‘విద్యుత్’లో అవినీతి తగ్గింది: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌శాఖలో గతంలో కంటే అవినీతి తగ్గిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. గతంలో అదేపనిగా విద్యుత్ సిబ్బంది అవినీతికి పాల్పడేవారని, వారిని విద్యుత్ సరఫరా విధులకు దారి మళ్లించామన్నారు. అవినీతిని నిర్మూలించేందుకే వ్యవసా య విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియను వచ్చే మేలోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ గడువు నిర్దేశించారని వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించిన జగదీశ్‌రెడ్డి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ జారీ కోసం క్షేత్ర స్థాయిలో రూ. 25 వేలు లంచం అడుగుతున్నారని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన పైవిధంగా స్పందించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఎవరైనా వేధిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీ తర్వాత కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
రికార్డు స్థాయిలో పెరిగిన విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6న రికార్డు స్థాయిలో 8,320 మెగావాట్ల డిమాండ్ నమోదైందన్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట డిమాండ్ 9,500 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా, ఒక్క ఎకరం పంట ఎండినా బాధ్యులైన విద్యుత్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లలను 24 గంటల్లో ప్రభుత్వ ఖర్చుతో మార్చాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.