
డిస్కంల మనుగడ కోసమే చార్జీల పెంపు
విద్యుత్ సరఫరా వ్యయంతో పోల్చితే చార్జీలతో వచ్చే ఆదాయం తక్కువగా ఉందని, మూడేళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నష్టాలు ఎదుర్కొంటున్నాయని విద్యుత్ శాఖ
‘సాక్షి’ ఇంటర్వ్యూలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- కరెంట్ ఇవ్వకుండానే గత పాలకులు చార్జీలు పెంచారు
- నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నాం.. ప్రజలు అర్థం చేసుకుంటారు
- బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలపై భారం వేయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయంతో పోల్చితే చార్జీలతో వచ్చే ఆదాయం తక్కువగా ఉందని, మూడేళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో విద్యుత్ పంపి ణీ సంస్థ(డిస్కం)లు నష్టాలు ఎదుర్కొంటున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏటా ఏకంగా రూ.6 వేల కోట్ల లోటు ఎదుర్కొంటున్న అంశాన్ని డిస్కంలు లెక్కలతో సహా నిరూపించాయని.. ఈ పరిస్థితిని అధిగమించి మనుగడ సాగించాలంటే చార్జీలు పెంచకతప్పదని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి నివేదించాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే మన రాష్ట్రంలో చార్జీల పెంపు ప్రక్రియను చేపట్టాయన్నారు. గత పాలకు లు సరిగా విద్యుత్ సరఫరా చేయకున్నా చార్జీలు పెంచేవారని, తాము నిరంతరంగా కరెంటు ఇస్తున్నందున చార్జీలు పెంచినా ప్రజలు అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానిం చారు. అయితే చార్జీల పెంపు నుంచి బడుగు, బలహీనవర్గాలు, పేదలకు వెసులుబాటు ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ రెండేళ్ల పాల నలో విద్యుత్ రంగం పురోగతిపై జగదీశ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..
‘చీకటి’ కుట్రలను ఛేదించి...
‘‘తెలంగాణ ఉద్యమం ఆద్యంతం విద్యుత్ చుట్టూ తిరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యుత్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలు జరిగాయి. కానీ ఆ కుట్రలన్నింటినీ ఛేదించి నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయకపోయినా.. దీన్ని ఎలా సాధించగలిగారని చాలా మంది అడుగుతుంటారు. క్షేత్రస్థాయిలోని హెల్పర్లు, లైన్‌మెన్ల నుంచి సీఎండీల వరకు అందరూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు నిబద్ధతతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించాం. జెన్‌కో ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని (పీఎల్‌ఎఫ్) పెంచాం. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గత ప్రభుత్వాలూ నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగేవని నిరూపించాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గడంతో... ఆ విద్యుత్‌ను గృహాలు, పరిశ్రమలకు మళ్లించి నిరంతర విద్యుత్ ఇస్తున్నామంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవం. 2014-15తో పోల్చితే 2015-16లో 13శాతం విద్యుత్ వినియోగం పెరగడమే ఇందుకు నిదర్శనం. గత ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను ప్రారంభించడంతో అదనంగా 500 మెగావాట్ల వినియోగం పెరిగింది.
అనుకున్న సమయానికే ప్రాజెక్టులు...
రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2018-19 నాటికి 25,000 మెగావాట్లకు పెంచేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేనివారు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేశారు. 2017 మార్చిలోపు భద్రాద్రిని పూర్తి చేయాలని కేంద్రం నిబంధనలు పెట్టినా.. కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఇలాంటి అడ్డంకులను అధిగమించి అనుకున్న సమయానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. రూ.2,500 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని 9,000 మెగావాట్ల నుంచి 12,000 మెగావాట్లకు పెంచాం. ఇదే తరహాలో ప్రాజెక్టు నిర్మాణంలో సైతం పురోగమిస్తాం.
తొందర్లోనే ఉత్తమ శాఖగా..
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఓ వైపు ప్రభుత్వం తాపత్రయ పడుతుంటే... మరోవైపు క్షేత్ర స్థాయిలో కొందరు సిబ్బంది అవినీతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవమే. దీన్ని సీరియస్‌గా తీసుకున్నాం. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దీంతో కొంత వరకు మార్పు వచ్చింది. ఒక్కరోజులోనే పూర్తి నియంత్రణ సాధ్యం కాదు. ప్రజలెవరూ అధికారుల చుట్టూ తిరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలు పొందగలిగితే అవినీతిని నిర్మూలించవచ్చు. ఆ దిశగా చర్యలు ప్రారంభించాం. తొందర్లోనే ప్రజలు ఉత్తమ శాఖగా విద్యుత్ శాఖను
గుర్తిస్తారు.
రైతులు సహకరించాలి
వచ్చే ఖరీఫ్‌లో రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం. అయితే వృథా చేయకుండా అవసరమైన మేరకే వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. ఆటోమేటిక్ స్టార్టర్ల వినియోగాన్ని మానుకోవాలి. కరెంటు వచ్చినప్పుడే పొలానికి వెళ్లి మోటార్‌ను వేసి అవసరం తీరిన వెంటనే నిలిపేయాలి. అలా చేస్తే విద్యుత్‌తో పాటు భూగర్భ జలాలు కూడా ఆదా అవుతాయి. మోటార్లూ కాలిపోకుండా ఉంటాయి.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
భారీ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన 12,000 మెగావాట్ల విద్యుత్‌కి సంబంధించిన చార్జీలను ఎవరి నుంచి వసూలు చేయాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేరుగా రైతులపై వేస్తారా, క్రాస్ సబ్సిడీ రూపంలో విద్యుత్ వినియోగదారులపై వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా అన్న అంశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఏడాదిలో కేవలం 3 నెలల పాటే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం. స్వల్పకాలిక లేక దీర్ఘకాలిక ఒప్పందాలకు వెళితే తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందా? లేక మూడు నెలల పాటు ఓపెన్ యాక్సెస్‌లో కొనుగోలు చేస్తే సరిపోతుందా? అన్న అంశాలపై అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకుంటాం.’’