ట్రిపుల్‌వన్‌ అడ్రస్‌ తెలుసా హైడ్రా? | HYDRA officials demolishing structures at Gandipet FTL | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌వన్‌ అడ్రస్‌ తెలుసా హైడ్రా?

Published Fri, Aug 23 2024 4:51 AM | Last Updated on Fri, Aug 23 2024 4:51 AM

HYDRA officials demolishing structures at Gandipet FTL

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌గా ట్రిపుల్‌ వన్‌ జీవో ప్రాంతం 

గండిపేట ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు 

ఆ బుల్డోజర్లు అన్ని అక్రమ నిర్మాణాలపైకి వెళతాయా? 

‘ఎంపిక’చేసిన వాటికే పరిమితమా? అనే ప్రశ్నలు

ప్రస్తుతం లక్షల్లో గృహాలు, ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు, వాణిజ్య భవనాలు

111 జీవో పరిధిలో 8 ఏళ్ల క్రితమే 12వేలకుపైగా అక్రమ నిర్మాణాలను గుర్తించిన సర్కార్‌ 

చర్యలు తీసుకోకుండా అధికారుల ఉదాసీనత.. దాంతో మరింతగా ఉల్లంఘనలు 

హిమాయత్‌సాగర్, గండిపేట పరీవాహక ప్రాంతాల్లో స్థలమేదైనా 10 శాతమే నిర్మాణాలకు చాన్స్‌.. కానీ విచ్చలవిడిగా కట్టడాలు 

ఇలాగే కొనసాగితే మరో హుస్సేన్‌సాగర్‌ లాగా గండిపేట రిజర్వాయర్‌.. తాజాగా హైడ్రా, మున్సిపల్‌ శాఖల కూల్చివేతలతో ప్రజల్లో చర్చ

‘పరిధి’ దాటుతోందా? 
చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వచించింది. కానీ ట్రిపుల్‌ వన్‌ జీవో పరిధిలోని జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో సింహభాగం ఔటర్‌ వెలుపలే ఉంది. దీంతో ‘హైడ్రా’ పరిధిని దాటి, టార్గెట్‌ చేసి మరీ బుల్డోజర్లను ప్రయోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

సెలబ్రిటీల నిర్మాణాలను ‘టచ్‌’ చేస్తారా? 
111 జీవో పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. వాటిలో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రు­లు, బహుళ జాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీల లగ్జరీ ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని ‘టచ్‌’ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను ప్రయోగించగలదా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: వందేళ్లుగా భాగ్యనగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అక్రమ భవనాలను తొలగించి, జలాశయాలను పరిరక్షించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కానీ ‘ఈ కూల్చివేతలను కేవలం ‘ఎంపిక’చేసిన భవనాలు, నిర్మాణాలకే పరిమితం చేస్తారా? లేక అక్రమ నిర్మాణాలు అన్నింటిపైకీ బుల్డోజర్లు వెళతాయా? విచ్చలవిడి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన 111 జీవో పరిధిలోని ప్రాంతాలపై ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా)’ దృష్టిపెడుతుందా?’అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గండిపేట జలాశయం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోని అక్రమ నిర్మాణాలపైకి ‘హైడ్రా’ బుల్డోజర్లను నడిపిస్తున్న నేపథ్యంలో.. ట్రిపుల్‌ వన్‌ జీవో వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 

‘ట్రిపుల్‌ వన్‌’పై తీవ్ర గందరగోళం 
జంట జలాశయాలను కాపాడేందుకు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 40 ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్‌ జోన్‌) పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో–192ను తీసుకొచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో–111ను తెల్చింది. 

ఇటీవలి వరకు అది కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ దాహార్తిని తీర్చేందుకు జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌లో ట్రిపుల్‌ వన్‌ జీవోను రద్దు చేసి, దాని స్థానంలో జీవో నంబర్‌ 69ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడి 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. కానీ ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈలోపు ఎన్నికలు సమీపించడం, ప్రభుత్వం మారడంతో జీవో–111పై గందరగోళం నెలకొంది. 

‘ఎంపిక’ చేసిన భవనాలపైనేనా? 
గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీకి చేరువలో 84 గ్రామాలు, 1.32 లక్షల ఎకరాల భూములు, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. క్లుప్తంగా జీవో– 111 పరిధి ఇది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే–అవుట్లకు అనుమతి లేదు. ఈ ప్రాంతంలోని ఏ స్థలంలో అయినా దాని విస్తీర్ణంలో కేవలం 10శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టవచ్చు. అదీ శాశ్వత నిర్మాణం అయి ఉండకూడదు. నీటి సహజ ప్రవాహానికి ఏమాత్రం అడ్డుగా ఉండకూడదు. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితయ్యాయి. 

అక్రమార్కులు అధికారులతో కుమ్మకై అడ్డగోలుగా నిర్మాణాలను చేపట్టారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, మున్సిపల్‌ శాఖల అధికారులు జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఇది ఈ జలాశయాల పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై ఉంటుందా? లేదా కేవలం ‘ఎంపిక’ చేసిన నిర్మాణాల కూల్చివేతతోనే ఆగిపోతుందా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. జలాశయాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు కూడా భవిష్యత్తులో హుస్సేన్‌సాగర్‌లా మురికికూపమైపోయే మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అనుమతి లేకున్నా లక్షల్లో నిర్మాణాలు 
40 ఏళ్ల కిందటే జంట జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్‌ జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చినా.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ వచ్చాయి. గత పది, పదిహనేళ్లలో విపరీతంగా పెరిగాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇష్టారీతిగా నిర్మాణాలు సాగుతున్నా చూసీచూడనట్టు వదిలేశారు. ప్రధానంగా మెయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్‌ మండలాల్లోని ట్రిపుల్‌ వన్‌ జీవో ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, హోటళ్లు, ఇతర భవన నిర్మాణాలు వెలిశాయి. జీవో–111 పరిధిలో 7 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో మొత్తం 426 అక్రమ లే–అవుట్లు, 10,907 గృహాలు, 1,363 వాణిజ్య నిర్మాణాలు, 190 పారిశ్రామిక, ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హైకోర్టుకు నివేదించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా.

అటు అభివృద్ధి.. ఇటు మనుగడ.. 
అభివృద్ధిలో వెనుకబడుతున్నామని, జీవో–111 ఎత్తే యాలని ఆ ప్రాంతంలోని వారు మొదట్నుంచీ కోరుతున్నారు. అలా చేస్తే జంట జలాశయాల మనుగడకు విఘాతం కలుగుతుందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ సర్కారు జీవో–111పై కోదండరెడ్డి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. 
– చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ ప్రెసిడెంట్‌ 

ఫిఫ్త్‌ సిటీగా జీవో–111 
జీవో–111 పరిధిలోని 84 గ్రామాలను ఫిఫ్త్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. జీవో పరిధిలోని 84 గ్రామాలకు నెట్‌ జీరో పాలసీని అవలంబించేలా ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. పర్యావరణానికి హాని కలిగించని, తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వాన నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. 
– జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement