ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ దీక్ష
Published Wed, Nov 30 2016 1:23 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
నల్లగొండ : సీఎం కేసీఆర్ తలపెట్టిన దీక్ష మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిందన్నారు. ఉద్యమానంతరం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక మంది అపహాస్యం చేశారని ఇప్పుడు వారందరు ముక్కున వేలేసుకునేలా ఉత్తమ పరిపాలనదక్షుడిగా ప్రశంసలు అందుకుంటున్నారని మంత్రి తెలిపారు. అభివృద్ధి పథంలో దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు.
విద్యార్థులు పోటీ పడే విధంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చి దిద్దే క్రమంలో కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలన్న సంకల్పంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకోసం గురుకులాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలికల కోరిక మేరకు కాలేజీలో మరుగుదొడ్లను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమయ్యే స్థలాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్‌స క్లబ్ చైర్మన్ గోలి అమ రేందర్ రెడ్డి, వేణు సంకోజు, జల్లా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement