విద్యుత్ సబ్సిడీ రూ. 7,150 కోట్లకు పెంచండి
⇒ మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరిన విద్యుత్ సంస్థలు
⇒ సాగుకు 9 గంటల విద్యుత్‌తో ఆర్థిక భారం పెరిగినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీలను రూ. 7,150.13 కోట్లకు పెంచాలని (గతేడాది బడ్జెట్‌లో రూ. 4,476.86 కోట్లు) విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కోరాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని వివరించాయి. అందువల్ల డిస్కంలపై ఆర్థిక భారం పెరిగిందని, విద్యుత్ సబ్సిడీలు రూ. 7,150.13 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులపై శనివారం సచివాలయంలో జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో డిస్కంలు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు సమావేశంలో పాల్గొన్నారు.
జెన్‌కోలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టండి...
జెన్‌కో చేపట్టిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి మూలధనంగా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఆ సంస్థ సీఎండీ ప్రభాకర్‌రావు కోరారు. అలాగే రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ. 245.72 కోట్ల సబ్సిడీ నిధులు కేటాయించాలని తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) కోరింది. విద్యుత్ సబ్సిడీల పెంపు, జెన్‌కో థర్మల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సబ్సిడీలు, ఇతరత్రా అవసరాల కోసం బడ్జెట్‌లో ఇంధన శాఖకు మొత్తం కేటాయింపులను రూ. 13,840.25 కోట్లకు పెంచాలని మంత్రికి ప్రతిపాదనలు సమర్పించారు.