minister naini
-
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపైనున్న మెజారిటీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, పెండింగ్ కేసులను కూడా త్వర లో ఎత్తివేస్తామని మంత్రులు నాయిని, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివా లయంలోని హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగ్ కేసులపై చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసు షీట్లలో వివరాలు సరిగ్గా పేర్కొనకపోవడం వల్ల కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని డీజీపీ మంత్రులకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేశామని డీజీపీ మంత్రులకు తెలిపారు. రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీకి సూచించారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుంచి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడీకరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి అప్పగించి, సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ తెలిపారు. టీఆర్ఎస్కు కేసుల సమాచారం పంపండి ఈ సమావేశానంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసులు ఎత్తివేస్తూ 1138 జీవో జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. ఇంకా 19 రకాల కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారాన్ని contact@trspartyonline.org వెబ్సైట్ లేదా వాట్సాప్ నంబర్ 8143726666 కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని, ఇందుకు nnreddy.hm@ gmail.com, 04023451073ను సంప్రదిం చవచ్చని మంత్రులు తెలిపారు. ఉద్యమసమయంలో పెట్టిన కొన్ని రైల్వే కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. అయితే, కేంద్ర పరిధిలో ఉన్న వాటిని వేరుగా పరిష్కరించాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
పల్లెసీమకు ఇక సర్పంచ్ కింగ్
సిద్దిపేట జోన్: గ్రామ సర్పంచ్‌లు పల్లెసీ మలకు ఇక కింగ్ లాంటి వారని, వచ్చే నెలలో పంచాయతీరాజ్ బిల్లు రానుందని, నిధులు పుష్కలంగా వస్తాయని గ్రామం ఆర్థికంగా బలోపేతంతోపాటు అభివృద్ధి మరింత వేగవంతంగా జరిగేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆదివారం ఢంకా బజాయించి (బ్యాండ్ కొట్టి) అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రులు పాల్గొన్నారు. నాయిని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ బిల్లును తీసుకురానున్నారని, మరో మూడు వారాల్లో ఈ బిల్లు రానుందన్నారు. ఇప్పటికే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మరో 1.12 లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామన్నారు. శాంతి పరిరక్షణలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. అందుకే దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని, ఇప్పటికే 2,500 పరిశ్రమల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. హరీశ్‌రావే మాకు బాహుబలి.. మాకు కూడా బాహుబలి ఉన్నాడని.. యువ నాయకుడు హరీశ్‌రావే మాకు బాహుబలి లాంటి వాడని పరోక్షంగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై నాయిని ఆదివారం చమత్కరిస్తూ మాట్లాడారు. స్థానిక రెడ్డి సంక్షేమ భవన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ భూమి మీద నమ్మకం ఉన్న వారికే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా జైలుకు రూ.65 కోట్లు రానున్నాయని, వాటిని బడ్జెట్లో పెట్టామని, అత్యాధునిక వసతులతో జైలు నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా పారిశుద్ధ్య జిల్లాగా మారడం అభినందనీయ మని, ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. సిద్దిపేట ప్రజలు పట్టుదలకు మారు పేరని, అధికారుల, ప్రజాప్రతినిధుల, ప్రజల సమష్టి కృషికి ఫలితంగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మారడం సంతోషంగా ఉందని, ఇదే స్పూర్తిని ముందుకు కొనసాగించాలని, అందుకు మరో గురుతర లక్ష్యాన్ని ఎంచుకుందామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓడీఎఫ్ జిల్లాగా అధికారిక ప్రకటన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించి దేశంలోనే వంద శాతం వైకుంఠధామాలు గల జిల్లాగా సిద్దిపేటకు రికార్డును సొంతం చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు నేటి నుంచి మరో 75 రోజుల్లోగా లక్ష్యాన్ని ఎంచుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వంద శాతం వైకుంఠధామాలు ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. -
కాళోజీ ఆశయాలు సాధిస్తాం: నాయిని
- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాళోజీ జయంతి - డాక్టర్ సీతారాంకు కాళోజీ సాహితీ పురస్కార ప్రదానం సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలు, ఆలోచనలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు 103వ జయంతి ఉత్సవంలో మంత్రి నాయిని మాట్లా డారు. కాళోజీ అడుగడుగునా అన్యాయాన్ని ఎదిరించారని, ప్రభుత్వాల అవినీతిపై తిరుగు బాటు చేశారని ప్రశంసించారు. కాళోజీతో కలసి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. కాళోజీ మాటలే కవిత్వమని, ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే కవిత్వం చదువుతున్నట్లుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కాళోజీ వాదన, ఆలోచనలు, కవితలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ పేర్కొన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎక్కడ అన్యాయం జరిగినా కాళోజీ నారాయణరావు ఎదిరించేవారని, అన్యాయాన్ని ఎదిరించినవాడే తన ఆరాధ్య దేవుడని కాళోజీ చెప్పుకున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. హక్కులకు భంగం కలిగితే కాళోజీ ప్రశ్నించేవారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన లబ్ధప్రతిష్టుడైన కవి కేవలం కాళోజీ ఒక్కరేనని గుర్తు చేశారు. భద్రాచలానికి చెందిన కవి, డాక్టర్ సీతారాంకు ఈ కార్యక్రమంలో కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, తెలుగువర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
హోంగార్డులను రెచ్చగొడుతున్నారు
శాసనసభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్య ప్రజాప్రతినిధులెవరూ హోంగార్డుల విషయంలో జోక్యం చేసుకోకండి వారి సంక్షేమం విషయంలో సీఎంను ఒప్పించే బాధ్యత తనదేనని వెల్లడి హైదరాబాద్: అంతా అనుకూలంగా జరు గుతున్న తరుణంలో కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొట్టి వారి చేత సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ హోంగార్డుల సంక్షేమంపై అడిగి న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. క్రమ శిక్షణతో ఉండే శాఖలో సమ్మెలు చేయిస్తే ప్రభు త్వాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులెవరూ హోంగార్డుల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని, వారి సంక్షే మం విషయంలో సీఎంను ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. హోంగా ర్డులకు తెలంగాణ వచ్చాకే వేతనాలు పెరిగా యని.. వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా, ట్రాఫిక్ డ్యూటీ చేసే వారికి కానిస్టేబుళ్ల తరహా లోనే 30 శాతం అదనపు భృతి ఇచ్చే ప్రతిపా దనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. హోంగా ర్డుల సర్వీసు స్వచ్ఛంద పరిధిలోనికి వస్తుంది కనుక ఇతర సదుపాయాల కల్పనకు, సెలవు లకు వారు అర్హులు కారని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లో బీబీనగర్ నిమ్స్‌లో ఐపీ సేవలు యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ నిమ్స్ ఆస్ప త్రిలో ఇన్‌పేషెంట్ సేవలను మూడు నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ సభ్యులు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2009 తర్వాత ఈ ఆస్ప త్రిపై పాలకులు నిర్లక్ష్యం వహించారని, అందు కే ప్రజలకు అందుబాటులోకి రావడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు 650 పడకల సామర్థ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి కన్నా అదనంగా 21 శాఖలతో బీబీనగర్ నిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని.. అక్కడే ట్రామా సెంటర్, మెడికల్ కాలేజీ ఏ ర్పాటు ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 100 చేపల మార్కెట్ యార్డులు తెలంగాణవ్యాప్తంగా 4,096 రిజర్వాయర్లు, చెరువుల్లో రూ.24 కోట్ల వ్యయంతో కోట్లాది చేపపిల్లలను పెంచుతున్నామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. టీఆర్ఎస్ సభ్యులు చింతా ప్రభాకర్, పుట్ట మధు, వేముల వీరేశం అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ చేప పిల్లలన్నీ మే, జూన్ నాటికి మత్స్య సంపదగా మారుతా యని, రూ.500 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని తెలిపారు. చేపలను మార్కెట్ చేసుకునేందుకు వీలుగా 100 చేపల మార్కెట్ యార్డులను నిర్మిస్తున్నామని తెలిపారు. వాటికి అనువైన స్థలాలు చూడాలని కలెక్టర్లకు లేఖలు రాశామని.. ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గాల్లో స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభు త్వం సబ్సిడీపై ఇచ్చే చేప విత్తనాలపై హక్కు కేవలం సొసైటీలకే కాకుండా మత్స్యకారులం దరికీ ఉంటుందన్నారు. మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియాను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వాయిదా తీర్మానాలకు నో సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన నాలుగు వాయి దా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలపై కాంగ్రెస్.. సంచార జాతు ల సంక్షేమం, అభివృద్ధిపై బీజేపీ.. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటుపై టీడీపీ.. గ్రామసేవకుల వేతనాలు, పదోన్నతు లపై సీపీఎం సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల అనంతరం వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోచారం స్పెషల్ గెటప్ కిసాన్ దివస్ (రైతు దినోత్సవం) సందర్భంగా శుక్రవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక గెటప్‌తో సభకు వచ్చారు. ఆకుపచ్చని తలపాగా, మెడలో కండువాతో వచ్చిన ఆయనను.. సభలో ఉన్న అన్ని పార్టీల సభ్యులు బల్లలు చరుస్తూ అభినందించారు. స్పీకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా మెచ్చుకున్నారు. పోచారం మాట్లాడుతూ.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి మాట్లాడిన తర్వాత విపక్షాల సభ్యులు కూడా రైతులకు శుభాకాంక్షలు తెలిపే అవకాశమివ్వాలని కోరినా స్పీకర్ అంగీకరించలేదు. త్వరలోనే గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపు జీవో వృత్తిలో భాగంగా చెట్టుపై నుంచి పడి చనిపోయిన గీత కార్మి కులకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్ల డించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమ యంలో టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చా రు. గీత కార్మికులు చెట్లు ఎక్కే విధానాన్ని యాంత్రీకరణ చేయాలన్న ఆలోచనతో.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తు న్నామని తెలిపారు. కల్లుడిపోల్లో గీత సొసైటీలు కల్లు అమ్ముకోకుం డా కొందరు దందాలు చేస్తున్నార ని, మామూళ్లు ఇచ్చి కల్లు అమ్ముకోవాలంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని విపక్ష సభ్యులు పేర్కొనగా... అలా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సమావేశాల అనంతరం స్వయంగా మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లి పరిశీలిస్తానన్నారు. ఈ నెల 28న ‘అమ్మ ఒడి’ మారుమూల అటవీ ప్రాంతాలు, గిరి జన గూడాల్లో నివసించే గర్భిణుల సౌకర్యా ర్థం ఈనెల 28న ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. గర్భిణు లను వారి నివాసాల నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతోపాటు ప్రసవం తర్వాత తల్లినీ, బిడ్డను క్షేమంగా ఇంటి వద్ద వదిలిపె ట్టేందుకు 50 వాహనాలను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ఇక ఆస్పత్రుల్లో మరణించిన పేదల మృతదేహాలను వారి గ్రామాలకు ఉచితంగా తరలించేం దుకు ఏర్పాటు చేసిన ‘హెర్సే’ అంబు లెన్సు లపై టీఆర్ఎస్ సభ్యు లు రసమయి బాల కిషన్, చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్యలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు హెర్సే అంబులెన్సుల ద్వారా 1,056 మృతదేహాల ను స్వస్థలాలకు చేర్చామన్నారు. త్వరలోనే మరో 30 వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 108 పథకం కోసం కొత్తగా 145 వాహనాలను కొనుగోలు చేస్తున్నామన్నారు. -
ఉద్యమ కేసులు ఎత్తివేస్తాం
