ఎన్టీఆర్ మెమోరియల్‌ను ముట్టుకోం
♦ ఆ పక్కనున్న చోట 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం
♦ ఏడాదిపాటు అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల నిర్వహణ
♦ డిప్యూటీ సీఎం కడియం, మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
♦ కడియం చైర్మన్‌గా విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం పక్కనే 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారక కేంద్రాన్ని ముట్టుకోకుండా ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉన్న పార్టీ జోన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎస్సీశాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా, డెరైక్టర్ ఎం.వి.రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనంటే గౌరవముందన్నారు.
ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ గార్డెన్స్, పక్కనున్న ప్రాంతం మొత్తం కలుపుకుని 39 ఎకరాలుంటే ఎన్టీఆర్ స్మారకం 4 ఎకరాలను మినహాయించి మిగతా 35 ఎకరాల పరిధిలో అంబేడ్కర్ స్క్వేర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తై అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 14న అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించే ఉత్సవాలను, హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఏడాది పొడవునా నిర్వహిస్తామన్నారు.
14న సీఎం శంకుస్థాపన
ఈ నెల 14న ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంత్యుత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కడియం తెలిపారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో శిథిలావ స్థలో ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్స్‌కు సీఎం అదే రోజు భూమిపూజ చేస్తారని, బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రానికి, ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న పార్టీ జోన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం ఐమాక్స్ థియేటర్ పక్కనే ఉన్న కార్ల పార్కింగ్ ప్రదేశంలో అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14కల్లా అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటును పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాం గం లేకపోతే ఆర్టికల్(3)లో ఆయా అంశాలను పొందుపరచకపోయి ఉంటే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఉండేది కాదన్నారు. దూరదృష్టితో అంబేడ్కర్ పొందుపరచిన ఆర్టికల్ (3) ప్రకారమే కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఉద్యమించి విజయం సాధించిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌ను వర్గానికో, కులానికో, ఏ కొందరికో పరిమితం చేయరాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజ లను ప్రభావితం చేసిన మహనీయుడిగా ఆయన్ను స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకయ్యే వ్యయంపై అంచనా వేయలేదని, ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు...
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైర్మన్‌గా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మరో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అజ్మీరా చందూలాల్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, ఎంపీలు బాల్క సుమన్, పసునూరు దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపకుడు మల్లేపల్లి లక్ష్మ య్య, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్, ఎస్సీ డీడీ డెరైక్టర్ ఉండనున్నారు. ఎస్సీశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఎస్సీశాఖ కార్యదర్శి బి.ఎం.డి. ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.