భయపెడుతున్న భవనాలు
సాక్షి, ముంబై: గత వారం రోజులుగా వర్షాలు జోరందుకోవడంతో నగరంలో పాత భవనాలు కూలిపోవడం ప్రారంభమయ్యాయి. ఈ రెండుమూడు రోజుల్లో పాత భవనాలు కూలడం, ప్రహరి గోడ కూలి పలువురు మరణించడం, గాయపడడం వంటి ఘటనలు పెరిగిపోయాయి. దీంతో మరింత ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిరోధించేందుకు నగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది.
ముందు జాగ్రత్తల్లో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న పాత, ప్రమాదకర భవనాలను ఖాళీ చేయించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఖాళీ చేయాలని అందులో నివాసముంటున్న కుటుంబాలకు ఇది వరకే బీఎంసీ నోటీసులు జారీ చేసింది.
అయినా ఖాళీ చేయకుండా అందులోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారిని ఎలాగైనా ఖాళీ చేయించేందుకు స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలని బీఎంసీ అధికారులు యోచిస్తున్నారు. తాడ్‌దేవ్‌లో శిథిలావస్థకు చెందిన ఓ భవనం గోడ ఆదివారం కూలడంతో ఇద్దరు మరణించగా మరొకరికి గాయలయాయ్యాయి. పశ్చిమ ముంబై సెంట్రల్ (తాడ్‌దేవ్) ప్రాంతంలో వైట్‌హౌస్ బార్ వెనుకాల శనివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొలాబా, శివ్డీ తదితర ప్రాంతాల్లో శనివారం రెండు భవనాలు కూలి ముగ్గురు మరణించడం తెలిసిందే. భయందర్ నవఘర్ పోలీసు స్టేషన్ పరిదిలోని కాశినాథ్ సృ్మతి భవనం కూడా పాక్షికంగా కూలింది.
శిథిలావస్థకు చేరిన భవనం కావడంతో అందులోని వారందరినీ ముందుగానే ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో రెండు అటోలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భవనం శిథిలాలు పెద్ద శబ్దంతో కిందికి కూలాయి. ఆ సమయంలో రోడ్డుపై నుంచి వెళ్లే అనేక మంది భయాందోళనలకు గురయ్యారు. గతంలోనూ ముంబైలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలడంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించడం తెలిసిందే.
ముంబైలో శిథిలావస్థకు చేరిన 391 భవనాలు
నగరంలో దాదాపు 391 భవనాలు అత్యంత ప్రమాదకర స్ధితిలో ఉన్నట్టు నిర్ధారించారు. వీటిలో బీఎంసీ సిబ్బంది క్వార్టర్లు కూడా ఉన్నాయి. వీటిని వర్షాకాలానికి ముందే ఖాళీ చేయించేందుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ప్రయత్నించారు. కొన్ని భవనాలు మాత్రమే ఖాళీ అయినా, ఇప్పటికీ సుమారు 300 భవనాల్లో సిబ్బంది, ఇతరులు ఉంటున్నారు.
ఇటీవల వర్షాలు మరింత జోరందుకోవడంతో ఎలాగైనా ఆ ప్రమాదకర భవనాలను ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని ప్రమాదకర భవనాలపై హైకోర్టులోనూ విచారణ జరిగింది. భవనాలను ఖాళీ చేయించే బీఎంసీ అధికారులకు ముంబై పోలీసులు సాయం చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసు రక్షణ లభించగానే పాత భవనాలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామని సీతారాం కుంటే స్పష్టం చేశారు.
ఏటా వర్షా కాలంలో పాత భవనాలు కూలడం, ప్రాణ, ఆస్తినష్టం జరగడం పరిపాటిగా మారింది. వర్షాకాలానికి ముందు పాత భవనాల పటిష్టతను బీఎంసీ అధికారులు అధ్యయనం చేస్తారు. ఆ తరువాత వాటి జాబితా రూపొందిస్తారు. అత్యంత ప్రమాదకర భవనాల్లో ఉంటున్న వారు ఖాళీ చేయాలని ముందుగా నోటీసులు జారీచేస్తారు. బీఎంసీ పునరావసం కల్పించిన చోట తగిన సదుపాయాలు లేవనే వంకతో ఈ భవనాల వాసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పాత ఇళ్లలోనే ఉంటున్నారు. బీఎంసీ వద్ద తగినంత మందిమార్బలం, పోలీసు భద్రత లేకపోవడంతో ఇలాంటి వారిని ఖాళీ చేయించడం సాధ్యపడడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇక నుంచి బీఎంసీ అధికారులకు పోలీసులు సాయం లభించనుంది.