ఇప్పటికే 1,500 వరకు ఎత్తివేత: హోంమంత్రి నాయిని సాక్షి, వికారాబాద్: తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో నిర్మించిన పోలీస్‌స్టేషన్, హైవే పెట్రోలింగ్ ఔట్‌పోస్టు, కొడంగల్‌లో నిర్మించిన హైవే పెట్రోలింగ్ ఔట్‌పోస్టు నూతన భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఇప్పటికే 1,500 వరకు ఎత్తివేశామని తెలిపారు. కేసుల ఎత్తివేత విషయంలో రాష్ట్ర కేబినేట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫైళ్లను సచివాలయానికి పంపించాలని, న్యాయశాఖకు నివేదించి నిర్ణ యం తీసుకుంటామని నారుుని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లు కేటారుుంచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయంతో రోడ్ సెక్టార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుందన్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవే నంబర్.4ను డెమో కారిడార్‌గా గుర్తించినట్లు చెప్పారు. పోలీసు అకాడమీ జంక్షన్ నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు ఈ హైవే 126 కిలోమీటర్లు ఉంటుందని వివరించారు. ఒకప్పుడు ప్రజలు పోలీసుల వద్దకు వచ్చేవారని, ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులే ప్రజల వద్దకు వెళ్తున్నారని హోంమంత్రి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో సెంట్రల్ కమాండెంట్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది అందుబాటు లోకి వస్తే రాష్ట్రం మొత్తం శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమం లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధి విధానం తీసుకొస్తాం
- ప్రణాళిక శాఖ సమావేశంలో మంత్రి నాయిని - విదేశాల్లో డిమాండ్ ఉన్న రంగాలు గుర్తించి.. యువతకు శిక్షణ - కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు చర్యలు.. సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల్లో నైపుణ్య ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. వాటిలో ప్రాధాన్యమున్న రంగాలను గుర్తిస్తే రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి విధానాన్ని (స్కిల్ డెవలప్మెంట్ పాలసీ) అమల్లోకి తీసుకొస్తున్నాం’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. స్కిల్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక శాఖ సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంజీ గోపాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సాంకేతిక శాఖ సంచాలకులు వాణీప్రసాద్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కిషన్, పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధితో నిరుద్యోగం లేకుండా చేస్తామని, ఈ విధానానికి కేంద్ర నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని నాయిని అన్నారు. పారిశ్రామిక సంస్థలు సీఎస్ఆర్ కింద నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నాయని, వీటిని ఒకే గొడుగు కిందకు చేర్చితే మంచి ఫలితాలు వస్తాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. వివిధ శాఖలు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు ప్రణాళిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పాపారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్లలోపు వారు 2.2 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 1.51 కోట్ల మంది యువతేనని పేర్కొన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో 50.9 లక్షల మ్యాన్‌పవర్ అవసరమని బీపీ ఆచార్య అన్నారు. -
ఆత్మరక్షణకే కాల్పులు
హోంమంత్రి నాయిని హైదరాబాద్ : రాజీవ్ రహదారిని ముట్టడించే క్రమం లో ముందుగా మల్లన్నసాగర్ నిర్వాసితులే పోలీసులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడి చేశారని.. దాంతో పోలీసులు ఆత్మరక్షణకోసం లాఠీచార్జి, కాల్పు లు జరిపారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం వీఎస్టీలో హరితహారంలో పాల్గొన్న ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం ఎకరాకు రూ.2 లక్షలే వస్తుందని, తాము తీసుకువచ్చిన 123 జీవో వల్ల ఎకరాకు రూ.6లక్షలతో పాటు ఇళ్లకు ఇళ్లు.. ఇలా ఏవి నష్టపోతే అవి ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాలకు ఏదీ దొరక్క దీనిపై కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. -
బాబుకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు
