తెలంగాణ ఉద్యమ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
ఉద్యమ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతాం
నల్లగొండ
తెలంగాణ ఉద్యమ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. 60 ఏళ్ల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈ ఐదేళ్లలో భర్తీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...జిల్లాలోని ప్రధాన ప్రతిపక్ష నాయకులైన జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యేతో సహా అందరి సహకారంతో ఈ ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ముఖ్యంగా దామరచర్ల పవర్ ప్లాంట్ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతగానో సహరించారని అన్నారు. ఇదే పద్ధతిలో వచ్చే నాలుగేళ్లలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీ గుత్తా మాట్లాడుతూ.. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. తమ పార్టీకి ఎదురొడ్డి పార్లమెంట్‌లో రాష్ట్రం కోసం తమ వంత పోరాటం చేశామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రతి ఒక్క రు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల రూపాయాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడు తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోషించిన పాత్ర చిరకాలం గుర్తుం డిపోతుందన్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు మాత్రం సోనియా గాంధీ వల్లనే సాధ్యమైంద న్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సత్యనారయణ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, చినవెంకటరెడ్డి పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరింపజేశాయి. ముఖ్యంగా అలరులుకురియగ ఆడెనదే అనే అన్నమాచార్య కీర్తనకు లలిత సుమాంజలి కూచిపూడి నృత్యం, వెంకటరమణారెడ్డి అన్నమాచార్య కీర్తనల ఈల పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంకా బాలు బృందం చేసిన జయజయహే తెలంగాణ, కిట్టు బృందం ఉస్మానియా క్యాంపస్‌లో ఉదాయించిన కిరణమా, ఎంవీఆర్ పాఠశాల విద్యార్థిని బి.అశ్రీత చేసిన భారతవేదముగా నిరత నాట్యముగా అనే నృత్య రూపకం, జాగృతి పోలీసు బృందం అమరవీరులను తలుస్తూ పాడిన పాట, పరమేష్ బృందం పల్లె సుద్దులు, జెవివి మ్యాజిక్ షో, నాగదుర్గ శాస్త్రీయ కూచిపూడి నృత్యం, జిసహదేవ మిమిక్రి, గోపికమ్మ చాలును లే అమ్మ పాటకు కిట్టు బృంద నృత్యం అలరించాయి.