కన్నోళ్లకు కన్నీళ్లు మిగుల్చొద్దు
► రోడ్డు భద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలి
► అవగాహన సదస్సులో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
నిర్మల్ రూరల్ : నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ కన్నవాళ్లకు, భార్యాపిల్లలకు జీవితాంతం కన్నీళ్లను మిగిల్చవద్దని, ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు ఉండవని ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని దివ్య గార్డెన్స్ లో బుధవారం ఆటో డ్రైవర్లు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, దేశంలో ప్రతీ సెకన్ కు ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. వీటిని నివారించాలంటే ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనం బయటకు తీస్తున్నామంటే తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు.
తలకు భారం అనుకోవద్దని, అదే తమను కాపాడుతుందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. భారీ వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలన్నారు. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు అనేవే ఉండవన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడుపవద్దని సూచించారు. పోలీస్ సిబ్బంది కూడా హెల్మెట్ లేకుండా విధులకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు భద్రతకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు
‘డ్రంకన్ డ్రైవ్ చేపట్టే బదులు.. మద్యం అందుబాటులో లేకుండా చేయాలి..’ అని విద్యార్థిని అర్ఫత్‌షా అడిగిన ప్రశ్నకు ఎస్పీ సమాధానమిచ్చారు. లిక్కర్ తయారీ ప్రభుత్వం చేతిలో ఉం టుందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్న విషయం మన చేతుల్లో ఉంటుందని చెప్పారు. అలాగే విద్యార్థిని మనోజ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా తమ నాన్న, అన్నలను బయటకు వెళ్లనివ్వవద్దని పేర్కొన్నారు. మద్యం తాగి నడిపితే ఇంట్లోకి అనుమతించవద్దని ఆమె పేర్కొనడాన్ని ఎస్పీ ప్రశంసించారు. హెల్మెట్ ధరించకపోవడంతో కలిగే అనర్థాలపై రూపొందించిన షార్ట్‌ఫిల్‌్మను పట్టణ పోలీసులు ప్రదర్శించి చూపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, ఎంవీఐ అజయ్‌కుమార్‌రెడ్డి, పట్టణ సీఐ జీవన్ రెడ్డి, ఎస్సైలు సునీల్‌కుమార్, కిరణ్ పాల్గొన్నారు.