- 2 రాష్ట్రాలమధ్య ప్రాథమికంగా అప్పుల వాటాలు పంచిన కేంద్రం
- విభజన నాటికి ఆడిట్ అయిన మేరకు రాష్ట్రంవాటా రూ.61,711 కోట్లు
- ఆడిట్ పూర్తయితే మరో రూ. 10 వేల కోట్లు పెరిగే అవకాశం
- తొలి ఏడాదిలో సర్కారు చేసిన అప్పు మరో రూ. 10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: అప్పులు.. వడ్డీల భారం తెలంగాణ రాష్ట్రాన్ని వెంటాడుతోంది. గత ఏడాది అప్పులపై వడ్డీలకు రూ.5,925 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులకు రూ.7,554 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. రాష్ట్ర పునర్విభజన నాటికి ఉన్న ఆస్తులు, అప్పుల వాటాలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ప్రాథమికంగా పంపిణీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం అప్పులు 1,48.060.22 కోట్లు. ఈ అప్పుల పంపిణీలో తెలంగాణ వాటా రూ.61,711.50 కోట్లుగా లెక్క తేలింది.
విభజన నాటికి ఆడిట్ పూర్తయిన గణాంకాలనే కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అప్పులకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదని.. ఆడిట్ పూర్తయితే మరో రూ.10 వేల కోట్ల అప్పు తెలంగాణ వాటాకు జమ అవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు తొలి ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఈ లెక్కన రాష్ట్రం చేసిన అప్పు రూ. 80 వేల కోట్లు దాటుతుందని అంటున్నారు.
జీతాలు.. పెన్షన్ల భారం..
వేతన సవరణతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ప్రభుత్వంపై అదనపు భారం మోపాయి. గత ఏడాది ఉద్యోగుల జీతాలకు రూ.16,965.33 కోట్లు ఖర్చు చేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,045.23 కోట్లు ఖర్చు అవుతుందని ఈ బడ్జెట్‌లో సర్కారు అంచనా వేసింది. దీంతో పాటు ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు రూ.8,235.87 కోట్లు అవసరమని లెక్కలేసింది. అలాగే ఆహార భద్రత.. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ భారం రాష్ట్ర సర్కారుకు తడిసి మోపెడవుతోంది. దీనికితోడు ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లలో భారీగా కోతపడింది.