రైలు సౌకర్యం కల్పించాలి..
సూర్యాపేటపై కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకి మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ : నల్లగొండ జిల్లా సూర్యాపేటకు రైలు సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి విన్నవించారు. బుధవారం ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రుతో కలసి రైల్వేమంత్రితో భేటీ అయ్యారు. సూర్యాపేటను కలుపుతూ మూడు రైల్వే లైన్లను ప్రతిపాదిస్తూ ఒక నివేదికను కేంద్రమంత్రికి అందజేశారు. భవిష్యత్‌లో సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారనుందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతోపాటు ఆ ప్రాంతంలో పలు సిమెంటు పరిశ్రమలున్నాయని, భవిష్యత్తులో ఓ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాబోతున్నందున సిమెంటు, బొగ్గు తరలించేందుకు భారీ డిమాండ్ ఉంటుందన్నా రు.
బోనకల్ నుంచి చిట్యాల(వయా సూర్యాపేట), ఖమ్మం నుంచి నల్లగొండ(వయా సూర్యాపేట), ఖమ్మం నుంచి మిర్యాలగూడ (వయా సూర్యాపేట) రైల్వే లైన్లను జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి వీలుగా సర్వేలు చేపట్టాలన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుగా జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేందు కు కేంద్ర మంత్రిమండలి సమ్మతించిందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ఈ సర్వే పనులు ప్రారంభించవచ్చని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
హైవే ప్రమాదాలపై గడ్కారీతో చర్చ
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీ య రహదారిపై నార్కట్‌పల్లి వద్ద కామినేని ఆసుపత్రి కూడలి, దురాజపల్లి గ్రామం, జనగామ-సూర్యాపేట కూడలి, సూర్యాపేట పట్టణం ప్రధాన కూడలి, మునగాల మండలం ముకుందాపురం వద్ద వీయూపీలు ఏర్పాటు చేయాలని కోరారు.
త్వరలో నూతన పవన విద్యుత్...
తెలంగాణ రాష్ట్రం 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ పవన విద్యుత్ సంస్థ(ఎన్‌ఐడబ్ల్యూఈ) అధ్యయనంలో తేలిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. 2017-18లోగా 361 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభించనున్నామన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘పునరుత్పాదక విద్యుత్’ అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామన్నారు.