సూర్యాపేట మున్సిపాలిటీకి రానున్న మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.
మంత్రి గుంటకండ్ల
సాక్షి, హైదరాబాద్/సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీకి రానున్న మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం హైదరాబాద్‌లో మున్సిపాలిటీ అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు 40 ఏళ్లుగా కలుషితమైన నీటితో అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. మూసీనది మురికి నీళ్లు కావడంతో ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం లేకపోయేదన్నారు. స్వరాష్ట్రంలో ప్రజలకు ఆ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కృష్ణానది నీటిని తరలిస్తామన్నారు. ప్రస్తుతం నాలుగైదు రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోందని, వీలైనంత త్వరలో రెండు రోజులకు ఒకసారి అందజేస్తామన్నారు. రానున్న మూడునెలల్లో ప్రతీరోజూ మంచినీళ్లు అందేలా ప్రణాళిక తయారుచేశామని మంత్రి వివరించారు.
సమస్యను సత్వరమే పరిష్కరించాలి
సూర్యాపేట పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో సూర్యాపేట పట్టణంలోని నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. దోసపహాడ్ పథకం ద్వారా అనాజిపురం గాండ్ల చెరువును కృష్ణా జలాలతో నింపి రోజు విడిచి రోజు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అనాజిపురం నుంచి కొత్తపైపులైన్‌ను పాత ఫిల్టర్‌బెడ్‌ల వరకు నిర్మాణం చేసేందుకు కావాల్సిన నిధులు, మోటార్ల రీప్లేస్‌మెంట్ కోసం ప్రతిపాదనలు తయారుచేయాలని పబ్లిక్‌హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ ఇంతియాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. నీటి సరఫరా మెరుగునకు తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్లిక మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్, పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ డి.యాదగిరి, ఈఈ ప్రవీణ్‌చంద్ర, టీఆర్‌ఎస్ నేతలు గండూరి ప్రకాష్, మున్సిపల్ ఈఈ విద్యాసాగర్, డీఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.