అటు పైరవీలు.. ఇటు ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ సంస్థల్లోని కొందరు అధికారులే పైరవీలకు తెరతీసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో ఓ డెరైక్టర్‌పై కొందరు వ్యక్తులు ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది. వాస్తవానికి నోటిఫికేషన్లు రాక ముందే దళారులు రంగ ప్రవేశం చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అప్పట్లో హెచ్చరికలు సైతం జారీ చేశారు.
ఆ తర్వాత విద్యుత్ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశాయి. ట్రాన్స్‌కోలో 206, జెన్‌కోలో 856, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 201, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 162 ఏఈ పోస్టులు కలిపి మొత్తం 1,425 పోస్టులకు విద్యుత్ సంస్థలు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించాయి. పోస్టులు పరిమిత సంఖ్యలోనే ఉన్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇటీవలే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లు రాత పరీక్ష నిర్వహించాయి. ఈ నెల 22న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), 29న ట్రాన్స్‌కో సంస్థ రాత పరీక్ష జరగనుంది. భారీగా ఫిర్యాదులు వస్తుండటంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్ రావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది.
వేర్వేరు ప్రకటనలతో గందరగోళం
ఒకే కేటగిరీ పోస్టులు.. ఒకే తరహా అర్హతలు.. విద్యుత్ సంస్థలు మాత్రం నాలుగు వేర్వేరు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అభ్యర్థులు వ్యయప్రయాసలకోర్చి నాలుగు పరీక్షలకు హాజరయ్యేందుకు తంటాలు పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒకే అర్హతలతో ఒకే కేటగిరీ పోస్టులుంటే ఒకే ప్రకటన ద్వారా టీఎస్‌పీఎస్సీ నియామకాలు జరుపుతుండగా, ఒకే శాఖలోని ఒకే కేటగిరీ పోస్టుల కోసం నాలుగు ప్రకటనలు ఎందుకుని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే, ఏఈ రాత పరీక్షలో తాము లీనమై ఉంటే.. హాల్‌టికెట్ల పరిశీలన, గుర్తింపు నిర్ధారణ పేరుతో ఇన్విజిలేటర్లు ఆటంకం కలిగించి సమయం వృథా చేశారని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఇప్పటికే టీఎస్‌ఎన్పీడీసీఎల్, జెన్‌కో రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత హాల్ టికెట్ల పరిశీలన, సంతకాలు, వేలి ముద్రల సేకరణ పాటు గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ గల ఫొటోలు కావాలంటూ సమయం వృథా చేస్తున్నారని తెలిపారు. ఇకపై రాత పరీక్షకు అర్ధగంట ముందే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు.