విద్యుత్‌శాఖకు సంబంధించి
పెట్టుబడులపై చర్చించే అవకాశం
డాంగ్‌ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్
సందర్శించనున్న సీఎం బృందం
జిల్లాలో విద్యుత్ రంగంలో
పెట్టుబడులకు చైనాను
ఆహ్వానించనున్న మంత్రి
చైనా దేశంలో మంత్రి పర్యటన వివరాలు
సోమవారం ఉదయం సీఎంతో కలిసి చైనా వెళ్తారు. అక్కడ డల్లాన్ నగరానికి చేరుకుంటారు.
అక్కడినుంచి 10న షాంగైకి వెళతారు.
11వ తేదీన చైనా రాజధాని బీజింగ్‌లో పర్యటిస్తారు.
12న బీజింగ్ నుంచి షెన్‌జెన్‌కు
13న షెన్‌జెన్ నుంచి హాంగ్‌కాంగ్‌కు
16న హాంకాంగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు వెళ్లారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను చైనా దేశంలో ప్రచారం చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సీఎం నేతృత్వంలో ఆ దేశానికి వెళ్లిన రాష్ట్ర బృందంలో జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ఈనెల ఏడో తేదీ నుంచి 16వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఆయన చైనా దేశంలో పర్యటిస్తారు. చైనా పర్యటన కోసం ముఖ్యమంత్రి తయారుచేసిన అధికార, రాజకీయ బృందంలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో పరిశ్రమల మంత్రి జూపల్లితో పాటు జగదీశ్‌రెడ్డి ఉండడం, అదీ విద్యుత్ శాఖ మంత్రి హోదాలో వెళుతుండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో చైనా కంపెనీల పెట్టుబడుల కోసం వెళుతున్న రాష్ట్ర బృందంలో సభ్యుడిగా ఉన్న మంత్రి జగదీశ్ జిల్లాలో కూడా ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే యాదాద్రి పవర్....
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న పవర్‌ప్లాంట్లు, ఇతర విద్యుత్ సంబంధ పరిశ్రమలపై చైనా పారిశ్రామిక దిగ్గజాలు, విద్యుత్ కంపెనీలతో చర్చించేందుకు గాను మంత్రి జగదీశ్‌రెడ్డి చైనా వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చైనా పెట్టుబడులతో పాటు ప్రత్యేకించి జిల్లాలో విద్యుత్ రంగ పెట్టుబడుల గురించి ఆయన అక్కడి కంపెనీలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఖరారైన యాదాద్రి విద్యుత్ ప్లాంట్... లేదంటే రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామిక హబ్‌లో పెట్టుబడుల గురించి మంత్రి చైనా కంపెనీలతో మాట్లాడనున్నట్టు సమాచారం. అయితే, విద్యుత్‌రంగానికి సంబంధించి చైనాలోని డాంగ్‌ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ప్రతినిధి బృందం ఇటీవలే మన రాష్ట్రాన్ని సంప్రదించింది. ఆ కార్పొరేషన్‌తో రాష్ట్రంలో విద్యుత్ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ పర్యటనలో ఆ దేశ పారిశ్రామిక దిగ్గజాలతో జరిగే చర్చల్లో పాల్గొంటారు. పలు పారిశ్రామికవాడలను సందర్శించనున్నారు. షెంగ్‌వాన్ నగరంలో పారిశ్రామిక వేత్తల భేటీలో మంత్రి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
చైనా టూర్‌కు జగదీశ్‌రెడ్డి
Published Sun, Sep 6 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement