
అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు
సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలు, వ్యాపారులు కాం గ్రెస్ పీడ వదిలించేందుకే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని
సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలు, వ్యాపారులు కాం గ్రెస్ పీడ వదిలించేందుకే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకే శాంతివంతమైన వాతావరణంలో పరిసాలన కొనసాగిస్తున్నానన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరకుపోయి శిక్షలు పడిన దాఖలాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించే ప్రతి సంక్షేమ పథకాన్ని అడ్డుకుంటూ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు.
సీఎం కేసీఆర్ ఒక పద్ధతి ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి వెలుగు వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అమలైతే తమకు రాజకీయం లేకుండా పోతుందనే అక్కసుతో ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై దుయ్యబట్టారు. తాను అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోర్టుకు హాజరు కాలేదని, ఒక సాధారణ వ్యక్తిగా తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఉద్యమ నాయకులను అరెస్టు చేసిన చరిత్ర మీదన్నారు. సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా పాలన అందిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర వేశాలు ఇకనైనా మానేయాలని హెచ్చరించారు. నేరస్తులకు తప్పకుండా శిక్ష పడుతుందని, తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ఉద్యమం, కేసీఆర్ ఉద్యమానికి భయపడే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మంత్రిపై చౌకబారు ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ కోర్టులో ఒక్క ఆధారం కూడా చూపలేదు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి అవినీతికిసంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీపీ వట్టె జానయ్య తదితరులు పాల్గొన్నారు.