జానాకి పోటీ.. రంగంలోకి యువనేత | TRS Youth Leader Ranjith Yadav Expect Ticket For Sagar Bypoll | Sakshi
Sakshi News home page

జానాకి పోటీ.. రంగంలోకి యువనేత

Published Thu, Dec 24 2020 3:40 PM | Last Updated on Thu, Dec 24 2020 3:55 PM

TRS Youth Leader Ranjith Yadav Expect Ticket For Sagar Bypoll - Sakshi

సాక్షి, నల్గొండ : ఇటీవల జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా టీఆర్‌ఎస్‌ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌ బలమైన స్థానిక నేతను అన్వేషించే పని పడినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. 

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్‌ఎస్‌ తర్జన భర్జన పడుతున్నట్లు  తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది. 

జానా రెడ్డికి గట్టి పోటీ!
ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్‌ఎస్‌ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి టికెట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్‌ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇ‍ప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా సీనియర్‌ నేతైన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానికంగా బలమైన యాదవ సామాజిక వర్గంనికి చెందిన నేత కావడంతో.. సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద  ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్‌ యాదవ్‌కు కలిసొచ్చే పరిణామం. మరోవైపు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement