త్వరలోనే టీఆర్‌ఎస్‌లోకి డీసీసీబీ చైర్మన్!
హైదరాబాద్‌లో కేసీఆర్‌తో మంతనాలు
జిల్లాపై పూర్తిస్థాయి ఆధిపత్యం కోసం చక్రం తిప్పుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
ఖమ్మం జిల్లా నేతల
మధ్యవర్తిత్వం కూడా
కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాక తేదీ ఖరారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తవరపు పాండురంగారావు త్వరలోనే అధికార టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలోగ్రీన్‌సిగ్నల్ లభించిందని, వారం రోజుల్లో ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి చక్రం తిప్పడంతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన నేతల మధ్యవర్తిత్వం నెరపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం సాధించేందుకు గాను స్వయంగా మంత్రి జగదీష్‌రెడ్డి ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తున్నారని సమాచారం. అయితే, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముత్తవరపు .. పార్టీలో ఎప్పుడు చేరతారనేది తేలనుంది.
సీఎం ఓకే
డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావును పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ కేంద్ర సహకార బ్యాంకు (టీక్యాబ్) చైర్మన్‌గా వరంగల్ జిల్లాకు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి (ఆదిలాబాద్)లు ఎన్నికైన సందర్భంగా రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా ముత్తవరపు పార్టీలో చేరిక వ్యవహారంపై చర్చలు జరిగాయి. పాండురంగారావుకు మిత్రుడైన ఖమ్మం జిల్లాకు చెందిన ఓనాయకుడు ఈ విషయంలో కొంత చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సహకార బ్యాంకులు రైతులకిచ్చే దీర్ఘకాలిక రుణాలపై రిబేటు అంశాన్ని ముత్తవరపు సీఎం దృష్టికి తీసుకెళ్లారని, ఇందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముత్తవరపును పార్టీలో చేర్చుకునేందుకు కూడా సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కేటీఆర్, జగదీష్‌లతో త్వరలోనే భేటీ
అయితే, ఇటీవలే ముత్తవరపు పాండురంగారావుకు వ్యతిరేకంగా ఉన్న ఏడెనిమిది మంది డీసీసీబీ డెరైక్టర్లు టీఆర్‌ఎస్‌లో చేరాలని భావించినప్పటికీ ఆ కార్యక్రమం పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో ముత్తవరపుతో పాటు ఆయన అనుచరులు, ఆయన వ్యతిరేకులందరినీ కలిపి పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహం రచించింది. ఈ మేరకు ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి తిరిగివచ్చాక జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి డీసీసీబీ చైర్మన్, డెరైక్టర్లు సమావేశం కానున్నట్టు సమాచారం.
ఈ సమావేశం అనంతరం చైర్మన్‌తో పాటు డెరైక్టర్లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరే తేదీ ఖరారు కానుందని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి. మొత్తం మీద వారం రోజుల్లోనే ఈ తతంగం అంతా పూర్తి చేసుకుని డీసీసీబీ కార్యాలయంలపై గులాబీ జెండా ఎగురవేసే కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకత్వం నిమగ్నమైంది. ఈవిషయమై పాండురంగారావు సాక్షితో మాట్లాడుతూ.. డీసీసీబీలో చైర్మన్లకు సీఎం ఇచ్చిన విందు కార్యక్రమానికి వెళ్లానని, జిల్లా బ్యాంకు అభివృద్ధికోసమే మాట్లాడానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని చెప్పడం గమనార్హం
గులాబీ గూటికి ముత్తవరపు?
Published Sun, May 24 2015 12:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement