'కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. సన్నాసుల పార్టీ అంటే తిట్టుకాదని...కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్న ద్రోహానికి ఆయన వ్యాఖ్యలు చాలా చిన్నవని చెప్పారు.
( చదవండి : కాంగ్రెస్ ఓ దొంగల ముఠా! )
ప్రజల బాగుకోసమే ఏ పార్టీ అయినా పని చేయాలి కానీ, రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొందన్నారు. పొరుగు రాష్ట్రాలతో పంచాయితీ వస్తే అందరూ కలిసి రావాలని చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని... జీవో నం.123పై 29 కేసులు వేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన విషయాల్లో ఏది అబద్ధమో వారు చెప్పాలన్నారు. క్షుద్ర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ పొరపాట్లు చేస్తే సలహాలు ఇవ్వాలని సూచించారు.
ఎమ్మెల్యే డీకే అరుణకు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం బహిరంగంగా దేవుళ్లకు మొక్కులు తీరుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లాగా దొంగ వ్యవహారాలు చేయలేదని..దొంగబాబాలను ప్రొత్సహించలేదన్నారు. నేతల చీకటి కోణాలు ప్రజలకు తెలుసునని చురకలంటించారు. కాంగ్రెస్ ఒక కప్పల తక్కెడ పార్టీ అని విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని... కాంగ్రెస్ నేతలు సన్నాసులు కాకపోతే ప్రాజెక్టులు ఎందుకు అడ్డుకుని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా నేతలు తీరు మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరని హెచ్చరించారు. సన్నాసుల నుంచి బిచ్చగాళ్లగా మారడం ఖాయమని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.