
నేడు అమరావతికి సీఎం కేసీఆర్
దసరా పర్వదినం సందర్భంగా గురువారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొననున్నారు
సీఎం వెంట వెళ్లనున్న ముగ్గురు మంత్రులు
సాక్షి, హైదరాబాద్/ సూర్యాపేట: దసరా పర్వదినం సందర్భంగా గురువారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొననున్నారు. తనతో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలను కూడా ఈ కార్యక్రమానికి తీసుకుని వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రమే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో ఆయన బుధవారం రాత్రి బస చేశారు.
గురువారం ఉదయం 10.15 గంటలకు సూర్యాపేట ఎస్‌వీ కళాశాల మైదానం నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా అమరావతికి బయలుదేరతారు. ఉదయం 11.45 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలోని గొల్లబజార్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చేరుకుంటారు.
ఎర్రవల్లిలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గంలో నర్సన్నపేట గ్రామానికి చేరుకుని అక్కడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేస్తారు. తిరిగి రాత్రి 7.10 గంటలకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.