హోం మంత్రి నాయిని సైదాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టే హక్కు లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కుట్రలే వెయ్యి మంది విద్యార్థుల బలిదానానికి కారణమయ్యాయని మండిపడ్డారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం తిరుగుతున్నారని నాయిని ప్రశ్నించారు. ఐఎస్‌సదన్ డివి జన్‌కు చెందిన టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి శుక్రవారం హోం మంత్రి నాయిని సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్‌లో ఏర్పాటు చేసిన సభలో కోట్ల మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ టీడీపీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఆరోపించారు. ‘నీవు ఆంధ్రాకి ముఖ్యమంత్రివి. నీ నూకలు అక్కడే చెల్లుతలేవు. ఇక ఇక్కడేం చెల్లుతుందని’ ప్రశ్నిం చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 1.80 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని తెలి పారు. అద్దె ఇళ్లలో ఉంటున్నవారికి నగర శివారులో వెయ్యి ఎకరాలలో సీఎం అపార్ట్మెంట్లు కట్టించి ఇస్తారని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఐఎస్ సదన్ డివిజన్ అభ్యర్థి సామ స్వప్నసుందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అమరవాది లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, మన్నె రంగా, సామ సుందర్‌రెడ్డి, మామిడోజు శంకరాచారి, లక్ష్మణ్‌రావు, పన్నాల పర్వతాలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజుకు మున్సిపల్ సమ్మె
♦ మంత్రి నాయినితో కార్మిక నేతల చర్చలు మళ్లీ విఫలం ♦ వేతనాల పెంపుపై స్పష్టమైన హామీకి కార్మికుల పట్టు ♦ తప్పకుండా న్యాయం చేస్తాం..ముందు సమ్మె విరమించండి: మంత్రి ♦ మొండిగా వెళ్తే బెదరం.. చీపురు పట్టి మేమే చెత్త తొలగిస్తామని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. బుధవారం నాటికి మూడోరోజుకు చేరుకుంది. హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి నేతృత్వంలో బుధవారం సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం మంత్రి, కార్మిక జేఏసీ నేతలు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మిక నేతలు స్పష్టంచేశారు. ‘‘ఏ ప్రాతిపదికన వేతనాలను పెంచుతారో సీఎం కేసీఆరే నిర్ణయిస్తారు. కార్మికులు సమ్మె విరమించి సర్కారుకు కొంత సమయం ఇవ్వాలి’’ అని నాయిని పేర్కొన్నారు. మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ఎవరూ పట్టు వీడకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ‘‘కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ సానుభూతితో ఉన్నారు. కొంచెం సమయం కావాలని కార్మికులకు చెప్పి వారితో సమ్మెను విరమింపజేయించాలన్నారు. తప్పకుండా మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తాం. మొండిగా సమ్మె చేస్తామంటే మేం కూడా బెదరం. చీపురు పట్టి మేమే చెత్తను తొలగిస్తాం’’ అని చర్చల అనంతరం మంత్రి నాయిని వ్యాఖ్యానించారు. డిమాండ్లను పరిష్కరిస్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమైనా... కార్మిక నేతల నిర్దిష్ట గడువును కోరడం సరికాదన్నారు. సమ్మె నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా సమ్మె విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సమ్మె కొనసాగిస్తే సీఎంకు కోపం వస్తదని, అప్పుడు తీవ్ర పరిస్థితులు ఉంటాయని అధికారులు బెదిరిస్తున్నారని కార్మిక నేతలు ఆరోపించారు. సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆయన వద్దకు చర్చల కోసం ఎందుకు తీసుకెళ్లలేదని వారు ప్రశ్నించారు. సమ్మె కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. తీవ్ర సమస్యల్లో ఉండడం వల్లే సమ్మె చేస్తున్నామని, ప్రజలకు జీవితాంతం సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. ‘చెత్త’పై పిల్ 5 రోజులుగా జంటనగరాల్లో చెత్త పేరుకుపోయిందని, దీన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది రాజేశ్వరి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. లంచ్ మోషన్ రూపంలో విచారించాలని న్యాయవాది సత్యంరెడ్డి కోర్టును కోరారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ ఈ పిల్‌ను గురువారం విచారణ చేపడతామని పేర్కొంది. చెత్త వల్ల వ్యాధులు ప్రబలే అవకాశముందని, రంజాన్ కావడంతో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ వివరించారు.