‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర’ గొప్ప ప్రయత్నం
వి.ప్రకాశ్ రచించిన పుస్తక ఆవిర్భావంలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు వి.ప్రకాశ్ రచించిన ‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర - రాష్ట్ర ఆవిర్భావం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తక రచన ఒక గొప్ప ప్రయత్నమని, ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్రను ఇంతవరకు ఎవరూ కూడా గ్రంథస్తం చేయలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకాశ్‌ను అభినందించారు. ఈ పుస్తకం చదివితే తెలంగాణ చరిత్ర పరిపూర్ణంగా అవగాహనకు వస్తుందని, ఇది అవశ్య పఠనీయమని ముఖ్యమంత్రి అన్నారు.
భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే అనేక పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీలతో పాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలల గ్రంథాలయాల్లో కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచితే మంచిదని అన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాశ్ దంపతులను సన్మానించారు. రచయిత ప్రకాశ్ ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులకు అంకితం ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, మంత్రి జగదీశ్‌రెడ్ది, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.