మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోని మైకును లాక్కుంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకుంది. చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి పోటీగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు.
అయితే వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. 2014కు ముందు సిగ్గులేని పాలన చేశారని, అప్పటి చీకటి ఇంకా ఉంటే బాగుండని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను టీఆర్‌ఎస్ గురించి మాట్లాడలేదని, మంత్రి కాంగ్రెస్ ప్రస్తావన తేవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తాను ప్రసంగిస్తున్న సమయంలో తన చేతిలోని మైకు లాక్కోవడం ఏంటని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చిల్లర చేష్టలని, మీడియాలో ప్రచారం కోసం ఆడుతున్న నాటకాలంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎమ్మెల్యేకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు.
రాత్రి ఓ మాట, పొద్దున మరో మాట మాట్లాడే అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి అన్నారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషంలో లోపల వేయిస్తామని, ఇకపై మునుగోడులో ప్రతి ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తానే స్వయంగా హాజరవుతానని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై లక్కారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రాజగోపాల్‌రెడ్డి రాస్తారోకో చేశారు.
Comments
Please login to add a commentAdd a comment