సాక్షి ప్రతినిధి, : నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్ ఆకర్ష్ పథకం మరోసారి తెరపైకివచ్చింది. చాలా రోజులుగా అదిగో.. ఇదిగో అని ఊరిస్తున్న నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శనివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, తన భర్త శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
అనంతరం సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. కాంగ్రెస్‌లో ముఖ్య నేత అయిన కోమటిరెడ్డిఅనుచరుడు టీఆర్‌ఎస్‌లో చేరడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదీ కోమటిరెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు ఈ పరిణామం జరగడం మరింత ఆసక్తిని కలిగిస్తూ.. పలు రకాల చర్చలకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా... మరో ముగ్గురు మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్లు (కాంగ్రెస్) కూడా త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం.. మరికొందరు నల్లగొండ కౌన్సిలర్లు కూడా అదే బాటలో పయనిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
ఎప్పటినుంచో...
నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు జరిగిన సందర్భంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒక దశలో నేడో, రేపో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ చేరికకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అనూహ్యంగా, ఎవరూ ఊహించని సమయంలో ఆమె టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.
ఈమె చేరికపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డిని నియోజకవర్గంలో ఒంటరిని చేయాలన్న ఆలోచనతో టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. కానీ.. నల్లగొండకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రం మాజీ మంత్రి కోమటిరెడ్డికి బాసటగా నిలుస్తున్నారు.
శనివారం సాయంత్రం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము ఎమ్మెల్యే కోమటిరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తామని కరాఖండిగా చెప్పేశారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్న అంశాన్ని నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త శ్రీనివాస్ ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న కౌన్సిలర్లు వ్యతిరేకించారని.. ఆ పరిస్థితుల్లోనే కౌన్సిలర్లు ఎవరూ లేకుండానే చైర్‌పర్సన్ ఒక్కరే వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చర్చ జరుగుతోంది.
‘మిర్యాల’ మినహా..
తాజా పరిణామాలతో జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపాలిటీ మినహా అన్ని చోట్లా చైర్‌పర్సన్లు, చైర్మన్లు టీఆర్‌ఎస్‌లో చేరినట్లే. తొలుత సూర్యాపేట, ఆ తర్వాత దేవరకొండ, భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, ఇప్పుడు నల్లగొండ చైర్‌పర్సన్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. సూర్యాపేటలో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన ప్రవళ్లిక టీఆర్‌ఎస్‌లో చేరి చైర్‌పర్సన్ అయ్యారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి మాత్రమే కాంగ్రెస్‌లో మిగిలినట్టయింది. ఈమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని, భర్త భార్గవతో కలిసి ఆమె అధికార పార్టీ కండువా కప్పుకోనున్నారనే ప్రచా రం జరిగింది. కానీ.. భార్గవ ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ఖం డిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే చైర్మన్‌ను వ్యతిరేకిస్తూ ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరేం దుకు సిద్ధమవుతుండడంతో మిర్యాలగూడ రాజకీ యం ఏ మలుపు తిరుగుతుందోననేది ఆసక్తికరంగా మారింది.
కీలక పరిణామాలు
నల్లగొండ కేంద్రంగా జిల్లాలో త్వరలోనే కీలక రాజకీయ పరిణామాలు జరుగుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కోమటిరెడ్డికి అండగా ఉన్న మరికొందరు కౌన్సిలర్లకు కూడా గాలం వేశామని, వారు కూడా త్వరలోనే (ఈనెల 17లోపు) టీఆర్‌ఎస్‌లోకి వస్తారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఆ కౌన్సిలర్లు తమతో టచ్‌లోకి వచ్చారని, త్వరలోనే ముహూర్తం ఖరారు చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి చేత నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తాను మరోమారు చాటేందుకు టీఆర్‌ఎస్ వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నల్లగొండ కేంద్రంగా రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.