శిథిలమైన భవనాలు.. పెచ్చులూడి పడుతున్న పైకప్పులు.. వర్షం పడితే భయం.. భయం.. ఈ పరిస్థితులు విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను కూల్చి వేసి వాటిస్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి నిర్ణయించిం ది. నాలుగు నెలల క్రితమే కూల్చివేతలకు అనుమతులిచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగక విద్యార్థులు దినదిన గండంగా గడపాల్సి వస్తోంది.
కాళోజీ సెంటర్: జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 721 ఉన్నాయి. వీటిలో ప్రా«థమిక పాఠశాలలు 472, ప్రాథమికోన్నత పాఠశాలలు 83, ఉన్నత పాఠశాలలు 166 ఉన్నాయి. సుమారు ఏడువేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కువ శాతం పాఠశాలల భవనాలు చాలా ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో స్లాబుల పెచ్చులు ఊడిపోయి విద్యార్థులపై పడి గాయపడిన సంఘటనలున్నాయి. వర్షం కురిస్తే తరగతి గదుల్లో కూర్చోలేని పరిస్థితి. కూలిపోయే దశలో ఉన్న తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పలు పాఠశాలల్లో చెట్లకిందే తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను కూల్చి వేసి వాటిస్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి నిర్ణయించింది. ఆ మేరకు నివేదకలు పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో వేసవిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 270 పాఠశాలల భవనాలను శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. వాటిని కూల్చివేయడానికి నాలుగు నెలల క్రితమే అనుమతులిచ్చింది. పనులను టెండరు ద్వారా చేపట్టాలని పేర్కొంది.
నీరుగారుతున్న సర్కారు లక్ష్యం..
సర్కారు సూళ్లపై నమ్మకం కోల్పోయిన ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రైవేట్‌కు దీటుగా స్కూళ్లను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికతో ముందు సాగుతోంది. అందులో భాగంగా ఇంగ్లిష్ మీడియం అమలుకు పూనుకుంది. అరకొర వసతులు, ఇరుకు గదుల మధ్య విద్యాబోధన కష్టతరంగా మారాయి. సదపాయాలు కల్పించడంతోపాటు శిథిలమైన పాఠశాల ల భవనాలను కూల్చివేసి నూతన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది.
చెట్ల కిందే చదువులు..
ఉత్తర్వులు అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు కూల్చివేత పనులు ప్రారంభించినవి తొమ్మిది పాఠశాల భవనాలు మాత్రమే. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో చదువు సాగడంలేదు. తరగతి గదులు సరిపోకపోవడంతో చాలా గ్రామాలలో ఆరుబైట చెట్ల కిందే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. వర్షం కురిస్తే ఆరోజుకు స్కూల్‌కు సెలవే. స్లాబులు కురుస్తున్న గదుల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇప్పటికైనా అధికారులు కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేసి నూతన భవనాల నిర్మాణానికి కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment