సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కింద విదేశాలనూ సందర్శించే అవకాశాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీనిపై హోం, టూరిజం, పౌర విమానయాన శాఖలను అభిప్రాయం చెప్పాలని కూడా కేంద్రం కోరినట్లు తెలిసింది.
మధ్య ఆసియా దేశాలు అయిన కజక్‌స్థాన్, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్‌లకు వెళ్లే ఉద్యోగులకు ఎల్టీసీ కల్పించాలని దేశ విదేశాంగ శాఖ గతంలో ప్రభుత్వాన్ని కోరింది. దీని వల్ల ఆయా దేశాలతో సంబంధాలు మరింత బలపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి ఈ ఏడాది మార్చిలోనే ఎల్టీసీ కింద విదేశీ టూర్లు ఉంటాయని, సార్క్ దేశాలకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఎల్‌టీసీ కింద అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో పాటు టికెట్ రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48.41 లక్షల మంది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment