నైపుణ్యాభివృద్ధి విధానం తీసుకొస్తాం
- ప్రణాళిక శాఖ సమావేశంలో మంత్రి నాయిని
- విదేశాల్లో డిమాండ్ ఉన్న రంగాలు గుర్తించి.. యువతకు శిక్షణ
- కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు చర్యలు..
సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల్లో నైపుణ్య ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. వాటిలో ప్రాధాన్యమున్న రంగాలను గుర్తిస్తే రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి విధానాన్ని (స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీ) అమల్లోకి తీసుకొస్తున్నాం’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. స్కిల్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక శాఖ సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంజీ గోపాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సాంకేతిక శాఖ సంచాలకులు వాణీప్రసాద్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కిషన్, పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు.
నైపుణ్యాభివృద్ధితో నిరుద్యోగం లేకుండా చేస్తామని, ఈ విధానానికి కేంద్ర నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని నాయిని అన్నారు. పారిశ్రామిక సంస్థలు సీఎస్‌ఆర్ కింద నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నాయని, వీటిని ఒకే గొడుగు కిందకు చేర్చితే మంచి ఫలితాలు వస్తాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. వివిధ శాఖలు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు ప్రణాళిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పాపారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్లలోపు వారు 2.2 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 1.51 కోట్ల మంది యువతేనని పేర్కొన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో 50.9 లక్షల మ్యాన్‌పవర్ అవసరమని బీపీ ఆచార్య అన్నారు.