సాక్షి, నల్గొండ : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆరెస్, కాంగ్రెస్,బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాయి. ఇక ఇన్నాళ్లూ చేసిన ప్రచారానికి ఓటర్లు తమ మద్దతును, అభిప్రాయాలను ఓటు రూపంలో రేపు పోలింగ్‌లో ఇవ్వనున్నారు. అయితే పోలింగ్ సమయం ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నమోదైన సుమారు 80 శాతంకి పైగా ఈసారి పోలింగ్ శాతం నమోదు చేపించేలా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
ఈ ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. కరోనా నేపథ్యంలో రేపు 17న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు సమయాన్ని కేటాయించారు. పోలింగ్‌కు సంబంధించి మొత్తం 5వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి 8151మంది నమోదు చేసుకోగా 1153 మంది తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 108 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 15 మంది పోలీస్ సిబ్బందికి తగ్గకుండా బందోబస్తు నిర్వహించనున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల వద్ద 4వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అందులో 1000 మంది సాయుధ దళాల పోలీసులున్నారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 1000మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. రాత్రి7గంటల వరకు ఓటు వేసేందుకు సమయం ఉండగా చివరి గంట కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కేటాయించారు. 7లోపు లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేంత వరకు అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇప్పటికే రూ. 90లక్షలకు పైగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు..పోలింగ్ అనంతరం నల్గొండ అర్జాలబావి స్ట్రాంగ్ రూంలో సామగ్రి భద్రపరచనున్నారు. సాగర్ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి హిల్ కాలనీలో, టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ ఇబ్రహీంపేట, బీజేపీ అభ్యర్థి త్రిపురారం మండలంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment