సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానిది రెండో స్థానం
ఇకపై సబ్ స్టేషన్ల వారీగా టెండర్లు: జగదీశ్‌రెడ్డి
- వరంగల్‌ను ఐటీ, ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం: కడియం
- 2018 ఆగస్టు వరకు కొత్త పంచాయతీలు అసాధ్యం: జూపల్లి
- ఇతర కార్పొరేషన్లకు డ్రైవర్ కం ఓనర్ పథకం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఆరు నెలల్లో మొదటి స్థానానికి చేరుకుంటామని విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు వంశీచందర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధా నమిస్తూ.. ఇప్పటికే రాష్ట్రంలో సోలార్ ద్వారా 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోం దని, మరో 2,000 మెగావాట్ల ఉత్పత్తికి సబ్ స్టేషన్ల వారీగా టెండర్లు పిలిచామన్నారు. వ్యవ సాయపరంగా రైతాంగానికి సోలార్ విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చెలక, మైలవరం గ్రామాల్లో ప్రయో గాత్మకంగా 90 పంపుసెట్లను వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడించారు. సాగునీటి లిఫ్ట్‌లకు అవసరమయ్యే 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపా మని, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థల్లో సోలార్ విద్యుద్దీకరణ కోసం చర్యలు చేపట్టామన్నారు.
ఐటీ హబ్‌గా వరంగల్: కడియం
రాష్ట్రంలో రెండో పెద్ద పట్టణమైన వరంగల్‌ను ఎడ్యుకేషనల్, ఐటీ హబ్‌గా మారుస్తామని డి ప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పే ఏ విద్యా సం స్థలను వరంగల్‌లోనే ఏర్పాటు చేస్తామ న్నారు. సభ్యులు వినయ్‌భాస్కర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాకతీ య వర్సిటీ భూములను ఎవరు ఆక్రమించు కున్నా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
8 నెలల్లో మనోహరాబాద్–కొత్తపల్లి భూసేకరణ: మహేందర్‌రెడ్డి
మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గానికి 8 నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ మార్గం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.60 కోట్లు విడుదల చేశాయన్నారు. ఈ అంశంపై సభ్యుడు గంగుల కమలాకర్ మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్, కేటీఆర్ నియోజకవర్గాల గుండా పోతున్న ఈ మార్గానికి ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు.
కార్పొరేషన్లకు డ్రైవర్ కం ఓనర్ పథకం: కేటీఆర్
నగరంలో విజయవంతమైన డ్రైవర్ కం ఓనర్ పథకాన్ని త్వరలో ఇతర కార్పొరేషన్లకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలో 408 మందిని ఈ పథకం పరిధిలోకి తేగా అందులో 95 శాతం మంది బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు.
2018 ఆగస్టు వరకు కొత్త పంచాయతీలు కుదరవు: జూపల్లి
రాష్ట్రంలో 2018 ఆగస్టు వరకు కొత్త పంచా యతీల ఏర్పాటు కుదరదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 631 ఎస్టీ పంచాయతీలుండగా, కొత్తగా 1,757 పంచాయతీల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. ప్రస్తుత పంచాయతీల కాలం ముగిసే నాటికి కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియకు అంతా సిద్ధం చేస్తామన్నారు.
నిధులేవీ: ఆర్.కృష్ణయ్య
గడిచిన రెండేళ్లలో బీసీ సమాఖ్యలకు రూ.220 కోట్లు కేటాయించినా రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగతా నిధులను ఎప్పుడు ఖర్చు చేస్తారని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. దీనీపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ, వచ్చే జనవరికి పూర్తి నిధులు విడుదల చేస్తామన్నారు.