ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పింఛన్ వృద్ధులకు భరోసా, భద్రత కల్పించినట్లవుతుందని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. స్థానిక చిన వెంకటరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో
నల్లగొండ రూరల్ : ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పింఛన్ వృద్ధులకు భరోసా, భద్రత కల్పించినట్లవుతుందని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. స్థానిక చిన వెంకటరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పలువురు వృద్ధులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృద్ధులు పింఛను డబ్బులతో సొంత అవసరాలతోపాటు మనవళ్లకు పెన్నులు, పెన్సిళ్లు కొనియవచ్చని తెలిపారు. దీంతో వారి కుటుంబ బంధం ధృడమవుతుందన్నారు. 2004కు ముందు రూ.70 కోట్లతో రూ.70 పింఛన్ ఇస్తే, నేడు తెలంగాణ ప్రభుత్వం రూ.4వేల కోట్లతో పింఛన్లు అందజేస్తోందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలను నెలవారీగా అందజేస్తామన్నారు.
కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలలకు 65 సంవత్సరాల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకుంటే పింఛను మంజూరు చేస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కాకతీయ కాలంలో కళకళలాడిన చెరువులను ఆంధ్రా పాలకులు ఆక్రమించారని ఆరోపించారు. రూ.2వేల కోట్లతో 45వేల చెరువుల్లో పూడిక తీసి అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులై ఉండి పింఛన్ రానివారు ఆందోళన చెందవద్దని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని తెలిపారు. రూ.15వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఆహారభద్రత కార్డులను అందిస్తామన్నారు.
ప్రతి వ్యక్తికి 6కిలోల బియ్యాన్ని అందజేయనున్నట్లు తెలి పారు. దీనివల్ల రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఆంధ్ర పాలకుల ద్రోహం వల్ల విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు స్పష్టం చేశారని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ఆసరా పథకం పేదలందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. గతంలో పింఛన్ పొందడానికి ఒకరు చనిపోతే తప్ప మరొకరికి వచ్చేది కాదని, 2004 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి రూ.200 రూపాయల ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.1000 అందజేయడం అభినందనీయమన్నారు. ఎప్పుడు అర్హత వస్తే అప్పుడు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ ఆసరా పథకం వల్ల రాష్ట్రంలో భిక్షాటన చేసేవారే లేకుండా అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 5లక్షల 50వేల పింఛను దరఖాస్తులు వచ్చాయని, 3లక్షల 30వేల దరఖాస్తులను అర్హులుగా గుర్తించామని తెలిపారు. గతం కంటే 40వేలు తగ్గాయని పేర్కొన్నారు.
అనర్హులు కూడా రూ.200 రూపాయల పెన్షన్ తీసుకోవడం వల్ల ఈ తేడా ఉందన్నారు. అర్హుల జాబితాను రెండు రోజుల్లో డాటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. శుక్రవారం వరకు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ వృద్ధులను ఆదుకునేందుకు కేసీఆర్ వెయ్యి రూపాయల పింఛను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని అన్నారు. మొదటగా రూ.వెయ్యి పెన్షన్ అందుకున్న కంచనపల్లికి చెందిన మంద ఎల్లయ్య, నర్సింహ, ధనమ్మలు వారి అనుభూతిని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, ఏజేసి వెంకట్రావు, ఎంపీపీ దైద రజితా వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల రాధ, ఆర్డీఓ జహీర్, తహసీల్దార్ వై.అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ శైలజ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, కౌన్సిలర్ హారికాఅశోక్, అభిమన్యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.