వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించండి
తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్
సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరగాలి.. 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి నీరు ఇవ్వాలి
మునిసిపల్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమస్యగా మారిన చెత్త తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, దీనిని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలన్నారు. శుక్రవారం రాత్రి సచివాలయంలో మునిసిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్‌మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్టులపై చర్చించారు.
ఈ సందర్భంగా వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరగాలని, మార్పు రాష్ట్రంలో ప్రతిచోట కనిపించాలన్నారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ గాడిలో పడాలని సూచించారు. టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని, ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలన్నారు.
యూఎల్బీల్లో 50 లక్షల గృహాలు ఉండగా, 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని, మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని చంద్రబాబు తెలిపారు.
సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేయండి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించాలని చంద్రబాబు పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రూ.100 సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తున్నామని తెలిపారు.
ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని.. రూ.లక్ష కట్టిన వారికి టీడీపీ శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా కార్యకర్త మృతిచెందితే అంత్యక్రియలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు. త్వరలో రెండో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తానని చంద్రబాబు తెలిపారు.
అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్లు
అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్ల ఆర్థిక రుణ సాయం అందించేందుకు హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు కూడా హడ్కో సంసిద్ధత వ్యక్తంచేసిందని ఆయన తెలిపారు.
హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ, ఇతర ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment