
గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ కొనసాగింపు
సుమారు 10.33 కోట్ల గృహ వినియోగదారులకు లబ్ధి
ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రూ.30 వేల కోట్ల సాయం
ప్రధాని మోదీ సారథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షాబంధన్ వేడుకల వేళ దేశ మహిళలకు కేంద్రం శుభవార్త తెలిపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు చేయూత నిచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో రూ.12,060 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉజ్వల యోజన లబ్ధిదారులుగా ఉన్న 10.33 కోట్ల గృహ వినియోగదారులకు మేలు చేకూర్చనుంది.
ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 9 రీఫిల్‌ల వరకు 14.2 కిలోల సిలిండర్‌కు రూ.300 వరకు రాయితీ ఇస్తుంది. ఉజ్వల వినియోగదారుల సగటు తలసరి వినియోగం 2019–20లో కేవలం 3 రీఫిల్స్, 2022–23లో 3.68 రీఫిల్స్‌గా ఉండగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి 4.47కి చేరింది. 2016లో ప్రారంభమైన ఈ పథకం కింద 2024–25 వరకు రూ.52 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిందన్నారు. ఎల్‌పీజీ ధరల స్థిరీకరణకుగాను చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.30వేల కోట్ల ప్రధాన సబ్సిడీ ప్యాకేజీని కూడా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా దేశీయ ఎల్‌పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు.
మన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం వరకు దిగుమతులే తీరుస్తున్నాయన్నారు. దీంతోపాటు, 175 ఇంజనీరింగ్ సంస్థలు, 100 పాలిటెక్నిక్‌లతో కూడిన 275 సాంకేతిక సంస్థల్లో ’మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్’(ఎంఈఆర్‌ఐటీఈ) పథకాన్ని అమలు చేసే ప్రతిపాదనపై సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం, పాలనను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం.
2025–26 నుంచి 2029–30 వరకు మొత్తం రూ.4,200 కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనుండగా, ఇందులో ప్రపంచ బ్యాంకు రుణం రూ.2100 కోట్లని కేంద్ర మంత్రి తెలిపారు. వీటితో పాటే అస్సాం, త్రిపురల్లో అమల్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీల పథకం (ఎస్‌డీపీ) కింద రూ.4,250 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ వివరించారు.వీటితోపాటు కేంద్ర కేబినెట్ తమిళనాడులోని మరక్కణమ్– పుదుచ్చేరిని కలిపే నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2,157 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.