు. వారానికోసారి జిల్లా కేంద్రంలో కలెక్టర్ల స్థాయిలో నిర్వహించే ‘ప్రజావాణి’ ఫిర్యాదుల దినోత్సవానికి రెండింతల స్పందన పెరిగింది. కానీ వాటిని పరిష్కరించే దిశగా పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. కొన్ని జిల్లాల్లో యువ కలెక్టర్లు, ఎస్పీలు కొత్త కార్యక్రమాలపై దృష్టి సారించటంతో పాటు క్షేత్ర పర్యటనలతో ప్రజలతో మమేకమవడం సత్ఫలితాలిస్తోంది. దీంతో సంక్షేమ హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అన్ని చోట్ల ఫోకస్ పెరిగింది. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కరువయ్యాయి. గుడి.. బడి.. అంగన్‌వాడీ.. గ్రామ పంచాయతీ.. హాస్టల్ భవనాలు.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్న గదులన్నింటా ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు దర్శనమిస్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్
పోస్టులు ఖాళీ..
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాలకు చిక్కులొచ్చి పడ్డాయి. పాత జిల్లా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులనే వాటి పరిధిలో ఏర్పడ్డ జిల్లాలకు సర్దుబాటు చేశారు. దీంతో ఉన్నచోట మూడొంతులకుపైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. కొత్త జిల్లాల్లో ఇన్‌చార్జ్‌లు, అరకొర అధికారులతో పరిపాలన సాగిస్తున్నారు. సిబ్బంది సరిపోరని ముందుగానే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు, విభాగాలన్నింటినీ విలీనం చేసింది. జిల్లాస్థాయిలో ఉండే 54 విభాగాలను 26కు కుదించింది. ఆయా విభాగాల్లో ద్వితీయ శ్రేణిలో ఉన్న అధికారులందరికీ పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాల్లో సర్దుబాటు చేశారు.
అప్పటికీ సగానికిపైగా ఖాళీ పోస్టులుండటంతో క్షేత్రస్థాయిలో పరిపాలన కుంటుపడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పడిన అనంతరం ఆ జిల్లాకు 54 మంది ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించారు. అందులో కేవలం 20 మంది మాత్రమే విధుల్లో చేరారు. 34 మంది అధికారులు లేక పాలనలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా కార్యాలయాల్లో తాత్కాలిక సదుపాయాలు మాత్రమే ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. భువనగిరిలో సరిపడే వసతులు ఉన్నప్పటికీ హైదరాబాద్ చేరువలో ఉండడంతో చాలా వరకు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
అప్ అండ్ డౌన్ జిల్లాలు
కొత్త జిల్లాలు అధికారులు, ఉద్యోగులకు అప్ అండ్ డౌన్ జిల్లాలుగా మారిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు పాత జిల్లాల పరిధిలో ఏర్పడిన జిల్లాలన్నింటికీ ఉద్యోగులు పాత జిల్లా కేంద్రాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో ఉద్యోగులు, అధికారులకు కనీసం అద్దె నివాసాలు కూడా దొరకటం లేదు. దీంతో భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లా కేంద్రాల్లో సర్వ్ టు ఆర్డర్ ఉత్తర్వులపై పనిచేస్తున్న ఉద్యోగులందరూ వరంగల్ నుంచి, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న వారు కరీంనగర్ నుంచి వచ్చి పోతున్నారు. నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఠంఛన్‌గా డ్యూటీ టైం దాటిందంటే.. సెలవు దొరికిందంటే చాలు ఉద్యోగులు, అధికారులు కొత్త జిల్లా కేంద్రాల నుంచి జంప్ అవుతున్నారు.
ఫైళ్లు, రికార్డులు ఎక్కడ దాచేది?
ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక వసతులు లేకపోవటంతో ఫైళ్లు, రికార్డులు భద్రపరచటం ఇబ్బందిగా మారింది. వనపర్తి జిల్లాలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిపోయే అధికారులకు, ప్రజలకు టాయిలెట్స్ కూడా లేవు. ప్రజావాణికి వచ్చే అధికారులు టాయిలెట్ కోసం మోటర్ సైకిల్‌పై వెళ్లొస్తున్నారు. రెవెన్యూ శాఖ పరంగా కులం, ఆదాయం, నివాస పత్రాలు జారీ మినహా మిగతా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. మండలాల ఏర్పాటు తర్వాత వెబ్‌లాండ్ అప్‌డేట్ చేయలేదు. దీంతో రైతులకు కీలకమైన పహాణీ అప్‌డేట్స్, మార్పులు, చేర్పులు వంటివి పెండింగ్‌లో ఉంటున్నాయి. రైతులకు సంబంధించి సర్వే పనులను సిబ్బంది లేరనే సాకుతో పెండింగ్‌లో పెడుతున్నారు.
గాడినపడుతున్న.. పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా ఇప్పుడిప్పుడే బాలారిష్టాలు దాటి గాడిలో పడుతోంది. కలెక్టరేట్ సముదాయాన్ని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కానీ ఐటీఐ కళాశాలకు క్యూసీఐ (క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా) నుంచి వచ్చే విద్యా సంవత్సరానికిగానూ అఫిలియేషన్ వచ్చింది. కళాశాలను ఇక్కడి నుంచి మార్చితే, అఫిలియేషన్ రద్దు అవుతుందని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో కలెక్టరేట్ సముదాయాన్ని ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడ్డ అంతర్గాం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని పీహెచ్‌సీ భవనంలో ఏర్పాటు చేశారు.
సూర్యాపేట.. ఫర్నిచర్ లేదు..
జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు మినహా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సరిపడా ఫర్నిచర్ సరఫరా కాలేదు. దీంతో ఏ ఫైలు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు. కంప్యూటర్లు లేక డేటా ఎంట్రీ చేయడం లేదని అధికారులు వాపోతున్నారు.
జయశంకర్ జిల్లా.. సదుపాయాలు ఓకే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి సంస్థకు చెందిన అతిథి గృహంలో కలెక్టరేట్ ఏర్పాటైంది. కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఇతర పోలీసు స్టేషన్లకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. సింగరేణి భవనాలుండటంతో మౌలిక సదుపాయాల కొరత లేదు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో, ఎంఈవో ఆఫీసులు ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
కలెక్టర్ల చొరవ భేష్
కొత్త జిల్లాల్లో యువ అధికారులను కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించటం సంతృప్తికర ఫలితాలను అందిస్తోంది. ప్రజలతో మమేకమవటం.. వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలకటం.. క్షేత్రపర్యటనలతో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు శ్రద్ధ కనబరుస్తున్నారు. దీంతో ఏళ్లకేళ్లుగా దుస్థితిలో చిక్కుకున్న ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు అక్కడి కలెక్టర్, ఎస్పీ నెలలో ఒకరోజు అందుబాటులో ఉంటున్నారు.
కలెక్టర్, ఎస్పీలు ప్రతి నెలలో ఒకరోజు జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, సంగారెడ్డి కలెక్టర్ మాణిక్యరాజ్ కన్నన్.. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, ప్రభుత్వ స్కూళ్లపై ఫోకస్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ జిల్లా, స్వచ్ఛ పల్లె నినాదంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ 36 గంటల్లో 820 మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించా రు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులే ప్రత్యేకంగా మండలాలకు వెళ్లి జమీన్‌బందీ పేరుతో కార్యక్రమం చేపట్టారు.
వరంగల్ రూరల్.. ‘అర్బన్’లో కలెక్టరేట్
వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న హన్మకొండ, వరంగల్ మండలాల్లో ఉన్నాయి. హన్మకొండలోని ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయాన్ని రూరల్ జిల్లా కలెక్టరేట్‌కు కేటాయించారు. చిన్న గదులు ఉండడంతో పాటు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అన్ని సమావేశాలు సుబేదారిలో ఉన్న అర్బన్ కలెక్టరేట్‌లో నిర్వహించాల్సి వస్తోంది. దీంతో సమస్యలు తప్పడం లేదు. రూరల్ జిల్లా కలెక్టరేట్‌కు ఏ ప్రాంతంలో స్థలం చూడాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రం కోసం గీసుకొండ, నర్సంపేట, పరకాల ప్రాంతాల నుంచి ఇప్పటికీ ప్రాంతాలవారీగా డిమాండ్లు ఉన్నాయి. కలెక్టరేట్‌లో 53 మంది సిబ్బంది అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 19 మంది మాత్రమే ఉండడంతో కార్యకలాపాలు కష్టంగా నిర్వహించాల్సి వస్తోంది. కీలకమైన డీఆర్‌ఓ, జిల్లా వ్యవసాయ అధికారి, ఉద్యానశాఖ, జెడ్పీ సీఈఓ పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లే అధికారులుగా ఉన్నారు.
అర్బన్‌లో కలెక్టర్ ‘స్టాఫ్’ సగమే..
జిల్లాలో చాలా ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఉన్న సిబ్బందిని తాత్కాలిక సర్దుబాట్లు చేసి త్వరలో పదోన్నతులు, నియామకాల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్‌కు మొత్తం 94 మంది ఉద్యోగులు ఉండేవారు. జిల్లా విభజన సమయంలో కొన్ని పోస్టులు తొలగించి మరికొన్నింటిని కలిపి మొత్తంగా కలెక్టర్ స్టాఫ్ 50గా ఖరారు చేశారు. కానీ వీరిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లాలో 17 వేల మంది ఉద్యోగుల వరకు అవసరం ఉండగా.. 13,625 మంది మాత్రమే ఉన్నారు.
జనగాంలో అవే ఆందోళనలు
జిల్లా కేంద్రం ఏర్పాటుకు ముందు ఆందోళనలతో హోరెత్తిన జనగాంలో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లా ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నా నాలుగు మండలాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. జఫర్‌గడ్ మండలం, చిల్పూర్, స్టేషన్ ఘన్‌పూర్ మండలాలను వరంగల్ అర్బన్‌లోనే కొనసాగించాలని అక్కడి ప్రజలు పట్టుబడుతున్నారు. గుండాల మండలం యాదాద్రిలో కొనసాగించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలంలోని కొండాపూర్, కూటిగల్ గ్రామాలను జనగామ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన తరిగొప్పుల మండలంలో కలుపుతూ గతేడాది అక్టోబర్ 11న ప్రభుత్వం తుది గెజిట్‌ను విడుదల చేసింది. ఇవి ఇప్పటికీ జిల్లాలో చేరలేదు. కొండాపూర్ నుంచి తరిగొప్పులకు 12 కిలోమీటర్లు, కూటిగల్ గ్రామం తరిగొప్పుల మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. కానీ జనగామ జిల్లాలో ఆ రెండు గ్రామాలను విలీనం చేసినట్లుగా గెజిట్‌లో పేర్కొనడంతో సిద్దిపేట జిల్లా నుంచి రెండు గ్రామాలను తొలగించారు. కానీ జనగామ జిల్లాలో చేర్చినట్లుగా పొందుపర్చలేదు. దీంతో సందిగ్ధత కొనసాగుతోంది.
రాజన్న సిరిసిల్ల.. కలెక్టరేట్ ఎక్కడ?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ కోసం ఇంకా స్థలం కేటాయించలేదు. సిరిసిల్ల కొత్త బస్టాండులోని దుకాణ సముదాయాల్లో ఒక్కో షట్టర్‌లో ఒక్కో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా ఆఫీసులకు అద్దె భవనాలు సైతం లభించలేదు. కలెక్టరేట్‌లో ఉండాల్సిన సిబ్బంది కేటాయింపులు ఇంకా జరగలేదు. ఉన్న వారికే ఆయా శాఖల్లో ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తున్నారు. ప్రజావాణి దరఖాస్తుల్లో 90 శాతం సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు ఉండేందుకు అద్దె ఇళ్లు దొరకడం లేదు.
మేడ్చల్.. అద్దె భవనంలో కలెక్టరేట్
కీసర గ్రామ రెవెన్యూ పరిధిలో మూతబడిన ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనం కీసర మండల కేంద్రానికి 2 కి.మీ. దూరంలోని పంట పొలాల్లో ఉంది. దీంతో కొందరు అధికారులు, ఉద్యోగులు 40 కి.మీ దూరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కలెక్టరేట్ భవన సముదాయాల్లో 40 ప్రభుత్వ శాఖలు ఉండగా, రెవెన్యూ విభాగం మినహా మిగతా శాఖల్లో ఫర్నిచర్ ఇంకా సమకూర్చలేదు. కలెక్టరేట్‌లోని 300 మంది ఉద్యోగులు, సిబ్బంది అవసరం కాగా.. 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం.. సరిపడా భవనాలు
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు, నివాస గృహాలకు సింగరేణి సంస్థ భవనాలను సమకూర్చింది. అవి పక్కాగా ఉండటంతో పాలనాపరంగా ఇబ్బందులేవీ లేవు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, నివాస గృహాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించింది. కీలకమైన జిల్లా రెవెన్యూ అధికారి పోస్టు, భద్రాచలం డీఎస్పీ పోస్టు, భద్రాచలం ఐటీడీఏ పీఓ పోస్టు ఇంకా భర్తీకి నోచుకోలేదు.
మెదక్.. 523 పోస్టులు ఖాళీ..
కొత్తగా ఏర్పాటైన మెదక్ జిల్లాలో పాలన గాడిన పడలేదు. ఉద్యోగుల కొరత ఇందుకు ప్రధాన కారణం. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి 42 శాఖలు మెదక్‌కు తరలివచ్చాయి. జిల్లాకు 1405 మంది ఉద్యోగులను కేటాయించారు. వీరిలో 882 మంది మాత్రమే విధుల్లో చేరారు. 523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెదక్ కలెక్టరేట్‌లో 54 పోస్టులకుగాను 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జగిత్యాల.. ఆఫీసుల్లో వసతుల్లేవ్..
జగిత్యాల జిల్లాలో కార్యాలయాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. సగానికిపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఇరుకైన గదుల్లోనే కొనసాగుతున్నాయి. శాఖాపరమైన సమావేశాలు నిర్వహించుకోవాలంటే అధికారులకు సవాలుగా మారింది. అనేక కార్యాలయాల్లో టాయిలెట్లు, తాగునీటి వసతి కూడా లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. 60 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికీ ప్రతి రోజు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
సిద్దిపేట.. పూర్తిస్థాయిలో నియామకాలు
సిద్దిపేటలో ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనంలో కలెక్టరేట్‌ను నడుపుతున్నారు. అందులో 18 ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మిగితావి గతంలో డివిజన్ కార్యాలయాల్లో, ప్రభుత్వ భవనాల్లో జిల్లా కార్యాలయాలుగా కొనసాగుతున్నాయి. సీఎం సొంత జిల్లా కావడంతో ఉద్యోగుల నియామకాలు పూర్తిస్థాయిలో జరిగాయి. మరో 8 ప్రభుత్వ శాఖల్లో విభజన జరగక పోవడంతో సంగారెడ్డి నుంచి సిద్దిపేట జిల్లాకు సంబంధించి విధులు నిర్వహించాల్సి వస్తోంది.
నిర్మల్.. ఆఫీసులకు కటకట
నిర్మల్ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం ఇంకా స్థల ఎంపిక జరగలేదు. పట్టణ శివారులో ఉన్న సారంగాపూర్ మండలంలోని చించోలి(బి)లో సుమారు 60 ఎకరాల అసైన్డ్ భూమిని ఎంపిక చేయాలనుకున్నా.. పలువురు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. పట్టణానికి సమీపంలో ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద విస్తీర్ణంలో స్థలం దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో 51 పోస్టులకుగాను 19 మంది పనిచేస్తున్నారు. పెంబి మండలంలో శిథిలావస్థకు చేరడంతో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూల్చివేయాలని గతంలో ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పుడు అందులోనే తహసీల్దార్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.