వారి వీపులు పగలడం ఖాయం
⇒ కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం
⇒ తెలంగాణలో చిచ్చుకు కుట్ర
⇒ అడ్డుకోవడమే ‘ముఠా’పని
⇒ మా అమ్మ,నాన్నే నిర్వాసితులు
⇒ ప్రభుత్వరంగ ఖాళీలను భర్తీ చేస్తాం
సాక్షి, సిరిసిల్ల: కాంగ్రెస్ అధికారంలోకి రావడం మాటేమో గానీ వారి వీపులు పగలడం ఖాయమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు హెచ్చరించారు. తాము 2019లో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలపై ఆయన మండిపడ్డారు. ‘ఆ.. 2019లో ఖాయం.. పక్కా ఖాయం.. వీపులు పలుగుడు ఖాయం.. శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం’అని ధ్వజమెత్తారు. సోమ వారం రాజన్న సిరిసిల్లలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్దూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు.
తన తండ్రి.. సీఎం కేసీఆర్ స్వయంగా భూనిర్వాసితులని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం ఉండే పోశాన్‌పల్లి ఎగువమానేరు ముంపులో పోతే, సిద్దిపేటకు వెళ్లారని గుర్తు చేశారు. అలాగే, తమ తల్లి శోభ కుటుంబీకు లున్న కొదురుపాక మిడ్‌మానేరు ముంపులో పోతోందన్నారు. నిర్వాసితుల బాధేంటో తమ తల్లిని అడిగితే తెలుస్తుందని, తన చిన్న నాటి జ్ఞాపకాలు కూడా కనుమరుగయ్యా యని పేర్కొన్నారు. ‘వాళ్లిద్దరికి తెలియని నిర్వాసితుల బాధలు.. ఈ సిపాయిలకు (జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి)లకు తెలు సట’ అంటూ విరుచుకుపడ్డారు. ‘బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం తప్ప, దారిన పోయే దానయ్యలు.. జానాబెత్తెడు జానా రెడ్డితో ఏం కాద’న్నారు. తాము ప్రజలకు జవాబుదారులం కానీ ప్రజలు విడిచిపెట్టిన ప్రతిపక్షాలకు కాదన్నారు.
తెలంగాణలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి కొంతమంది కుట్రపన్నారని ఆరోపించారు. పెట్టుబడులు రావద్దనేదే వారి ఆలోచన అని ఆరోపించారు. ఆందోళనలకు, అరుపులకు భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ ఖాళీ లన్నింటినీ భర్తీ చేసేందుకు చిత్త శుద్ధితో ఉన్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పించేందుకు దేశ, విదేశాలకు కాలికి బలపం కట్టుకొని తిరు గుతున్నామని చెప్పారు. అభివృద్ధిలో దేశం 8– 10 శాతం పెరుగుతుంటే, రాష్ట్రం 17– 19 శాతం పెరుగుతోందని కేటీఆర్ వివరించారు.
ప్రతిపక్షాలు కావవి... దుష్పక్షాలు
దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచిన కేసీఆర్ పాలనను, తెలంగాణను వ్యతి రేకించిన ఆంధ్రోళ్లు, ప్రధాని మోదీ సైతం మెచ్చుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని అడ్డుకొంటున్నాయని, అవి ప్రతి పక్షాలు కావని, దుష్పక్షాలని ధ్వజమెత్తారు.