
కారెక్కిన జానా అనుచరులు
మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి...
పోచారం సమక్షంలో వర్ని మండల ఎంపీటీసీల చేరిక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి అనుచరులు టీఆర్‌ఎస్‌లోకి వలస బాట పట్టారు. సుదీర్ఘ కాలంగా ఆయనతో కలసి పనిచేసిన ముఖ్య నేతలు ముగ్గురు శుక్రవారం నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, మరో నాయకుడు ఎం.సి కోటిరెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ధన మల్లయ్యలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండలో కాంగ్రెస్ ధన బలంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని, కానీ, నల్లగొండలో ఎప్పుడో టీఆర్‌ఎస్ అభ్యర్ధి విజయం ఖాయమై పోయిందన్నారు. ఈ ముగ్గురు నాయకులతో పాటు పధ్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు కూడా ఆ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పోచారం సత్యనారాయణపురం, లక్ష్మాపూర్ ఎంపీటీసీ సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.