చుక్కకు లేదు లెక్క! | scientific predictions of rainfall | Sakshi
Sakshi News home page

చుక్కకు లేదు లెక్క!

Published Thu, Jul 2 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

చుక్కకు లేదు లెక్క!

చుక్కకు లేదు లెక్క!

వర్షపాతంపై శాస్త్రీయ అంచనాలు మృగ్యం
ముందుచూపు లేని యంత్రాంగం
పేరుకే ‘విపత్తు స్పందన విభాగం’
మేలుకోని ప్రభుత్వం

 
విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మన అధికార యంత్రాంగం... ఉన్నట్టుండి ఏదైనా విపత్తు సంభవిస్తే మాత్రం బెంబేలెత్తుతోంది. సమస్యకు మూలమేంటో...పరిష్కారమేంటో తెలుసుకోలేక తలలు పట్టుకుంటోంది. అప్పటికప్పుడు తోచినదేదో చేసేసి...సరిపెట్టుకుంటోంది. గ్రేటర్‌లో విపత్తు స్పందన విభాగం (డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్) పనితీరు అధ్వానంగా ఉంది. సుమారు 85 లక్షల జనాభాకు చేరువైన మహా నగరంలో భారీ వర్షాలు, వరదలు, పురాతన భవనాలు కుప్పకూలడం వంటి విపత్తులు సంభవిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాన్ని ముందస్తుగా అంచనా వేసే నాథుడే కరువయ్యారు. అంతేకాదు... శాస్త్రీయ పద్ధతుల్లో వర్షపాతం నమోదు, విశ్లేషణ చేసే వారూ లేరు. ఒక్కసారిగా ఐదు సెంటీమీటర్ల వర్షం పడితే నీట మునిగే కాలనీలు, ప్రధాన రహదారులు, నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఉగ్రరూపం దాల్చే నాలాలు, పొంగిపొర్లే మ్యాన్‌హోళ్లపై సమగ్ర సమచారం సైతం పేరు గొప్ప మహా నగర పాలక సంస్థ వద్ద లేదు. విపత్తు స్పందనపై జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాఫిక్, రెవెన్యూ, వాతావరణ శాఖల మధ్య సమన్వయం కొరవడడం శాపంగా పరిణమిస్తోంది. ప్రమాదాలు సంభవించినపుడు హడావుడి చేసే సర్కారు విభాగాలు విపత్తు నిర్వహణ ప్రణాళిక (డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్) విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

 నిర్వహణ అధ్వానం
 నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెయిన్‌గేజ్‌లకు నిర్వహణ లోపం శాపంగా మారింది. పేరుకు 32 రెయిన్‌గేజ్‌లు గ్రేటర్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, కాప్రా, సర్దార్ మహల్ (పాత నగరం), కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వి. మిగతావి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలోవి. వీటి పరిధిలో రోజువారీగా, సీజన్ల వారీగా ఎంత వర్షపాతం నమోదైందో, సగటు ఎంతో లెక్కించే నాథుడే లేరు. జీహెచ్‌ఎంసీలో రెయిన్‌గేజ్‌ల నుంచి అందే సమాచారాన్ని సేకరించే ఇంజినీర్ ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఇప్పటి వరకు ఆ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా గురువారమే మరొకరికి  బాధ్యతలు అప్పగించారు.

 ఇలా ఎదుర్కొంటే మేలు...
జీహెచ్‌ఎంసీ, జల మండలి, రెవెన్యూ, పోలీసు, వాతావరణ శాఖ, అగ్నిమాపక శాఖ, హెచ్‌ఎండీఏల సమన్వయంతో విపత్తు స్పందనా దళం ఏర్పాటు చేయాలి. దీనిలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణనివ్వాలి. అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చాలి. దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
     
విపత్తు స్పందనా దళానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. గ్యాస్‌కట్టర్లు, రెస్క్యూల్యాడర్లు, పొక్లెయినర్లు, ఫైరింజన్లు, క్రేన్లు, అగ్ని నిరోధక దుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు, అంబులెన్స్ వంటివి సొంతంగా ఉండేలా చూడాలి.పురాతన భవనాల్లో ఉన్న సూక్ష్మ పగుళ్లు, భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు బార్క్ (బాబా ఆటమిక్ రీసెర్చ్‌సెంటర్) సిద్ధం చేసిన రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి.
     
అన్ని నాలాలు, లోతట్టు ప్రాంతాలను జీఐఎస్ పరిజ్ఞానంతో గుర్తించి మ్యాపులు సిద్ధం చేయాలి.లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ప్రణాళిక అవసరం: మర్రి శశిధర్‌రెడ్డి, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మాజీ ఉపాధ్యక్షులు గ్రేటర్ నగరానికి ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ ప్రణాళిక అవసరం. ముంబయిలో ప్రతి వార్డుకు విపత్తు స్పందనా దళం అందుబాటులో ఉంది. నగరంలో ఆ పరిస్థితి లేదు. జాతీయ విపత్తు స్పందనా దళం సభ్యులు నగరంలో నిరంతరం అందుబాటులో ఉండేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. జీహెచ్‌ఎంసీ ఆదాయ మార్గాలు పెంచుకోవడం పైనే కాక విపత్తు నిర్వహణపై దృష్టి సారించాలి. ప్రకృతి, మానవ సంబంధ విపత్తులు, బర్డ్‌ఫ్లూ, ఎబోలా వైరస్‌ల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వేర్వేరుగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి.
 
 ఇదీ పరిస్థితి...
జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌నుఆర్భాటంగా ఏర్పాటు చేసినా... అత్యవసరమైనరెస్క్యూ ల్యాడర్స్ (నిచ్చెనలు), గ్యాస్‌కట్టర్‌లు, క్రేన్లు తదితర పనిముట్లు అందుబాటులో లేని దైన్యస్థితి.నగరంలో 80 విపత్తు స్పందన బృందాలు ఉన్నాయి.వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.{Vేటర్ పరిధిలో వర్షపాతాన్ని లెక్కించే రెయిన్‌గేజ్ స్టేషన్లు 32 ఉన్నాయి.వీటిలో రోజువారీగా, సీజన్ల వారీగావర్షపాతాన్ని లెక్కించి.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన విషయంలో జీహెచ్‌ఎంసీది ప్రేక్షక పాత్రే.విపత్తు సంభవిస్తే స్పందించే అత్యవసర యంత్రాంగం, సమర్థంగా ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, అవసరమైన నిధుల కేటాయింపులు లేవు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌లో ఒకే అధికారి పని చేస్తున్నారు. అతనికి అవసరమైన సిబ్బంది  లేకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement