సచివాలయంలో సమావేశమైన మంత్రులు నాయిని, కేటీఆర్, జగదీశ్, డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపైనున్న మెజారిటీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, పెండింగ్ కేసులను కూడా త్వర లో ఎత్తివేస్తామని మంత్రులు నాయిని, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివా లయంలోని హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగ్ కేసులపై చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసు షీట్లలో వివరాలు సరిగ్గా పేర్కొనకపోవడం వల్ల కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని డీజీపీ మంత్రులకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేశామని డీజీపీ మంత్రులకు తెలిపారు.
రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీకి సూచించారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుంచి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడీకరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి అప్పగించి, సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ తెలిపారు.
టీఆర్‌ఎస్‌కు కేసుల సమాచారం పంపండి
ఈ సమావేశానంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసులు ఎత్తివేస్తూ 1138 జీవో జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. ఇంకా 19 రకాల కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారాన్ని contact@trspartyonline.org వెబ్‌సైట్ లేదా వాట్సాప్ నంబర్ 8143726666 కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని, ఇందుకు nnreddy.hm@ gmail.com, 04023451073ను సంప్రదిం చవచ్చని మంత్రులు తెలిపారు. ఉద్యమసమయంలో పెట్టిన కొన్ని రైల్వే కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. అయితే, కేంద్ర పరిధిలో ఉన్న వాటిని వేరుగా పరిష్కరించాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment